మలయాళం నటుడు దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన పీరియాడికల్ చిత్రం ‘కాంత’ (KAANTHA). భారీ అంచనాలతో తెరకెక్కించిన ఈ మూవీ శుక్రవారం (2025 నవంబర్ 14న) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది.
నటులు సముద్రఖని, రానా, రవీంద్ర విజయ్ కీలక పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి ‘స్పిరిట్ మీడియా’, దుల్కర్ సల్మాన్ ‘వేఫేర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్’, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ సంయుక్తంగా కాంత మూవీ నిర్మించారు. సెల్వమణి సెల్వరాజ్ రచన, దర్శకత్వం వహించారు. జాను చందర్ సంగీతం అందించగా, డానీ సాంచెజ్ లోపేజ్ సినిమాటోగ్రఫీ, లెవెలిన్ ఆంథోని గొంజల్వేజ్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.
అయితే, ఈ మూవీ కథకు సంబంధించి తమిళనాడులో వివాదాలు చోటు చేసుకున్నాయి. తమిళనాడులోని లెజెండరీ గాయకుడు, నటుడు ఎం.కె. త్యాగరాజ భాగవతార్ కుటుంబ సభ్యులు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఈ చిత్రంపై కోర్టు నోటీసులు జారీ చేసింది. అలా ఒకవైపు వివాదం నడుస్తుండగా, మరోవైపు బలమైన ప్రచారంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన 'కాంత' ఎలా ఉంది? ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకొచ్చింది? అనేది పూర్తి రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటంటే:
1950 నేపథ్యంలో స్టార్ హీరోకి, గొప్ప దర్శకుడికి మధ్య జరిగే కథ ఇది. అయ్య (సముద్రఖని) పేరున్న దర్శకుడు. తన తల్లి శాంత కథను అదే పేరుతో సినిమాగా తీయడం ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్. ఒకప్పటి ఆయన ప్రియ శిష్యుడైన టీకే మహదేవన్ (దుల్కర్) ఇందులో హీరో. జీరోగా ఉన్న అతన్ని స్టార్ హీరోని చేసింది అయ్యనే. కానీ వీళ్లిద్దరి మధ్య ఇగో క్లాషెస్. దీంతో సినిమా మధ్యలోనే ఆగిపోతుంది. ఎనిమిదేళ్ల తర్వాత ఓ ప్రొడ్యూసర్ చొరవతో తిరిగి ఈ ప్రాజెక్ట్ మొదలవుతుంది. కానీ హీరో మహదేవన్ సెట్‌లో దర్శకుడిని డామినేట్ చేస్తుంటాడు. ‘శాంత’ టైటిల్‌ను ‘కాంత’గా మార్చడంతో పాటు క్లైమాక్స్ కూడా తన స్టార్ ఇమేజ్‌కు తగ్గట్టుగా మార్చాలని పట్టుబడుతుంటాడు.
ఇందులో కొత్త అమ్మాయి కుమారి (భాగ్యశ్రీ బోర్సే)ను హీరోయిన్‌గా తీసుకుంటారు. ఈమె అయ్య శిష్యురాలు కావడంతో సెట్‌లో ఆయన చెప్పిందే ఫాలో అవుతుంటుంది. మహదేవన్‌కు ఆమె వ్యవహారశైలి నచ్చకపోయినప్పటికీ తన అందం, టాలెంట్‌కు ఫిదా అవుతాడు. క్రమంగా ఇద్దరూ ప్రేమలో పడతారు. కానీ అప్పటికే ఓ మీడియా మొఘల్ కూతురితో అతనికి పెళ్లయింది. మరోవైపు మహదేవన్, అయ్య మధ్య సయోధ్య కుదర్చడానికి కుమారి ప్రయత్నాలు చేస్తుంటుంది. కానీ అవేవి వర్కవుట్ అవవు. ఈ ఇద్దరి ఇగో క్లాషెస్‌తో మిగతా యూనిట్ అంతా ఇబ్బందులు పడుతుంటారు. ఎలాగోలా షూటింగ్ చివరి దశకు చేరుకుంటుంది. కానీ చివరి రోజు సెట్‌లో జరిగిన పరిణామాలతో ఒకే సీన్ మిగిలి ఉండగా షూటింగ్ ఆగిపోతుంది.
మరోవైపు అదేరోజు రాత్రి స్టూడియోలో ఓ హత్య జరుగుతుంది. ఆ హత్య కేసును ఛేదించడానికి ఫీనిక్స్ (రానా) రంగంలోకి దిగుతాడు. స్టూడియో మొత్తం తన ఆధీనంలోకి తీసుకుని విచారణ మొదలుపెడతాడు. ఇంతకూ ఆ హత్య చేసిందెవరు..? వీళ్లిద్దరి ఇగో ఇష్యూస్‌కి కారణమేంటి..? ఇద్దరిలో ఎవరు చెప్పిన క్లైమాక్స్‌తో సినిమా పూర్తయింది.. అనేది మిగతా కథ.
ఎలా ఉందంటే..
ప్రేక్షకుల చప్పట్లకు తగ్గట్టుగా నటించాలనే హీరో, కథకు తగ్గట్టుగా నటించాలనే దర్శకుడు.. వీరి మధ్య ఇగో క్లాషెస్ ఈ సినిమా మెయిన్ స్టోరీ. ఫస్ట్ హాఫ్ అంతా హీరోయిన్‌తో లవ్ స్టోరీకి ప్రాధాన్యతను ఇచ్చిన దర్శకుడు, సెకెండాఫ్ మొత్తం మర్డర్ మిస్టరీ జానర్‌లోకి మార్చాడు. సినిమాలో ఓ వైపు సినిమా షూటింగ్ జరుగుతుండటం, పీరియాడిక్ టచ్, నటీనటుల పెర్ఫార్మెన్స్, అప్పటి ఆర్ట్ వర్క్, మ్యూజిక్ లాంటివన్నీ ఈ సినిమాకు గ్రాండ్ లుక్ తీసుకొచ్చాయి. ప్రేక్షకులను కూడా బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాలానికి తీసుకెళ్లగలిగాయి.
అయితే సెకండాఫ్‌లో రానా సీన్స్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ప్రస్తుత కాలాన్ని గుర్తుచేస్తుంటాయి. అదీకాక సెకండాఫ్ మొత్తం మర్డర్ మిస్టరీ చుట్టూనే తిరగడం సాగతీతగా అనిపిస్తుంది. అయితే, హంతకుడు ఎవరనేది ముందే ఊహించినా.. ఎందుకు చేశాడనేది మాత్రం గెస్ చేయలేం. క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.
గొప్ప పీరియాడిక్ సెటప్‌లో ఈ మూవీని ప్లాన్ చేయడంలో సక్సెస్ అయిన దర్శకుడు.. ఈ కథను సరైన రీతిలో బిగి సడలకుండా తెరకెక్కించడంలో తడబడ్డాడు. ఇప్పటికే అయ్యప్పన్ కోషియుమ్, (భీమ్లా నాయక్), డ్రైవింగ్ లైసెన్స్ లాంటి చిత్రాల్లో ఇగో క్లాషెస్‌ను తారా స్థాయిలో చూసిన ప్రేక్షకులకు ఇది అంతగా రుచించదు.
అయితే, ఇగో క్లాషెస్‌ను అద్భుతంగా చూపించిన దర్శకుడు.. అవి తలెత్తడానికి తగ్గ కారణాన్ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు. నిడివి కూడా ఎక్కువుండటం, స్క్రీన్‌పై నటీనటుల పెర్ఫార్మెన్స్ అబ్బురపరుస్తున్నప్పటికీ.. అందుకు తగ్గ బిగి సడలని స్క్రీన్‌ప్లే లేకపోవడంతో, ఎప్పుడెప్పుడు థియేటర్ నుంచి బయట పడదామనే విసుగు ప్రేక్షకులకు కలుగుతుంది.
ఒకప్పుడు తమిళనాట సూపర్ స్టార్‌గా రాణించిన ఎంకే త్యాగరాజ భాగవతార్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారనే వివాదం నేపథ్యంలో ఇందులో ఆ అంశాన్ని ఎంతవరకూ టచ్ చేశారనే విషయంపై ఆసక్తి నెలకొంది. అయితే కేవలం హీరో జైలుకెళ్లి రావడం వరకు మాత్రమే టచ్ చేసి, మిగతాదంతా ఫిక్షన్‌ను జోడించారు.
ఎవరెలా నటించారంటే..
నటీనటుల పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ ఆ టీకే మహదేవన్ పాత్రలో ఒదిగిపోయాడు. సముద్రఖని కూడా అదే స్థాయిలో మెప్పించాడు. గత చిత్రాలతో పోల్చితే భాగ్యశ్రీకి నటనకు ఆస్కారమున్న పాత్ర లభించింది. కొన్ని చోట్ల తేలిపోయినా చాలావరకూ ఆ పాత్రలో ఇమిడిపోయింది. రెండు కోణాల్లో సాగే పాత్రలో ఆయన రాజీపడని ఓ దర్శకుడిగా అయ్య పాత్రలో సముద్రఖని తన నటనతో అదరగొట్టారు. అయ్యా పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. రానా ఇచ్చిన ఎంట్రీ అదిరిపోతుంది. ఎప్పటిలాగే తనదైన నటనతో మెప్పించాడు. మిగతా పాత్రల్లో నటించిన వారు తమ పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నీకల్ అంశాలు:
జాను చందర్ ఇచ్చిన సాంగ్స్ బాగున్నాయి. ఫీల్ గుడ్ అండ్ ఎమోషనల్ ట్యూన్స్ ఇచ్చారు. అలాగే, మరో మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బెజోయ్ సినిమాకి ప్రధాన బలంగా నిలిచారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాకి హైప్ తీసుకొచ్చారు. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు.
సినిమాటోగ్రఫీ అందించిన డానీ సాంచెజ్ లోపేజ్ తనదైన విజువల్స్‌తో మెప్పించాడు. పీరియాడిక్ డ్రామాగా వచ్చిన బ్లాక్ అండ్ వైట్ కాలాన్ని వెనక్కి తీసుకొచ్చి.. తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. సినిమాకి మరో ప్రధాన బలంగా సినిమాటోగ్రఫర్ డానీ సాంచెజ్ నిలిచారు. లెవెలిన్ ఆంథోని గొంజల్వేజ్ ఎడిటింగ్ బాగుంది. ఇక చివరగా.. రైటర్, డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్ వినూత్న కథతో వచ్చి, స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేశాడు.
'కాంత' వంటి డిఫెరెంట్ స్టోరీతో డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్.. తమిళ సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చి అదరగొట్టారు.అంతకు ముందు నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ సిరీస్ 'ది హంట్ ఫర్ వీరప్పన్' తో సెల్వమణి సెల్వరాజ్ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇకపోతే, నిర్మాతలు ఉన్నతంగా సినిమా తీర్చిదిద్దడంలో సక్సెస్ అయ్యారు.
