
- కొత్త సర్కార్ ఆర్థిక చేయూత
- ప్రతినెలా రూ.49 కోట్లు చెల్లింపు
- ఈనెల నుంచే నిధులు విడుదల
- కమిషనర్‌తో పాటు మున్సిపల్ శాఖ చీఫ్ సెక్రటరీ దానకిశోర్ సమీక్ష
హైదరాబాద్, వెలుగు: బల్దియా ఆర్థిక పరిస్థితిపై రాష్ట్ర సర్కార్ ఆరా తీసింది. అప్పులు, ఆదాయంతో పాటు తదితర ఆర్థికపరమైన అంశాలపై బల్దియా కమిషనర్ రోనాల్డ్ రాస్, ఫైనాన్స్ అడిషనల్ కమిషనర్ జయరాజ్ కెనెడీలతో కలిసి సెక్రటేరియట్లో సోమవారం మున్సిపల్ శాఖ చీఫ్ సెక్రటరీ దానకిశోర్ రివ్యూ చేశారు. ప్రస్తుత అప్పులు, చెల్లించే వడ్డీలు, ఏయే పనులను ఎంత అప్పులు, ఇంకా పెండింగ్ పనులకు ఎన్ని నిధులు అవసరమని, బడ్జెట్లో బల్దియా ఎంతమేర చెల్లిస్తే అప్పుల నుంచి కాస్తా బయట పడుతుందని.. ఇలా తదితర అంశాలపై రివ్యూలో చర్చించారు.
దానకిషోర్ గతంలో బల్దియా కమిషనర్ గాను పని చేశారు. ఆ అనుభవం తో పాటు చేపట్టిన పనులు, ఆర్థిక పరిస్థితిపై కూడా ఆయనకు తెలుసే ఉంటుంది. దీంతో బల్దియాను అప్పుల నుంచి ఎలా గట్టెక్కించాలనే దానిపై చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే రివ్యూ నిర్వహించారు. వచ్చే బడ్జెట్ లో బల్దియాకు కేటాయించాల్సిన నిధులపై కూడా చర్చించినట్లు తెలిసింది.
రూ.5 వేల కోట్ల అప్పులు
బల్దియా రూ.6,238 కోట్ల అప్పుల్లో ఉంది. రాష్ట్ర ప్రభుత్వ హామీతో స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీబీ) ద్వారా రూ.1,332 కోట్లు లోన్లుగా తీసుకుంది. బల్దియానే నేరుగా రూ.4,906 కోట్లు లోన్ పొందింది. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ప్రోగ్రామ్(ఎస్ఆర్డీపీ) కు ఎస్బీఐ నుంచి 8.65 శాతం వడ్డీతో రూ.2,500 కోట్లు తెచ్చింది. కాంప్రెన్సివ్రోడ్మెయింటెనెన్స్ ప్రోగ్రామ్(సీఆర్ఎంపీ) కు 7.20 శాతం వడ్డీతో రూ.1, 460 కోట్లు, మరోసారి బాండ్ల ద్వారా రూ. 490 కోట్లు (8.90 శాతం వడ్డితో రూ.200 కోట్లు, 9.38శాతం వడ్డీతో 190 కోట్లు, 10.23 శాతం వడ్డీతో రూ.100 కోట్లు) తీసుకుంది. హడ్కో ద్వారా వాంబే హౌసింగ్స్కీమ్ కింద రూ.140 కోట్లను తీసుకోగా.. ఇందులో రూ.100 కోట్లకు10.15 శాతం, రూ.40 కోట్లకు 9.90 శాతం వడ్డీ చొప్పున చెల్లిస్తుంది. వీటితో పాటు గతేడాది ఆగస్టు తర్వాత నాలాల పనులకు మిగతా నిధులను కూడా రుణాలుగా తెచ్చింది. వీటికి సంబంధించి ఏడాదికి రూ.400కోట్లకిపైగా వడ్డీ కడుతుంది.
బడ్జెట్ లో కేటాయింపులతోనే సరి
గత ప్రభుత్వ పాలనలో బల్దియాకు పెద్దగా నిధులు కేటాయించలేదు. ఇచ్చిన ఫండ్స్కూడా విడుదల చేయలేదు. 2014–15 బడ్జెట్లో రూ.375.93 కోట్లు కేటాయించి రూ.288.14 కోట్లు మాత్రమే ఇచ్చింది. 2015–16 లో రూ.428 కోట్లకు రూ.23 కోట్లతోనే సరిపెట్టింది. 2016–17లో రూ.70.30 కోట్లకు రూ.1.32 కోట్లే ఇచ్చింది. 2017–18 బడ్జెట్లో ప్రణాళికేతరనిధుల కింద రూ.67.28 కోట్లు కేటాయించినా ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. 2018–19, 2019–20 బడ్జెట్ లలో నిధులే కేటాయించలేదు. 2020–21 బడ్జెట్లో సిటీ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు పెట్టినా బల్దియాకు కేవలం రూ.17 కోట్లు మాత్రమే అందించింది. 2021–22 లోనూ నిధులు కేటాయించలేదు. 2022–23 లో కూడా రూ.2500 కోట్ల నిధులు కావాలని కోరితే, కేవలం రూ.31.10 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో 2023–24 బడ్జెట్ పై భారీగానే ఆశలు పెట్టుకుంది.
నెలకు రూ. 49 కోట్లు రిలీజ్
గత ప్రభుత్వం ఆస్తి పన్ను కూడా చెల్లించలేదు. దీంతో రాష్ట్ర సర్కార్ రూ.5564 కోట్ల బకాయిలు పడింది. మరోవైపు అప్పుల పాలైన బల్దియా జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితికి చేరింది. గత సర్కార్ అసలు పట్టించుకోలేదు. నిధులు కావాలని అడిగిన కూడా ఇవ్వలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆస్తి పన్ను చెల్లింపులో భాగంగా ప్రతినెలా రూ.49 కోట్లు ఇచ్చేందుకు నిర్ణయించింది. ఈనెల నుంచే బల్దియా ఖాతాలో జమ చేస్తుంది. ఇకపై ప్రతినెల ఒకటో తేదీకి ముందుగానే నిధులు అందజేయనుంది. వీటిని ఉద్యోగుల జీతాలు ఇతర ఖర్చులకు వినియోగించనుంది. మొత్తానికి కొత్త ప్రభుత్వం రాగానే బల్దియాపై ఫోకస్ పెట్టింది.