సుప్రీంకోర్టు కీలక ఆదేశం..భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో విద్వేష ప్రసంగాలు చేయొద్దు

సుప్రీంకోర్టు కీలక ఆదేశం..భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో విద్వేష ప్రసంగాలు చేయొద్దు
  • వాటి కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి: సుప్రీంకోర్టు
  • ప్రజలు వాక్ స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ విలువ తెలుసుకోవాలని సూచన

న్యూఢిల్లీ: భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో విద్వేషపూర్వక ప్రసంగాలు చేయొద్దని సుప్రీంకోర్టు సూచించింది. అలాంటి ప్రసంగాల కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయితే, అది భావప్రకటనా స్వేచ్ఛను ఉల్లంఘించకూడదని సూచించింది. ప్రజలు వాక్ స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ విలువ తెలుసుకోవాలని, స్వీయ నియంత్రణను పాటించాలని స్పష్టం చేసింది. 

వజాహత్ ఖాన్ అనే వ్యక్తి హిందూ దేవతపై సోషల్ మీడియా ప్లాట్‌‌‌‌ఫాం ఎక్స్‌‌‌‌లో అభ్యంతరకర పోస్టులు చేసినందుకు పశ్చిమ బెంగాల్, అస్సాం, మహారాష్ట్ర, హర్యానా తదితర రాష్ట్రాల్లో ఎఫ్ఐఆర్​లు నమోదయ్యాయి. దీంతో అతడు సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. ఈ పిటిషన్​ను సోమవారం జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌‌‌‌ తో కూడిన బెంచ్ ​విచారించింది. 

ఈ సందర్భంగా జస్టిస్ నాగరత్న మాట్లాడుతూ.. "పౌరులు వాక్‌‌‌‌ స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ విలువను తెలుసుకోవాలి. ఉల్లంఘనలు జరిగితే ప్రభుత్వాలు జోక్యం చేసుకోవచ్చు. కానీ, ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఎవరూ కోరుకోరు" అని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో విభజన ధోరణులను నియంత్రించాలని, అయితే ఇది సెన్సార్‌‌‌‌షిప్ కాదని కోర్టు స్పష్టం చేసింది. పౌరుల మధ్య సౌభ్రాతృత్వం ఉండాలని బెంచ్ పేర్కొంది. 

వజాహత్ ఖాన్ ఎక్స్‌‌‌‌లో హిందూ దేవతపై అభ్యంతరకర పోస్టులు చేసినందుకు జూన్ 9న కోల్‌‌‌‌కతా పోలీసులు అరెస్టు చేశారు. అతను గతంలో షర్మిష్ఠా పనోలీ అనే సోషల్ మీడియా ఇన్‌‌‌‌ఫ్లుయెన్సర్‌‌‌‌పై సామాజిక విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినందుకు ఫిర్యాదు చేశారు. ఆమె కూడా అరెస్టయి తర్వాత బెయిల్‌‌‌‌పై విడుదలయ్యారు. అయితే, ఖాన్ తన పాత ట్వీట్‌‌‌‌లను తొలగించి క్షమాపణ చెప్పినట్టు ఖాన్​తరఫు అడ్వకేట్ కోర్టులో వాదించారు. 

అయినప్పటికీ, ఖాన్‌‌‌‌పై పలు రాష్ట్రాల్లో ఎఫ్​ఐఆర్​లు నమోదయ్యాయని, అవి షర్మిష్ఠా పనోలీపై అతను చేసిన ఫిర్యాదుకు ప్రతీకారంగా ఉన్నాయని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఈ కేసు తదుపరి విచారణ వరకు ఖాన్‌‌‌‌కు అరెస్టు నుంచి మధ్యంతర రక్షణను బెంచ్ పొడిగించింది. 

అలాగే, సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్ట్‌‌‌‌లను నియంత్రించడానికి మార్గదర్శకాలను పరిశీలిస్తున్నందున.. ఆన్​లైన్​లో విద్వేషపూరిత ప్రసంగాలను నియంత్రించే మార్గాలను సూచించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు కోరింది.