గెలుపుపై స్టేట్​ లీడర్స్​కు బీజేపీ హైకమాండ్ ఆదేశం

గెలుపుపై స్టేట్​ లీడర్స్​కు బీజేపీ హైకమాండ్ ఆదేశం

హైదరాబాద్, వెలుగు: మునుగోడులో ప్రచారానికి పది రోజులే ఉండడంతో బీజేపీ హైకమాండ్ రాష్ట్ర నాయకత్వాన్ని మరింత అప్రమత్తం చేసింది. ఇప్పటి దాకా బీజేపీ సాగించిన ప్రచారం తీరుపై నేషనల్ లీడర్స్ ఆరా తీస్తున్నారు. రాష్ట్రంలోని ప్రధాన లీడర్లలో ఎవరు... ఎక్కడ... ప్రచారం చేశారు..? అక్కడ జనం నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? ప్రచారంలో ఏ అంశాలను ప్రస్తావిస్తున్నారు? టీఆర్ఎస్ సర్కార్ అవినీతి, కేసీఆర్ కుటుంబ పాలనపై ప్రస్తావించిన టైంలో జనం నుంచి ఎలాంటి స్పందన వస్తుందనే అంశాలపై హైకమాండ్ ఆరా తీస్తోంది. ప్రచారంలో దూకుడు పెంచాలని, కేంద్ర స్కీంలు, వాటితో రాష్ట్రంలో ఎంత మంది లబ్ధి పొందుతున్నరు, తెలంగాణకు కేంద్రం ఏం ఇచ్చిందో కూడా ఓటర్లకు వివరించాలని ఢిల్లీ పెద్దలు దిశానిర్దేశం చేస్తున్నారు. 

మూడు రోజులుగా మునుగోడులోనే మకాం

బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్​చార్జ్​ సునీల్ బన్సల్, సహాయ ఇన్​చార్జ్​ అరవింద్ మీనన్ లు మూడు రోజులుగా మునుగోడులోనే మకాం వేశారు. మండలాల వారీగా బూత్ స్థాయి నేతలతో భేటీ అవుతూ బీజేపీపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం వ్యక్తమవుతోంది, పార్టీ అభ్యర్థి విషయంలో జనం నాడి ఎలా ఉందని ఆరా తీస్తున్నారు. ప్రచారానికి ఎక్కువ టైం లేకపోవడంతో ఇంటింటికీ వెళ్లి ప్రతీ ఓటరును కలిసి బీజేపీకి ఓటేయాలని అభ్యర్థించాలని సూచించారు. బూత్ స్థాయిలో మీటింగ్​లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఎలక్షన్​ మేనేజ్​మెంట్​ కమిటీతో బన్సల్​ భేటీ

బుధవారం ఎలక్షన్ మేనేజ్ మెంట్ కమిటీతో సునీల్ బన్సల్ భేటీ అయ్యారు. ఇందులో స్టేట్​ లీడర్లంతా పాల్గొన్నారు. టీఆర్ఎస్ అధికార దుర్వినియోగంపై ఓ కన్నేసి ఉంచుతూనే, వారి ఆగడాలను వివరించే ప్రయత్నం చేయాలన్నారు. ఇదే టైంలో రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు కోసం మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీని గెలిపించాల్సిన అవసరాన్ని ఓటర్లకు వివరించాలని ఆదేశించారు. కమలం గుర్తును ప్రజల్లోకి ఎక్కువగా తీసుకెళ్లడంపైనే ఫోకస్ పెట్టాలని, ఈ విషయంలో లీడర్లు, కార్యకర్తలు అలసత్వం ప్రదర్శించొద్దని కోరారు. రాజగోపాల్​రెడ్డి గుర్తు కమలం అనేది ప్రతీ ఇంటికి వెళ్లేలా ప్లాన్ చేసుకోవాలని సూచించారు