సామాన్యుల సేవే నా ప్రయారిటీ : జస్టిస్ డీవై చంద్రచూడ్

సామాన్యుల సేవే నా ప్రయారిటీ : జస్టిస్ డీవై చంద్రచూడ్
  • న్యాయవ్యవస్థలో మార్పులు తెస్తా 
  • సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రమాణం 
  • సామాన్యుల సేవే నా ప్రయారిటీ... చేతల్లో చూపిస్తానని వెల్లడి
  • మాజీ సీజేఐ కొడుకు సీజేఐ కావడం దేశంలో తొలిసారి

న్యూఢిల్లీ: సామాన్య ప్రజలకు సేవ చేయడమే తన ప్రయారిటీ అని నూతన చీఫ్​ జస్టిస్  ఆఫ్​ ఇండియా(సీజేఐ) జస్టిస్ ధనంజయ యశ్వంత్(డీవై)  చంద్రచూడ్ అన్నారు. టెక్నాలజీలో కావొచ్చు, రిజిస్ట్రీలో కావొచ్చు లేదా జ్యుడీషియల్ రిఫార్మ్స్ లో కావొచ్చు.. ప్రతి అంశంలోనూ ప్రజలకు సేవ చేయడంపైనే దృష్టి పెడతానని ఆయన వెల్లడించారు. బుధవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్​లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో ఆయన సుప్రీంకోర్టు 50వ చీఫ్​జస్టిస్​గా దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ కర్, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, కిరెన్ రిజిజు, మాజీ సీజేఐ యూయూ లలిత్, పలువురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ మీడియాతో మాట్లాడారు. దేశ ప్రజలందరి కోసం పని చేయడమే తన కర్తవ్యమని చెప్పారు. దేశ న్యాయ వ్యవస్థకు నాయకత్వం వహించడం గొప్ప అవకాశం, బాధ్యత అని అన్నారు. న్యాయవ్యవస్థలో రిఫార్మ్స్ తీసుకొస్తానని వెల్లడించారు. మాటల ద్వారా కాకుండా.. చేతలతోనే తన పనితీరును చూపించి, ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటానని తెలిపారు. సీజేఐగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన తన భార్య కల్పనా దాస్ తో కలిసి సుప్రీంకోర్టుకు చేరుకున్నారు. అనంతరం మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించి, సీజేఐగా బాధ్యతలు చేపట్టారు.  సీజేఐగా మంగళవారం రిటైర్ అయిన జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ స్థానంలో జస్టిస్ డీవై చంద్రచూడ్ బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్ డీవై చంద్రచూడ్ 2024, నవంబర్ 10 వరకూ రెండేండ్ల పాటు సీజేఐగా కొనసాగనున్నారు.    

న్యాయవాది నుంచి సీజేఐగా 

సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్1959 నవంబర్11న మాజీ సీజేఐ జస్టిస్ వైవీ చంద్రచూడ్, ప్రభ (క్లాసికల్ మ్యుజీషియన్) దంపతులకు బాంబేలో జన్మించారు. 1979లో ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి ఎకనమిక్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1982లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పట్టా పొందారు. 1983లో హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. 1986 లో హార్వర్డ్ నుంచి డాక్టర్ ఆఫ్ జ్యూరిడిషియల్ సైన్సెస్ (ఎస్జేడీ) డిగ్రీ పొందారు. 1998 నుంచి 2000 వరకు కేంద్ర ప్రభుత్వ అదనపు సొలిసిటర్ జనరల్‌‌గా పనిచేశారు. 2013 అక్టోబరు 31న అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. 2016 మే13న సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి లభించింది. అక్టోబర్ 17, 2022న 50వ సీజేఐగా నియమితులయ్యారు. 

అయోధ్య సహా కీలక కేసుల్లో తీర్పులు 

సుప్రీంకోర్టు జడ్జిగా అయోధ్య రామజన్మభూమి వివాదం కేసు సహా అనేక కీలక కేసుల్లో తీర్పు వెలువరించిన బెంచ్ లలో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ సభ్యుడిగా వ్యవహరించారు. అయోధ్య రాముడి గుడికి సంబంధించిన కేసులో 2019, నవంబర్ 9న తీర్పు ఇచ్చిన రాజ్యాంగ ధర్మాసనంలో ఆయన సభ్యుడు. స్వలింగ సంపర్కం నేరం కాదని తీర్పు చెప్పిన బెంచ్ లోనూ ఆయన ఉన్నారు. వ్యభిచారాన్ని నేరంగా పరిగణించే ఐపీసీ సెక్షన్ 497 రాజ్యాంగానికి విరుద్ధమని తీర్పు చెప్పిన బెంచ్​లో,  ఆధార్ చట్టబద్ధతను సమర్థించిన ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనంలోనూ చంద్రచూడ్ సభ్యుడు.

అప్పట్లో తండ్రి.. ఇప్పుడు కొడుకు 

జస్టిస్ డీవై చంద్రచూడ్ తండ్రి జస్టిస్ యశ్వంత్ విష్ణు (వైవీ) చంద్రచూడ్ సుప్రీంకోర్టుకు అత్యధిక కాలం పాటు ఏడేండ్లు చీఫ్ జస్టిస్ గా పని చేశారు. ఫిబ్రవరి 22, 1978 నుంచి జులై11, 1985 వరకూ ఆయన 16వ సీజేఐగా సేవలను అందించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కొడుకు సంజయ్ గాంధీని ‘కిస్సా కుర్సీ కా’ కేసులో దోషిగా తేల్చి, జైలుకు పంపారు. అనేక కీలక కేసుల్లో ఆయన సీజేఐగా తీర్పు చెప్పారు. అప్పట్లో తండ్రి సీజేఐ కాగా, ఇప్పుడు 44 ఏండ్ల తర్వాత కొడుకు సీజేఐ అయ్యారు. సుప్రీంకోర్టు చరిత్రలో ఒక చీఫ్ జస్టిస్ కొడుకు చీఫ్ జస్టిస్ కావడం ఇదే మొదటిసారి.