
- మేము ఎకానమీలో 4వ స్థానంలో ఉన్నం..మీరెక్కడున్నారు?
- ఇండియా అంటే అంత ద్వేషమా?
- మా నుంచి విడిపోయి మీరేం సాధించారు
- టెర్రరిజం అనే రోగాన్ని పాక్ యువతే నయం చేయాలి
- ఇంకా దాడికి ప్రయత్నిస్తే.. ఆపరేషన్ సిందూర్ కంటే తీవ్ర పరిణామాలుంటయ్
- టెర్రరిజాన్నే పాక్ టూరిజంగా భావిస్తోందంటూ ఎద్దేవా
దాహోద్/భుజ్ (గుజరాత్): ఇండియాను ద్వేషించడమే పాకిస్తాన్ పనిగా పెట్టుకున్నదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇండియాను ఎలా దెబ్బ తీయాలా అని పాక్ ఆలోచిస్తూ ఉంటుందని విమర్శించారు. పేదరికాన్ని నిర్మూలించి ఆర్థికాభివృద్ధి సాధించే లక్ష్యంతో ఇండియా ముందుకెళ్తుంటే.. పాకిస్తాన్ మాత్రం టెర్రరిస్టులను పెంచి పోషిస్తున్నదని మండిపడ్డారు.
టెర్రరిజం అనే రోగాన్ని పాకిస్తాన్ యువతే నయం చేయగలదన్నారు. ప్రపంచంలోనే ఇండియా 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా ఎదిగితే.. మీరు ఎక్కడున్నారని పాకిస్తాన్ ప్రజలను మోదీ ప్రశ్నించారు. ఉగ్రవాదాన్ని భూస్థాపితం చేయడానికి పాకిస్తాన్ ప్రజలు, ముఖ్యంగా యువత ముందుకు రావాలని కోరారు. రొట్టెలు తిని ప్రశాంతంగా బతకాలని.. లేదంటే తన వద్ద బుల్లెట్లు ఉన్నాయని హెచ్చరించారు.
ఇండియా, పాకిస్తాన్ విభజన తర్వాత ఆ దేశం మనతో శత్రుత్వం, ద్వేషమే పెంచుకున్నదని అన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం గుజరాత్‌కు చేరుకున్న మోదీకి ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. వడోదర ఎయిర్ పోర్ట్ నుంచి ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ వరకు రోడ్ షో నిర్వహించారు. బీజేపీ నేతలు, గుజరాత్ ప్రజలు జాతీయ జెండాలు పట్టుకుని నినాదాలు చేశారు. దాహోద్‌లో రూ.24వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలలో పాల్గొన్నారు. ఆపై భుజ్‌లో నిర్వహించిన ర్యాలీలోనూ పాల్గొని మాట్లాడారు.
మాది టూరిజం.. పాక్ది టెర్రరిజం
ఇండియా టూరిజంపై నమ్మకం ఉంచి ప్రజలను ఏకం చేస్తుంటే.. పాకిస్తాన్ మాత్రం టెర్రరిజాన్ని టూరిజంగా భావిస్తున్నదని, ఇది ప్రపంచానికే పెద్ద ముప్పు అని మోదీ మండిపడ్డారు. దాహోద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. ‘‘ఆపరేషన్ సిందూర్ కేవలం ఒక సైనిక చర్య కాదు. ఇది మన భారతీయ విలువలు, భావాల వ్యక్తీకరణ. పహల్గాం దాడి తర్వాత మన బలగాలు పాకిస్తాన్, పీవోకేలోని టెర్రరిస్టు క్యాంపులను ధ్వంసం చేశాయి. ఇక నుంచి ఇండియాపై ఒక్క ఉగ్రదాడి జరిగినా.. పరిణామాలు ఆపరేషన్ సిందూర్ కంటే తీవ్రంగా ఉంటాయి. మా అక్కాచెల్లెళ్ల సిందూరాన్ని తుడిచిపెట్టే దుస్సాహసానికి ఒడిగడితే ఎలా ఉంటదో ఆపరేషన్ సిందూర్తో తెలియజేసినం’’ అని మోదీ అన్నారు.
స్వదేశీ వస్తువులే వాడండి
దాహోద్‌లో ఏర్పాటు చేసిన లోకోమోటివ్ తయారీ కేంద్రాన్ని ప్రధాని మోదీ పరిశీలించారు. ఈ కేంద్రంలో 9,000 హెచ్‌పీ సామర్థ్యం గల ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌లు తయారవుతాయి. ఇవి 4,500 టన్నుల బరువును గంటకు 120 కిలో మీటర్ల వేగంతో తీసుకెళ్లగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ ప్లాంట్‌లో తయారు చేయబడిన లోకోమోటివ్స్ ఇండియాలోనే అత్యంత శక్తివంతమైనవి కానున్నాయి. కాగా, వెరావల్ – అహ్మదాబాద్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్, వల్సాద్ – దాహోద్ మధ్య ఎక్స్‌ప్రెస్ రైలుకు మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ‘‘ ప్రతీ భారతీయుడు స్వదేశీ వస్తువులే కొనుగోలు చేస్తామని ప్రతిజ్ఞ చేయాలి. మన దేశంలో తయారైన ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందుతుంటే.. మనమేమో విదేశీ వస్తువుల వెంట పడ్తున్నం’’ అని మోదీ అన్నారు.