
అలాస్కా ద్వీపకల్పాన్ని భారీ భూకంపం కుదిపేసింది. గురువారం (జూలై 17) తెల్లవారుజామున సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS), యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించాయి. భూ ఉపరితలం నుంచి 36 కి.మీ లోతులో భూప్రకంపనలు సంభవించాయని తెలిపాయి. భూకంప కేంద్రం శాండ్ పాయింట్‌కు దక్షిణంగా 54 మైళ్ల (87 కిలోమీటర్లు) దూరంలో.. ఎపిసెంటర్ 12.5 నుంచి 20.1 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే అంచనా వేసింది.
ఈ భారీ భూకంపంతో అలస్కా ద్వీపకల్పం వణికిపోయింది. ఎత్తైన భవనాలు, బయట పార్కింగ్ చేసిన వాహనాలు కుదుపునకు లోనయ్యాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అలాస్కా భూకంప దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. భూకంపం తర్వాత అమెరికా సునామీ హెచ్చరిక వ్యవస్థ అలస్కా తీరప్రాంతంలోని దక్షిణ అలస్కా, కోడియాక్, కోల్డ్ బే, హోమర్ వంటి ప్రాంతాలకు సునామీ హెచ్చరిక జారీ చేసింది. ఎత్తైన ప్రదేశానికి తరలి వెళ్లాలని.. తీరప్రాంతాలు, బీచ్‌లకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. భూకంపం వల్ల సంభవించిన ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు అధికారులు వెల్లడించలేదు.
►ALSO READ | రక్షణ రంగం బలోపేతం.. మూడు కొత్త అపాచీలు వచ్చేస్తున్నయ్
అలాస్కా-అలూటియన్ సబ్‌డక్షన్ జోన్ భూమిపై ఎక్కువగా భూకంపాలు సంభవించే ప్రాంతాలలో ఒకటి. ఈ ప్రాంతం 130కి పైగా అగ్నిపర్వతాలు, అగ్నిపర్వత క్షేత్రాలకు నిలయంగా ఉంది. గత 200 సంవత్సరాలలో యూఎస్ అగ్నిపర్వత విస్ఫోటనాలలో 75 శాతానికి పైగా ఇక్కడే సంభవించాయి. టెక్టోనిక్ ప్లేట్ల కదలికల వల్ల అలాస్కాలో తరుచు భూకంపాలు సంభవిస్తుంటాయి. అమెరికాలోని మిగిలిన ప్రాంతాల కంటే అలాస్కాలోనే ఎక్కువగా భూకంపాలు వస్తుంటాయి.