- ఖమ్మం కార్పొరేషన్ కు ఇంకా నాలుగు నెలల గడువు
- అన్నింటితో కలిపే ఎలక్షన్లకు వెళ్లాలని మంత్రి తుమ్మల ప్లాన్
- కార్పొరేషన్ పాలకవర్గాన్ని రద్దు చేయించాలని ఆలోచన
- తగిన మెజార్టీ కోసం కార్పొరేటర్ల చేరికలకు రంగం సిద్ధం?
ఖమ్మం, వెలుగు : ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గానికి ముందస్తు ఎన్నికల కోసం కసరత్తు జరుగుతోంది. ఒకవైపు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఖమ్మం జిల్లాలో ఐదు మున్సిపాలిటీల్లో ఎలక్షన్ల కోసం అధికారులు, నాయకులు సన్నద్ధమవుతున్నారు. మధిర, వైరా, సత్తుపల్లి మున్సిపాలిటీలకు తోడు కొత్తగా ఏర్పాటైన ఏదులాపురం, కల్లూరు మున్సిపాలిటీల్లో ఇప్పటికే ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేసి అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు.
అయితే వీటితో పాటే ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు కూడా నిర్వహించేలా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్లాన్ చేస్తున్నారు. ఖమ్మం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన, ఇప్పటికే ఈ విషయంపై అనుచరులకు స్పష్టమైన సూచనలు చేసినట్టు తెలుస్తోంది. దీనికి తగినట్టుగానే ఇటీవల పార్టీ కార్పొరేటర్లతో మేయర్ పునుకొల్లు నీరజ సమావేశమయ్యారు. ముందస్తు ఎన్నికలకు సంబంధించి వారి అభిప్రాయాలను తీసుకున్నారు. మంత్రి తుమ్మల నిర్ణయం ప్రకారమే నడుచుకుంటామని వారంతా స్పష్టం చేశారు. దీంతో పాలకవర్గాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది.
చేరికలకు రంగం సిద్ధం?
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ లో 60 డివిజన్లున్నాయి. వీటిలో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ 45, కాంగ్రెస్ 10, సీపీఎం 2, సీపీఐ 2, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించడంతో అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. రెండేండ్ల కింద రాష్ట్రంలో మారిన పరిస్థితుల నేపథ్యంలో మేయర్ తో పాటు పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో కాంగ్రెస్ బలం 34కు పెరిగింది. ఆ తర్వాత మరికొంత మంది కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సంప్రదింపులు జరిపినా, స్థానిక నేతల నుంచి వ్యతిరేకత నేపథ్యంలో జంపింగ్ లకు కాస్త బ్రేక్ పడింది. ఇప్పుడు కార్పొరేషన్ పాలకవర్గాన్ని రద్దు చేసి, మిగిలిన మున్సిపాలిటీలతో కలిపి ఒకేసారి ఎన్నికలకు వెళ్లాలంటే మాత్రం మూడింట రెండొంతుల మెజార్టీతో తీర్మానాన్ని ఆమోదించాలనే చర్చ జరుగుతోంది.
అయితే ప్రత్యేకంగా కాకుండా, మిగిలిన మున్సిపాలిటీలతో పాటే ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలనే అభిప్రాయంతో పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా ఉన్నారు. ప్రత్యేకంగా కార్పొరేషన్ ఎన్నికలొస్తే ఖర్చు పెరగడంతో పాటు, అప్పుడు పరిణామాలు కూడా మారతాయన్న అంచనాతో వారున్నారు. కానీ, అధికార పార్టీ పెట్టే తీర్మానానికి మద్దతిచ్చే విషయంలో మాత్రం కొంత వెనుకంజ వేస్తున్నారు. దీంతో పాలకవర్గం రద్దు తీర్మానం కోసం ఓటింగ్ కు లాభించేలా మరికొంత మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లను కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు కసరత్తు జరుగుతున్నట్టు సమాచారం. ఓ మహిళా కార్పొరేటర్ తో పాటు, మరో కార్పొరేటర్ కొంత కాలంగా బీఆర్ఎస్ నాయకత్వంతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. వారిద్దరూ కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని టాక్ నడుస్తోంది. వారితో పాటు మరో నలుగురి కోసం అధికార పార్టీ నేతలు స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది.
మూడ్నాలుగు రోజుల్లో క్లారిటీ..
అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండడంతో ప్రస్తుతం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్ లోనే ఉన్నారు. ఖమ్మం కార్పొరేషన్ కు ముందస్తు ఎన్నికల గురించి సీఎం రేవంత్ రెడ్డితో చర్చించిన తర్వాత, పాలకవర్గం రద్దుపై క్లారిటీ వస్తుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. సీఎం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే మిగిలిన పనులు చకచకా జరుగుతాయంటున్నారు. అయితే మిగిలిన మున్సిపాలిటీల్లో ఇప్పటికే ఓటర్ల ముసాయిదా జాబితా, పొలిటికల్ పార్టీలతో మీటింగ్, ఫైనల్ ఓటర్ల లిస్ట్ అంటూ కసరత్తు జరుగుతోంది.
కార్పొరేషన్ ఎలక్షన్ కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే మరో నోటిఫికేషన్ ద్వారా ఖమ్మం కార్పొరేషన్ లోనూ ఈ ప్రక్రియను వెంటనే మొదలు పెడతారన్న కామెంట్ వినిపిస్తోంది. మరోవైపు కార్పొరేషన్ లోని 60 డివిజన్లను పునర్విభజన చేయాలని ఇటీవల మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య ఉన్నతాధికారులకు లేఖ రాశారు. దీంతో ఎక్కువ ఓటర్లున్న డివిజన్లను విభజిస్తే, మొత్తం 68కి సంఖ్య పెరుగుతుందని భావించారు. దీనిపై మంత్రి తుమ్మలకు ఇంట్రస్ట్ లేకపోవడంతో, ఈ ప్రాసెస్ కు బ్రేక్ పడినట్టు తెలుస్తోంది.
