- కొత్తవాళ్లే కాదు పాతోళ్లు పట్టించుకుంటలేరు
- వేలిముద్రలు రాక, వివరాలు
- కనిపించక డీలర్ల పరేషాన్
- పంపిణీ నిలిపివేస్తారంటున్నా డోంట్‌కేర్
- నిరంత్ర ప్రక్రియ అంటున్న అధికారులు
హైదరాబాద్‌సిటీ, వెలుగు: జంట నగరాల్లో రేషన్ కార్డుల బయోమెట్రిక్ ప్రక్రియ(ఈ–కేవైసీ) ముందుకు సాగడం లేదు. ఈ కేవైసీ చేసుకోకపోవడం వల్ల సరుకులు ఇచ్చే టైంలో ఇబ్బందులు పడుతున్నామని రేషన్డీలర్లంటున్నారు. థంబ్ఇంప్రెషన్తీసుకునే టైంలో కొందరి వేలి ముద్రలు రావడం లేదని, దీంతో కుటుంబసభ్యుల డిటెయిల్స్కనిపించడం లేదంటున్నారు. కొత్తవారి డేటా మిస్సవుతోందని, దీనివల్ల పంపిణీ ఆలస్యమవుతుందంటున్నారు. అలాగే, బోగస్‌కార్డులు ఏరివేయొచ్చని, చనిపోయిన వారి పేర్లు తొలగించొచ్చని గతేడాది ఈ కేవైసీ చేయించుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. లబ్ధిదారులు తమ కుటుంబసభ్యులతో కలిసి దగ్గర్లోని ఏ రేషన్షాపుకైనా వెళ్లి ఈ–పాస్ మెషీన్లో బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రలు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. దీనివల్ల కుటుంబసభ్యుల్లో ఎవరి వేలిముద్రలైనా సరిగ్గా రాకపోతే మిగిలిన వారి వేలిముద్రలతో సరుకులు తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. అయినా లబ్ధిదారులు పలు కారణాలతో ఆసక్తి చూపించడం లేదు. నగరంలోని తొమ్మిది సర్కిళ్ల పరిధిలో ఇప్పటి వరకు 50 శాతం మంది మాత్రమే బయోమెట్రిక్ (ఈ కేవైసీ) చేయించుకున్నారు. కేవైసీ చేసుకోకపోతే సరుకుల పంపిణీ నిలిపివేస్తారని చెప్తున్నా లైట్తీస్కుంటున్నారు.
భారీగా పెరుగుతున్న కార్డుల సంఖ్య
ఒకవైపు ఈ కేవైసీ చేసుకోని కార్డుల సంఖ్య సగం వరకు ఉంటే మరోవైపు కొత్త రేషన్‌కార్డుల సంఖ్య పెరుగుతోంది. ఒక్క హైదరాబాద్ పరిధిలోని 9 సర్కిళ్లలో కొత్త కార్డుల జారీకి ముందు 6,39,451 కార్డులుండగా, ఇప్పుడు 8.40 లక్షల పై చిలుకు కార్డులు నమోదయ్యాయి. ఇందులో సగం మంది మాత్రమే ఈ కేవైసీ చేసుకున్నారు. గ్రేటర్ పరిధిలో రేషన్‌కార్డుల వారీగా సభ్యుల(యూనిట్) విషయానికి వస్తే హైదరాబాద్ పరిధిలో 28,99,060 మంది ఉండగా కొత్తగా 4,37,620 మంది నమోదయ్యారు. మేడ్చల్ పరిధిలో 20,48,224 మంది ఉండగా 3,33,961 మంది కొత్తగా నమోదయ్యారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో 21,04,811 మంది ఉండగా, కొత్తగా 2,85,930 మంది నమోదయ్యారు. రోజు రోజుకూ కార్డులతో పాటు లబ్ధిదారులు పెరిగిపోతుండడంతో బినామీలు, బోగస్ కార్డులను గుర్తించేందుకే అధికారులు తప్పని సరిగా ఈ కేవైసీ చేయించుకోవాలని కోరుతున్నారు. మరోవైపు ఈ కేవైసీ నిరంతర ప్రక్రియ అని, గడువు లేదని చెప్తుండడంతో లబ్ధిదారులు కూడా సీరియస్‌గా తీసుకోవడం లేదు.
