ఉత్తరాఖండ్ వణికిపోయింది.. నాలుగుసార్లు భూ ప్రకంపనలు

ఉత్తరాఖండ్ వణికిపోయింది.. నాలుగుసార్లు భూ ప్రకంపనలు

భూ ప్రకంపనలతో ఉత్తరాఖండ్ వణికిపోయింది. వరుస ప్రకంపనలతో అక్కడి ప్రజలు ఆందోళనకు గురయ్యారు.  ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయంతో పరుగులు తీశారు. ఆగస్టు 06వ తేదీ ఆదివారం వరుసగా నాలుగు సార్లు భూమి కంపించింది. పితోర్ గఢ్ తో పాటు..పరిసర ప్రాంతాల్లో భూ కంపం సంభవించింది. 

నాలుగు సార్లు..

ఆగస్టు 06వ తేదీ ఆదివారం తెల్లవారుజామున 1:34 గంటలకు  తొలిసారి భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 4.2 తీవ్రతగా నమోదైంది. ఆ తర్వాత రెండోది 1:37 గంటలకు 2.7 తీవ్రతతో..మూడోది  2: 48 గంటలకు 2.8 తీవ్రతో భూకంపాలు సంభవించాయి. చివరగా నాల్గోది ఉదయం 6: 52 గంటలకు భూప్రకంపనలు సంభవించాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భూ ప్రకంపనల ధాటికి జనం ఇండ్ల నుంచి పరుగులు తీశారు. 

ఈ భూ ప్రకంపనలు భారత్ చైనా సరిహద్దులోని మిలామ్ లో 10 కిలో మీటర్ల లోతులో ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. ఈ భూకంపాల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని పేర్కొంది. 
 
ఆగస్టు 06వ తేదీ అర్థరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు మొత్తం నాలుగు సార్లు భూమి కంపించిందని  పితోర్ గఢ్ జిల్లా విపత్తు నిర్వహణ అధికారి భూపేంద్ర సింగ్ వెల్లడించారు. అయితే స్థానికులు మాత్రం..అర్థరాత్రి 1 గంటా 30 నిమిషాల నుంచి తెల్లవారుజామున 5 గంటల మధ్యలో మొత్తం ఏడు సార్లు భూమి కంపించిందని వెల్లడించడం గమనార్హం.