రేపటి నుంచే ఎంసెట్.. జలుబు ఉంటే స్పెషల్ రూమ్

రేపటి నుంచే ఎంసెట్.. జలుబు ఉంటే స్పెషల్ రూమ్
  • రేపటి నుంచే ఎంసెట్ 
  • జ్వరం, జలుబు ఉంటే స్పెషల్ రూమ్ 
  • రెండు గంటల ముందే సెంటర్​లోకి అనుమతి: ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్

హైదరాబాద్, వెలుగు: ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే టీఎస్​ ఎంసెట్​ఎగ్జామ్​ సెషన్స్ బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఎగ్జామ్స్ నిర్వహణకు అధికారులు సమాయత్తమయ్యారు. కరోనా దృష్ట్యా హైఫీవర్, జలుబు, దగ్గుతో బాధపడే వారికి స్పెషల్ రూమ్ ​కేటాయించనున్నారు. ఎగ్జామ్ రాసే స్టూడెంట్లకు మాస్కు, శానిటైజర్ తప్పనిసరి చేశారు.  ఈ నెల 4 నుంచి 10 వరకు జరిగే ఎంసెట్​కు రాష్ట్రవ్యాప్తంగా 2,51,606 మంది రిజిస్ర్టేషన్ ​చేసుకున్నారు. ఇంజనీరింగ్ స్ర్టీమ్ వాళ్లు 1,64,962 మంది, అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ర్టీమ్​లో 86,644 మంది ఉన్నారు. ఎంసెట్ నిర్వహణ కోసం తెలంగాణలో 82, ఏపీలో 23 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ నెల 4, 5, 6 తేదీల్లో ఆరు సెషన్లలో ఇంజనీరింగ్ స్ర్టీమ్​కి, 9,10 తేదీల్లో మూడు సెషన్లలో అగ్రికల్చర్, మెడికల్ స్ర్టీమ్​కు ఎగ్జామ్ ​ఉంటుందని టీఎస్ ​ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. ఉదయం 9 గంటలకు మార్నింగ్ సెషన్, మధ్యాహ్నం 3 గంటలకు మరో సెషన్ ఉంటుందని, స్టూడెంట్లను రెండు గంటల ముందే హాల్​లోకి అనుమతిస్తామని చెప్పారు. ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన సిలబస్​​ నుంచే 70 శాతం క్వశ్చన్లు ఉంటాయని వెల్లడించారు. ఎగ్జామ్​కు హాజరయ్యే ప్రతి స్టూడెంట్​ సెల్ఫ్ ​డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కరోనా పాజిటివ్ ఉన్న స్టూడెంట్లకు చివరి సెషన్​లో ఎగ్జామ్​కు హాజరయ్యేలా చూస్తున్నామని, అప్పటికీ సాధ్యం కాకుంటే ఉన్నతాధికారుల సూచనల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. బిట్ శాట్ హాజరయ్యే 1500 మంది స్టూడెంట్లకు ఎగ్జామ్ షెడ్యూల్ మార్చినట్టు వెల్లడించారు. స్టూడెండ్లు 3 పేజీల హాల్ టికెట్ లోని ప్రతి అంశాన్ని  చదవాలని ఆయన కోరారు.