ఈ-నామ్..నామ మాత్రమే

ఈ-నామ్..నామ మాత్రమే

రైతులు పంట పండించడం కంటే అమ్మడానికే ప్రస్తుతం నానా తిప్పలు పడాల్సి వస్తోంది. ఉత్పత్తులు ఎక్కువగా వచ్చినపుడు, వ్యాపారులు ధరలు తగ్గిస్తుండడంతో తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చేది. ఇలాంటి ఇబ్బందులు ఉండకుండా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ -నేషనల్‌ మార్కెట్‌ పేరున జాతీయస్థాయి మార్కెట్లు అన్నింటిని ఒకే గొడుగు కిందికి తీసుకువచ్చేందుకు ఈ–నామ్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో రైతులు పండించిన పంటను ఇక్కడి వ్యాపారులతో సంబంధం లేకుండా ఆన్​లైన్​ ట్రేడింగ్​ ద్వారా దేశంలో ఏ వ్యాపారికైనా అమ్ముకునే అవకాశం ఉంటుంది. వ్యాపారులు వారికి నచ్చిన సరుకును ఆన్‌లైన్‌లో చూసి కొనుగోలు చేయవచ్చు. నాణ్యమైన సరుకును కొనుగోలు చేయడంలో వ్యాపారులు పోటీపడి అధిక ధర చెల్లించే అవకాశం ఉంది.  రైతులు ఎప్పటికప్పుడు ఇతర మార్కెట్లలోని సరుకుల ధరల సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు. అమ్మిన పంటలకు కచ్చితమైన రేటును ఆన్‌లైన్ ద్వారా చెల్లిస్తారు.  మార్కెట్ యార్డ్​లో ఎలాంటి దుకాణం లేకపోయినా ఆఫీసర్లు వ్యాపారులు, కొనుగోలుదారులు, కమీషన్ ఏజెంట్లకు ఫ్రీ లైసెన్స్ ఇస్తారు.  ఒక వ్యాపారికి ఒక లైసెన్స్ రాష్ట్రంలోని అన్ని మార్కెట్‌లలో చెల్లుతుంది. ఒక్కసారే మార్కెట్ రుసుం వసూలు చేస్తారు. అంటే రైతు నుంచి మొదటిసారి కొనుగోలు చేసిన సమయంలో మాత్రమే రుసుం వసూలు చేస్తారు.పంటలకు కచ్చితమైన తూకం, రైతుకు నచ్చిన రేటుకు అమ్ముకునే సౌకర్యం ఉంటుంది.

అమలు అంతంతే…

దేశంలోని అన్ని మార్కెట్లను ఈ-నామ్ విధానం ద్వారా అనుసంధానం చేయడంతో పంటలకు ఎక్కువ ధర లభిస్తుంది. అయితే ఈ–నామ్ పూర్తి స్థాయిలో అమలులోకి రాకపోవడంతో అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదు. స్థానిక మార్కెట్లో వ్యాపారులు సిండికేటై ముందు అనుకున్న ధరను ఆన్‌లైన్ లో బిడ్డింగ్ చేస్తూ రైతులను నిలువునా ముంచుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 180 వ్యవసాయ మార్కెట్లలో 44 మార్కెట్లను ఈ–నామ్ ద్వారా వ్యాపారాలు చేయడానికి 2016 ఏప్రిల్ లో ఎంపిక చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా బాదేపల్లి మార్కెట్, వరంగల్ జిల్లా కేసముద్రం మార్కెట్లతో పాటు  జడ్చర్ల, మరికొన్ని మార్కెట్లను మాత్రమే అనుసంధానం చేశారు.

పేరుకే ఆన్​లైన్​….

జగిత్యాల జిల్లాలో ఈ–నామ్ వ్యవస్థ అభాసుపాలవుతోంది. మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌లో మూడేళ్ల కిందట ఈ–నామ్‌ను ప్రవేశపెట్టారు. మార్కెట్‌ అంతా ఆన్‌లైన్‌ అయినా ఇతర మార్కెట్లతో మాత్రం అనుసంధానం చేయలేదు. జిల్లాలో పసుపు, సోయా, మొక్కజొన్న, వరి పంటలను ఎక్కువగా పండిస్తారు. ఇందులో పసుపు, సోయాకు జాతీయ స్థాయి మార్కెట్‌ అవసరం. దేశంలోని ఇతర ప్రాంతాల్లో పసుపు, అలాగే సోయా ఉత్పత్తులను ఎక్కువగా వినియోగిస్తుంటారు. దేశంలో సుమారు 25 శాతానికి పైగా పసుపు జగిత్యాల జిల్లాలో పండుతుంది. దీనికి ఇక్కడ ధర రాకుంటే రైతులు మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్‌కు తీసుకువెళ్లి విక్రయిస్తుంటారు. దేశంలో ఇతర మార్కెట్లతో అనుసంధానం చేస్తే అక్కడి వ్యాపారులు కూడా పసుపు నేరుగా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. దీంతో రైతులకు ఎక్కువ ధర లభిస్తుంది. జిల్లాలోని ఈ- మార్కెట్‌ను ఇతర మార్కెట్లతో అనుసంధానం చేయకపోవడంతో ఆశించిన రీతిలో ధరలు రావడంలేదు. ఇక్కడి వ్యాపారులే కొనుగోలు చేయడంతో ఈ–నామ్ ద్వారా పెద్దగా ఉపయోగం ఉండడం లేదు.