Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్ లగ్జరీ కార్లు సీజ్.. కస్టమ్స్‌పై కోర్టుకెక్కిన స్టార్ హీరో!

Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్ లగ్జరీ కార్లు సీజ్.. కస్టమ్స్‌పై కోర్టుకెక్కిన స్టార్ హీరో!

సౌత్ సినీఇండస్ట్రీలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన యువ నటులలో ఒకరు దుల్కర్ సల్మాన్. ఇప్పుడు ఈ స్టార్ హీరో అనూహ్యంగా ఓ లగ్జరీ కారు అక్రమ రవాణా కేసులో చిక్కుకున్నారు. ఇది సినీ పరిశ్రమలో తీవ్ర కలకలం రేపుతోంది. భూటాన్ నుండి భారత్‌కు చట్టవిరుద్ధంగా వచ్చిన విలాసవంతమైన వాహనాలపై కస్టమ్స్ దాడులు నిర్వహించారు. ఇందులో దుల్కర్ ఎస్‌యూవీ కూడా పట్టుబడటంతో ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది.

కస్టమ్స్ నిఘా..  'ఆపరేషన్ నుమ్‌ఖోర్'

కస్టమ్స్ అధికారులు 'ఆపరేషన్ నుమ్‌ఖోర్' పేరుతో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించారు.  ఇందులో భాగంగా పన్ను ఎగవేసి, నకిలీ పత్రాలతో దేశంలోకి దిగుమతి అవుతున్న విదేశీ వాహనాలను లక్ష్యంగా చేసుకుని కేరళలోని 35 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో నటులు దుల్కర్ సల్మాన్ , పృథ్వీరాజ్ సుకుమారన్ నివాసాల్లో కూడా సోదాలు చేశారు.  ఈ ఆఫరేషన్ లో మొత్తం 38 విలాసవంతమైన కార్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ALSO READ : జూబ్లీహిల్స్లో సినీ నటికి కాబోయే భర్త ఆత్మహత్య..

కేరళ రాష్ట్రంలోనే దాదాపు 150 నుండి 200 అక్రమంగా రవాణా చేయబడిన విదేశీ కార్లు ఉన్నట్లు కస్టమ్స్ ప్రివెంటివ్ కమిషనర్ టి. తిజు వెల్లడించారు. ఒక వ్యవస్థీకృత ముఠా ఈ స్మగ్లింగ్‌కు పాల్పడుతోందని, వీరు ముఖ్యంగా ధనవంతులను లక్ష్యంగా చేసుకుని ఈ కార్లను అధిక ధరలకు అమ్ముతున్నారని అధికారులు గుర్తించారు. ఈ ముఠా కార్లను విడిభాగాలుగా (CKD), కంటైనర్లు,  పర్యాటక వాహనాలుగా దేశంలోకి తీసుకువచ్చి, ఆపై నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలను సృష్టిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసు కేవలం పన్ను ఎగవేత అంశమే కాదని, దీని వెనుక మనీలాండరింగ్ వంటి తీవ్రమైన అంశాలు కూడా ఉండవచ్చని కస్టమ్స్ అనుమానిస్తోంది.

హైకోర్టును ఆశ్రయించిన దుల్కర్ 

అయితే కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న వాహనాల్లో దుల్కర్ సల్మాన్ 2004 మోడల్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీ ఒకటి. కస్టమ్స్ చర్యను సవాల్ చేస్తూ కేరళ హైకోర్టును ఆశ్రయించారు దుల్కర్. తాను ఈ వాహనాన్ని చట్టబద్ధంగా, సరైన పత్రాలతో కొనుగోలు చేశానని, అది గత ఐదేళ్లుగా తన ఆధీనంలో ఉందని కోర్టుకు తెలిపారు. తన పిటిషన్‌లో, ఈ కారు అసలు దిగుమతిదారు అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ (ICRC) అని, దానికి సరైన బిల్ ఆఫ్ ఎంట్రీ ద్వారానే కస్టమ్స్ క్లియరెన్స్ లభించిందని స్పష్టం చేశారు. తన వద్ద అన్ని చెల్లుబాటు అయ్యే పత్రాలు ఉన్నాయని, అయినప్పటికీ కస్టమ్స్ అధికారులు ఏకపక్షంగా వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం అక్రమమని వాదించారు. ఈ వ్యవహారంపై మీడియాలో వస్తున్న కథనాలు తన ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్వాధీనం చేసుకున్న వాహనాన్ని వెంటనే విడుదల చేయాలని కోరుతూ దుల్కర్ పిటిషన్ దాఖలు చేశారు.

దుల్కర్ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు.. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఈలోగా కస్టమ్స్ అధికారులు దీనిపై వివరణ సమర్పించాలని ఆదేశించింది. ప్రస్తుతం కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న అన్ని వాహనాల పత్రాలను పరిశీలిస్తున్నారు. దుల్కర్ సల్మాన్‌తో సహా వాహన యజమానులందరికీ సమన్లు జారీ చేసి, వారి వాంగ్మూలాలను నమోదు చేయనున్నారు. ఈ హై-ప్రొఫైల్ కేసులో ప్రముఖ నటుల ప్రమేయంపై మరింత స్పష్టత రావాలంటే కస్టమ్స్ దర్యాప్తు పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందే.