ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దసరాకు వైన్స్లన్నీ ఖాళీ

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో  దసరాకు వైన్స్లన్నీ ఖాళీ
  • పండుగ సీజన్ లో కరీంనగర్ జిల్లాలో రూ.54.84 కోట్ల మద్యం అమ్మకాలు
  • జగిత్యాల జిల్లాలో రూ.‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌5 కోట్ల లిక్కర్​ సేల్స్​

దసరా పండుగకు జిల్లాలోని వైన్స్ షాపులు దాదాపు ఖాళీ అయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ రావడం, ఆశవాహులు కొందరు ముఖ్యులను ప్రసన్నం చేసుకునే క్రమంలో గ్రామాల్లో దావత్ ల సందడి నెలకొంది. దీంతో నిరుడితో పోలిస్తే లిక్కర్ సేల్స్  పెరిగాయి. అక్టోబర్ 2న దసరా, గాంధీ జయంతి ఒకేసారి రావడంతో దసరాకు ముందు రోజే వైన్స్ షాపులకు మద్యంప్రియులు పోటెత్తారు. పండుగ రోజు మద్యం విందుల్లో మునిగితేలిన జనం మరుసటి రోజు శుక్రవారం షాపులు తెరుచుకున్నాక మళ్లీ  బారులుతీరారు. 

కరీంనగర్ జిల్లాలో ఈ దసరా సీజన్ లో(సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 1 వరకు) రూ.54.84 కోట్ల విలువైన మద్యం లిక్కర్ గోడౌన్ల నుంచి షాపులకు చేరింది. దసరాకు ఒకట్రెండు రోజుల ముందే రూ.45 కోట్ల వరకు అమ్ముడయినట్లు తెలిసింది. ఈ సీజన్ లో 46,684 లిక్కర్ కేసులు, 66,618 బీర్ కేసులు అమ్ముడుపోయాయి. 54.84 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ ఆఫీసర్లు వెల్లడించారు. గత దసరాతో పోలిస్తే ఈసారి రూ.5 కోట్ల మద్యం అదనంగా అమ్ముడైంది.

జగిత్యాల జిల్లాలో.. 

జగిత్యాల: జగిత్యాల జిల్లాలోనూ దసరా సందర్భంగా రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయి. ఎక్సైజ్ శాఖ తాజా గణాంకాల ప్రకారం జిల్లాలో సెప్టెంబర్ నెలలో మొత్తం 58,849 లిక్కర్ బాక్సులు, 1,21,381 బీర్ బాక్సులు అమ్ముడుపోగా.. వీటి విలువ రూ.71.82 కోట్లుగా ఎక్సైజ్ ఆఫీసర్లు వెల్లడించారు. ఇందులో రూ.35 కోట్ల విలువైన మద్యం దసరాకు ముందు ఒకట్రెండు రోజుల్లోనే అమ్ముడైనట్లు అంచనా. 

అక్టోబర్ 1న ఒక్క రోజే 1,112 లిక్కర్ బాక్సులు, 3,045 బీర్ బాక్సులను లిక్కర్ డిపో నుంచి వైన్స్ షాపు నిర్వాహకులు తీసుకెళ్లారు. వీటి విలువ రూ.1.49 కోట్లుగా ఉంది. గతేడాది సెప్టెంబర్ నెలలో రూ.59.79 కోట్ల విలువైన 49,543 లిక్కర్ బాక్సులు, 1,31,937 బీర్ బాక్సులు అమ్ముడుపోయాయి. ఈ లెక్కన ఈసారి జిల్లాలో సుమారు 12 కోట్లకుపైగా ఈ ఏడాది లిక్కర్ సేల్స్ పెరగడం విశేషం.