మార్కెట్లో డమ్మీ డైమండ్లు

మార్కెట్లో డమ్మీ డైమండ్లు

మెరుపు, షేపూ.. సేమ్ టు సేమ్

ల్యాబ్‌లో ఉత్పత్తి.. పెరుగుతున్న డిమాండ్ 

అది 2019 జనవరి. లండన్‌లోని ఓ వీధి. స్టైలిష్, స్మార్ట్ గా ఉన్న ఓ కోటు, హీల్స్ వేసుకుని ప్రిన్స్ హ్యారీ సతీమణి మెగన్ మర్కెల్ కారు దిగారు. నేరుగా నడుచుకుంటూ మీటింగ్ స్పాట్ కు వెళ్లారు. అందరూ ఆమెవైపే కన్నార్పకుండా చూస్తున్నారు. ఆమె చెవులకు వేలాడుతున్న చెవి పోగులపైనే ఫోకస్ పెట్టారు. అంతలా మెరుస్తున్నాయవి.  ఇంతకీ అవి ఒరిజనల్‌ వజ్రాలు కావు. ఆ చెవి పోగులకు ల్యాబ్ లో ఆర్టిఫిషియల్ గా తయారు చేసిన వజ్రాలను పొదిగారు మరి. మేఘన్ ఒక్కరే కాదు.. గత కొన్నేళ్లుగా ఒరిజినల్ వజ్రాలు కాకుండా.. ఇలా ల్యాబ్ లో తయారు చేసిన వజ్రాలనే ఎక్కువ మంది సెలబ్రిటీలు, యూత్ ఇష్టపడుతున్నారు. నేలలో నుంచి వజ్రాలను తవ్వే ప్రాసెస్ లో ఎంతో మంది కార్మికులు చనిపోతున్నారు. పైగా మైనింగ్ వల్ల పర్యావరణానికి హాని కూడా ఎక్కువే జరుగుతోంది. అందుకే.. అటు పర్యావరణ పరిరక్షణకు, ఇటు మానవత్వంతో ఆలోచిస్తూ70% మంది మిలీనియల్స్ (1990ల నుంచి 2000 మధ్యలో పుట్టినోళ్లు), జనరేషన్ జడ్ (1990ల నుంచి 2010 మధ్య పుట్టినోళ్లు) వాళ్లు ల్యాబ్ డైమండ్లకే మొగ్గు చూపుతున్నారట.

ల్యాబ్ డైమండ్స్ తయారీ ఇలా..

ల్యాబ్ లో వజ్రాల తయారీకి రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి హై ప్రెజర్ హై టెంపరేచర్ (హెచ్ పీహెచ్ టీ) పద్ధతి. రెండోది కెమికల్ వేపర్ డిపోజిషన్ (సీవీడీ). నేచురల్ డైమండ్స్ ఉత్పత్తి సందర్భంగా వేస్ట్ గా మిగిలిపోయే పొడి, ముక్కలనే ఈ రెండు పద్ధతుల్లో ‘సీడ్’గా ఉపయోగిస్తారు. హెచ్ పీహెచ్ టీ పద్ధతిలో.. సీడ్ ను ప్యూర్ గ్రాఫైట్ కార్బన్ మధ్యలో ఉంచుతారు. దానిని 1500 డిగ్రీ సెంటీగ్రేడ్లకు వేడి చేస్తారు. తర్వాత ఒక చాంబర్ లో ఒక చదరపు అంగుళానికి1.5 మిలియన్ పౌండ్ల పీడనం కలిగిస్తారు. దీంతో హై టెంపరేచర్, ప్రెజర్ కారణంగా ఆ సీడ్ వజ్రంగా మారిపోతుంది. ఇక సీవీడీ పద్ధతిలో.. కార్బన్ గ్యాస్ తో నింపిన ఒక సీల్డ్ చాంబర్ లో సీడ్ ను ఉంచుతారు. దానిని 800 డిగ్రీ సెంటీగ్రేడ్లకు వేడి చేస్తారు. దీంతో చాంబర్ లోని కార్బన్ గ్యాస్ క్రమంగా సీడ్ కు అతుక్కుపోతుంది. పూర్తిగా కార్బన్ వాయువులు సీడ్ అంతటా అతుక్కుపోతే.. ఇక అది వజ్రంలానే కన్పిస్తుంది.

సేమ్ టు సేమ్.. కానీ..

ల్యాబ్ లో తయారు చేసే వజ్రాలు కూడా అసలైన వజ్రాల మాదిరిగానే కన్పిస్తాయి. ఆకారం, మెరుపు కూడా ఒరిజినల్ డైమండ్లకు దీటుగానే ఉంటుంది. వీటిలో రసాయనాలు కూడా సేమ్ అవే ఉంటాయి. అయితే, వీటిలో లోపాలేమీ ఉండవా? అంటే కొన్ని లోపాలు కూడా ఉంటాయని చెప్తున్నారు. ల్యాబ్ లో డైమండ్ల తయారీకి ఎక్కువ పవర్ అవసరం అవుతోందని డైమండ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (డీపీఏ) వెల్లడించింది. మైనింగ్ ద్వారా నేల నుంచి తవ్వితీయడంతో పోలిస్తే.. ల్యాబ్ లో డైమండ్స్ తయారీకి మూడు రెట్లు ఎక్కువగా గ్రీన్ హౌజ్ వాయువులువిడుదలవుతాయని స్పష్టం చేసింది. ఒక్క క్యారట్ డైమండ్ ను వెలికితీసేందుకు 250 టన్నుల మట్టిని తవ్వాల్సి వస్తోంది. 2018లో 148 మిలియన్ క్యారట్ల డైమండ్లను తవ్వితీశారు. ఈ వజ్రాల గనులు అంతరిక్షం నుంచి కూడా కనిపించేంత పెద్దగా మారాయట. మైనింగ్ ద్వారా ఉత్పత్తి చేసిన ఒక్క వజ్రాన్ని మెరుగు పెట్టేందుకు 160 కేజీల సీవోటూ విడుదలవుతుందని, ల్యాబ్ డైమండ్ కు పాలిష్​పెట్టేందుకు మాత్రం 510 కేజీల సీవోటూ రిలీజ్ అవుతుందని డీపీఏ తెలిపింది. అతిపలుచనైన డైమండ్ కోటింగ్ చేస్తే యంత్రాల్లోని కదిలే భాగాల్లో రాపిడి 40% తగ్గిపోతుంది. విండ్ మిల్స్, కార్లలోనూ ఈ కోటింగ్ ఉపయోగపడుతుంది. కానీ ల్యాబ్ డైమండ్లు ఇలాంటి కోటింగ్ కు పనికి వచ్చేంత ప్యూర్ గా ఉండవు. ల్యాబ్ డైమండ్ల మార్కెట్ ఏటా 15% నుంచి 20% వృద్ధి చెందుతోందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటికి డిమాండ్ పెరిగినకొద్దీ ఉత్పత్తి, వ్యాపారం మరింత పుంజుకుంటాయని అంటున్నారు. మైనింగ్ లో ఎంతో మంది ఉపాధి కూడా కోల్పోతారని చెప్తున్నారు. అయితే తాము రెన్యూవెబుల్ ఎనర్జీని మాత్రమే వాడతామని, పొల్యూషన్ మాటే ఉండదని హాలివుడ్ నటుడు లియోనార్డో డికాప్రియోకు చెందిన డైమండ్ ఫౌండ్రీ అనే కంపెనీ, మరికొన్ని కంపెనీలు అంటున్నాయి.

నేచురల్ వజ్రాలు 100 కోట్ల ఏళ్ల నాటివి.. 

నేచురల్ వజ్రాలు భూమిలోపల100 మైళ్ల లోతులోని మాంటిల్ పొరలో ఏర్పడతాయి. ఇప్పుడు దొరుకుతున్న నేచురల్ వజ్రాల్లో చాలావరకూ 100 కోట్ల నుంచి 300 కోట్ల ఏళ్ల కిందే ఏర్పడినవేనట. అప్పట్లో భూమి చాలా వేడిగా ఉండటం వల్లే వజ్రాలు
ఏర్పడేందుకు వీలయిందట. భూమి లోపల మాంటిల్ పొరలో హై టెంపరేచర్, ప్రెజర్ కారణంగా కార్బన్ మూలకంలో మార్పులు జరిగి వజ్రాలు ఏర్పడుతాయట. ఆ వజ్రాలే క్రమంగా భూమి పై పొర అయిన క్రస్ట్‌లోకి చేరతాయి. అలా పైకి చేరిన వజ్రాలనే
ఇప్పుడు కంపెనీలు తవ్వి తీస్తున్నాయి.