పైలేరియాపై ఫైట్.. ఈనెల 13 నుంచి 30 వరకు జిల్లాల్లో ర్యాండమ్ సర్వే

పైలేరియాపై ఫైట్..  ఈనెల 13 నుంచి 30 వరకు జిల్లాల్లో ర్యాండమ్ సర్వే
  • 20 ఏండ్లు పైబడిన వారికి టెస్టులు
  • ప్రారంభ దశలో గుర్తిస్తేనే బోదకాలుకు చెక్ 
  • మంచిర్యాల జిల్లాలో 892 పాజిటివ్ కేసులు 

మంచిర్యాల, వెలుగు: 2030 నాటికి పైలేరియా వ్యాధిని నిర్మూలిండచమే లక్ష్యంగా ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. రోజురోజుకు విస్తరిస్తున్న ఈ మహమ్మారిని ప్రారంభ దశలోనే కంట్రోల్ చేయడంపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న మంచిర్యాల, నిర్మల్, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, ఖమ్మం జిల్లాల్లో ర్యాండమ్ సర్వే చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

ఈనెల 13 నుంచి 30 వరకు పై ఆయా జిల్లాల్లో ట్రాన్స్​మిషన్ అసెస్మెంట్ సర్వే (టాస్) నిర్వహించడానికి వైద్యారోగ్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి సర్వే సిబ్బందికి రెండు రోజులుగా ట్రైనింగ్ ఇచ్చారు.  

ర్యాండమ్ సర్వే ఇలా..

పైలేరియా ఎండమిక్ ఏరియాలుగా గుర్తించిన గ్రామాల్లో టాస్​లో భాగంగా ర్యాండమ్ సర్వే నిర్వహించనున్నారు. మంచిర్యాల జిల్లాలో 60 గ్రామాలను ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లో పది ఇండ్లకు ఒకరు చొప్పున 20 ఏండ్లు పైబడిన వారికి టెస్టులు చేస్తారు. జిల్లావ్యాప్తంగా 6,200 మందికి పరీక్షలు నిర్వహిస్తారు. ఇందుకోసం 20 టీమ్​లను ఏర్పాటు చేశారు. ఒక్కో టీమ్​లో ల్యాబ్ టెక్నీషియన్, ఏఎన్ఎం, సూపర్​వైజర్, ఎంఎల్​హెచ్​పీ ఉంటారు. దీనికి అవసరమైన కిట్లను వైద్యారోగ్యశాఖ ఇప్పటికే ఆయా జిల్లాకు సప్లై చేసింది. టాస్ లో పాజిటివ్ వచ్చిన వారికి ప్రారంభ దశలోనే వ్యాధిని కంట్రోల్ చేయడానికి 12 రోజులపాటు డీఈసీ మాత్రలు అందజేస్తారు. మెరుగైన ట్రీట్మెంట్ అవసరమైన వారిని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్​కు రెఫర్ చేస్తారు. 

మంచిర్యాలలో 892 కేసులు.. 

మంచిర్యాల జిల్లాను పైలేరియా ఎండమిక్ ఏరియాగా గుర్తించారు. ప్రస్తుతం జిల్లాలో 892 పాజిటివ్ కేసులు ఉన్నాయి. జన్నారం, దండేపల్లి, లక్సెట్టిపేట, మందమర్రి, కాసిపేట, కోటపల్లి, నెన్నెల మండలాల్లో వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. 

ప్రారంభ దశలో గుర్తిస్తేనే..

క్యూలెక్స్ అనే దోమలు కుట్టడం వల్ల పైలేరియా వస్తుంది. దోమకాటుతో వ్యాధి కారకాలు మానవ శరీరంలోకి ప్రవేశించి శోశరస వ్యవస్థను దెబ్బతీసి బోదకాలు కలుగజేస్తాయి. ఈ వ్యాధి ముదిరేంతవరకూ ఎలాంటి లక్షణాలు కనిపించవు. దీంతో అది ప్రమాదకరంగా మారుతుంది. ప్రారంభ దశలో వ్యాధిని గుర్తిస్తే కంట్రోల్ చేయడానికి చాన్స్ ఉంటుంది. కావున ఎండమిక్ ఏరియాగా గుర్తించిన గ్రామాల్లో ప్రభుత్వం ప్రత్యేక సర్వేను చేపట్టింది. 

వ్యాధి లక్షణాలు..

పైలేరియా బాధితుల్లో తీవ్రమైన జ్వరం, చలి, బాడీ పెయిన్స్, శోశరస గ్రంథుల వాపు, లింఫాటిక్ వ్యవస్థలో అడ్డంకులు, ఎడెమా (ద్రవం చేరడం), కాళ్లు, చేతులు, జననేంద్రియాల వాపు, చర్మంపై బిల్లలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధిగ్రస్తులను కుట్టిన దోమలు ఆరోగ్యకరమైన వ్యక్తులను కుట్టినప్పుడు వారు కూడా వ్యాధి బారినపడే ప్రమాదం ఉంటుంది.