ఓయూలోని పురాతన మెట్లబావులకు మునుపటి కళ.. కొనసాగుతున్న బ్యూటిఫికేషన్ పనులు..

ఓయూలోని పురాతన మెట్లబావులకు మునుపటి కళ.. కొనసాగుతున్న బ్యూటిఫికేషన్ పనులు..
  •    వేలాది మంది అవసరాలు తీర్చిన బావులు శతాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురి
  •     చారిత్రక కట్టడాల ప్రాముఖ్యతను చాటిచెప్పేలా  వాటిని బాగు చేయనున్న అధికారులు

ఓయూ, వెలుగు: ప్రస్తుతం ఉస్మానియా వర్సిటీ ఉన్న ప్రాంతంలో పద్దెనిమిదో శతాబ్దంలో నిర్మించిన మెట్ల బావులు ఆ రోజుల్లో ఎంతో మంది దాహార్తిని తీర్చాయి.  అప్పటి నవాబుల ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, మేధావుల సమావేశాలు, మతపరమైన చర్చలు, పెండ్లి వేడుకలు సైతం అక్కడ జరిగేవి. అయితే ఈ చారిత్రక కట్టడాల పరిరక్షణను ఏండ్లుగా నిర్లక్ష్యం చేయడంతో​ అవి మట్టి, చెత్తాచెదారంతో నిండిపోయి శిథిలావస్థకు చేరుకుని కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే చారిత్రక కట్టడాలను పరిరక్షించాలన్న ఉద్దేశంతో ఓయూలోని పురాతన మెట్ల బావుల పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టారు.

ఓయూలో 3 మెట్ల బావులు

ఓయూ క్యాంపస్​లో మూడు చారిత్ర బావులున్నట్లు అధికారులు గుర్తించారు. ఇంగ్లీష్​ అండ్​ఫారిన్ ​లాంగ్వేజెస్(ఇఫ్లూ) వర్సిటీలో ఉన్న చారిత్రక బావిని పదేళ్ల క్రితమే బాగు చేశారు. ప్రస్తుతం కాలేజ్​ఆఫ్​ఎడ్యుకేషన్​వద్ద ఒకటి,  ఓయూ లేడీస్​ హాస్టల్ ​ప్రాంగణంలో మరో పురాతన మెట్ల బావిని గుర్తించారు. కాలేజ్​ఆఫ్​ఎడ్యుకేషన్​ ఆవరణలో ఉన్న బావి మహాలఖా బాయి చందా పేరుతో ప్రసిద్ధి చెందినదిగా చరిత్రకారులు చెబుతున్నారు. ఈ బావి నీటిని నిల్వ ఉంచి వేసవిలో స్థానిక అవసరాలకు వాడేవారు.

సభలు, సమావేశాలు, వేడుకలు తదితర కార్యక్రమాలను నిర్వహించేందుకు అనుగుణంగా ఈ బావులను నిర్మించారు. బావులకు ఓ వైపు పెద్ద స్టేజీ, మెట్లతో నిర్మించిన మూడంతస్తుల్లో ప్రతి అంతస్తులోనూ వీక్షకులు కూర్చునేలా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ప్రతి అంతస్తునూ నాలుగు తోరణాలతో చతురస్రాకారంలో నిర్మించారు. బావి చుట్టూ, లోపలి భాగంలో పెద్దసంఖ్యలో నవాబులు, వారి కుటుంబసభ్యులు, మేధావులు కూర్చుని సమావేశాలు నిర్వహించడంతో పాటు గానా బజానాలు, మతపరమైన సమావేశాలు నిర్వహించేవారు.

రాజ నర్తకి, గాయని, రాజకీయ సలహాదారు..

1768-–1824 కాలంలో ఓ వెలుగు వెలిగిన ప్రముఖ నర్తకి పేరే మహాలఖా బాయి చందా. ఈ మెట్ల బావికి ఆమె పేరునే పెట్టారు. రాజ నర్తకిగానే కాకుండా గాయని, రచయితగా ఆమె ప్రసిద్ధి చెందారు. సేవా కార్యక్రమాలతో పాటు బాలికలు చదువుకునేలా అవగాహన కల్పించారు.  రెండో నిజాం​ నవాబుకు రాజకీయ సలహాదారుగానూ పనిచేశారు.  మొట్టమొదటి మహిళా కవిగా పేరు ప్రఖ్యాతులు సాధించారు.

మహాలఖా సభకు వస్తే 500 మంది సైనికులు, వాయిద్యకారులు ఆమె రాకను సూచిస్తూ కవాతు నిర్వహించేవారు. బాలికల చదువు కోసం ఆమె ఆ కాలంలోనే రూ.కోటి విరాళంగా అందజేశారు. ఆపై ఆస్తినంతా అనాథ బాలికలకు రాసిచ్చారు. తార్నాక ప్రాంతంలో నివాసమున్న తన జాగీరుకు సంబంధించి వందల ఎకరాలను విద్యా సంస్థలకు ఇచ్చారు. ఆమె దానం చేసిన   భూమిలోనే ఉస్మానియా వర్సిటీని ఏర్పాటు చేశారు.

హెచ్ఎండీఏ, బల్దియా ఆధ్వర్యంలో..

శిథిలావస్థకు చేరుకున్న ఓయూలోని బావులను ఆధునీకరించేందుకు ఓయూ అధికార యంత్రాంగంతో కలిసి హెచ్​ఎండీఏ, జీహెచ్​ఎంసీ  ముందుకు వచ్చాయి. గత రెండు, మూడు నెలలుగా హెచ్ఎండీఏ అధికారులు ఓయూలోని పురాతన బావులపై స్టడీ చేశారు.  

ఓయూ, రెయిన్​వాటర్ ప్రాజెక్ట్, హెచ్ఎండీఏ అధికారులు పలు దఫాలుగా సమావేశమై ప్లానింగ్  రూపొందించారు. ఈ నేపథ్యంలోనే మహాలఖా బాయి చందా మెట్ల బావి పునరుద్దరణకు పనులను రెండ్రోజుల కిందట చేపట్టారు.  లేడీస్​ హాస్టల్​వద్ద ఉన్న మరో బావి ఆధునీకరణను కూడా త్వరలోనే చేపట్టనున్నట్లు  ఉస్మానియా వర్సిటీ అధికారులు వెల్లడించారు.

పర్యాటక కేంద్రాలుగా మారుస్తం

సిటీలోని చారిత్రక కట్టడాలైన పురాతన బావులను పునరుద్ధరించి పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే బన్సీలాల్ పేట సహా సిటీలోని దాదాపు 10 పురాతన మెట్ల బావులను అందంగా మార్చాం. సిటీలో ఉన్న 80కి పైగా మెట్ల బావులను దశల వారీగా అభివృద్ధి చేస్తం. – కల్పనా రమేశ్, బల్దియా అధికారి

ఓయూ చరిత్రలో ఇదో మైలురాయి

ఓయూ చరిత్రలో మెట్లబావి పునరుద్ధరణ పనులు మరో మైలురాయిగా నిలుస్తాయి. ఇక్కడున్న మూడు మెట్ల బావులను ఆధునీకరించి స్టూడెంట్లు, సందర్శకులకు అందుబాటులోకి తెస్తం. చారిత్రక కట్టడాల ప్రాముఖ్యతను చాటిచెప్పే లక్ష్యంతో ఈ పనులు చేపట్టాం. - ప్రొఫెసర్​ రవీందర్ ​యాదవ్, ఓయూ వీసీ