
- గ్రూపులో దాదాపు 100 మంది
- ఐటీ కారిడార్‌లో యథేచ్చగా దందా
- భారీ డెకాయ్ ఆపరేషన్‌తో చెక్ పెట్టిన ఈగల్ టీమ్
- 2 గంటల్లో 14 మంది కస్టమర్లు అరెస్ట్
గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార్‌లో శనివారం రాత్రి ఈగల్ టీమ్ భారీ డెకాయ్ ఆపరేషన్ చేపట్టింది. భాయ్.. బచ్చా ఆగాయా.. అంటూ వాట్సప్ కోడ్ ద్వారా కస్టమర్లకు సమాచారం అందించి, గంజాయి అమ్ముతున్న పాత నేరస్తుడి ఆట కట్టించింది. మరో 14 మంది కస్టమర్లను అదుపులోకి తీసుకొని, యూరిన్ డ్రగ్ టెస్టింగ్ కిట్ తో పరీక్షలు నిర్వహించగా అందరికీ గంజాయి పాజిటివ్ వచ్చింది. ఈగల్ టీమ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో మహారాష్ట్రకు చెందిన సందీప్ అనే వ్యక్తి గంజాయిని తెచ్చి అమ్ముతున్నాడనే సమాచారంతో ఆదివారం గచ్చిబౌలి హెచ్ డీఎప్సీ బ్యాంక్ వద్ద డెకాయ్ ఆపరేషన్ చేపట్టారు.
ఆదివారం సందీప్ ను చాకచక్యంగా పట్టుకున్న ఈగల్ టీమ్ పోలీసులు.. దాదాపు రెండున్నర గంటలపాటు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి కస్టమర్లను సైతం అదుపులోకి తీసుకున్నారు. గంజాయి విక్రయం కోసం సందీప్ ఏకంగా వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసి, గంజాయి వచ్చిన వెంటనే ‘భాయ్.. బచ్చా ఆగయా’ అంటూ కోడ్ పంపుతున్నాడు. ఈ గ్రూపులో దాదాపు 100 మంది ఉన్నట్లు ఈగల్ టీం గుర్తించగా, గంజాయి కొనుగోలు చేసేందుకు వచ్చిన మొత్తం 14 మందిని అదుపులోకి తీసుకొని వారికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. దీంతో వారిని డిఅడిక్షన్ సెంటర్ కు తరలించారు. నిందితుడు ప్యాకెట్‌కు 50 గ్రాముల చొప్పున మొత్తం 5 కిలోల గంజాయి తీసుకురాగా, అధికారులు సీజ్ చేశారు. ఒక్కో ప్యాకెట్‌ను రూ.3 వేల విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
గంజాయికి బానిసగా మారిన భార్యాభర్తలు
ఈగల్ టీం చేపట్టిన డెకాయ్ ఆపరేషన్‌లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాలుగేళ్ల చంటి పిల్లాడితో భార్యాభర్తలు గంజాయి కొనుగోలు చేసేందుకు కారులో వచ్చారు. భర్తను పరీక్షించగా పాజిటివ్ రాగా.. కుమారుడిని దృష్టిలో పెట్టుకొని భార్యను వదిలిపెట్టారు. మరో సాఫ్ట్వేర్ దంపతులు గంజాయి కొనుగోలు చేసేందుకు వచ్చి ఈగల్ టీం చేతికి చిక్కారు. వీరు డ్రగ్స్ కు బానిసగా మారినట్లు గుర్తించిన పోలీసులు ఇరువురిని డి అడిక్షన్ సెంటర్ కు తరలించారు. కాగా, సందీప్ వాట్సప్ గ్రూప్‌లో ఉన్న మిగిలిన 86 మంది డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, అలవాటు ఉన్నవారు బయట పడేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.