విశాఖలో కాబోయే అల్లుడికి 125 వంటకాలతో విందు..

విశాఖలో కాబోయే అల్లుడికి 125 వంటకాలతో విందు..

అత్తారింటికి వెళ్లే అల్లుడికి అక్కడ చేసే  మర్యాదల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ కొత్త అల్లుడు పండుగకు అత్తారింటికి వెళ్తే  ఆ మర్యాదలే వేరుగా ఉంటాయి. స్పెషల్ ఐటమ్స్ ఉండాల్సిందే. ఇప్పటివరకు గోదావరి ప్రాంత ప్రజలు తమ అల్లుళ్లకు చేసే  మర్యాదలే  చూశాం.. తాజాగా  విశాఖకు చెందిన ఓ కుటుంబం తమకు కాబోయే అల్లుడికి 125 రకాల వెరైటీ వంటకాలతో విందును ఏర్పాటు చేశారు.

విజయనగరం జిల్లా ఎస్‌.కోట పట్టణానికి చెందిన కాపుగంటి రామకృష్ణ, సుబ్బలక్ష్మి దంపతుల కుమారుడు చైతన్యకు విశాఖకు చెందిన కలగర్ల శ్రీనివాసరావు, ధనలక్ష్మి దంపతుల కుమార్తె నిహారికతో వచ్చే ఏడాది మార్చి 9న వివాహం చేయాలని ఇరు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఇప్పటికే నిశ్చితార్థం కూడా అయిపోవడంతో తొలి పండగ దసరాకు అత్తవారు అల్లుడ్ని ఆహ్వానించి, రకరకాల వంటకాలతో విందిచ్చారు. 125 రకాల వంటకాలలో  95 వరకు బయట నుంచి కొని.. మిగతావన్నీ ఇంట్లోనే తయారు చేశారు. అయితే ఇందులో కొన్ని పేర్లు తనకు తెలియవని, తొలిసారి  చూస్తున్నానని చైతన్య తెలిపాడు.