చికెన్, మటన్ సహా అన్నీ తినాలె

V6 Velugu Posted on Mar 10, 2021

  • అప్పుడే ఎముకలు బలంగా ఉంటయి
  • పూర్తి వీగన్ డైట్ మంచిది కాదంటున్న సైంటిస్టులు

కొందరు నాన్ వెజ్ తినరు. పాలు పితకడం కూడా జంతువులను బాధించడమే కాబట్టి పాలతో పాటు డెయిరీ ప్రొడక్ట్స్ కూడా ఏవీ తీసుకోరు. ఇలా మొండిపట్టు పట్టి పూర్తిగా ఆకులు, కాయగూరలతోనే డైట్ తీసుకుంటుంటారు. ఇలాంటి వారందరినీ వీగన్స్ అంటారు. అయితే ఈ డైట్తో శరీరానికి అందాల్సిన అన్ని పోషకాలు అందక, ఎముకల్లో బలం తగ్గిపోతుందని జర్మనీ సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఇలా ఎముకల్లో బలం తగ్గిపోకుండా, చిన్న దెబ్బలకే అవి విరిగిపోకుండా ఉండాలంటే పాలు, మాంసం కూడా తీసుకోవాల్సిందేనని సూచిస్తున్నారు.

గడిచిన కొన్నేండ్లుగా ప్రపంచవ్యాప్తంగా వీగన్ కల్చర్ పెరుగుతోంది. ఈ ట్రెండ్ వల్ల పూర్తిగా వీగన్ డైట్ (డెయిరీ ప్రొడక్ట్స్, నాన్ వెజ్ లేని ఫుడ్) తీసుకోవడానికి ఇష్టపడే వాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే ఇది డేంజర్ బెల్స్ మోగిస్తోందని జర్మనీ ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రిస్క్ అసెస్మెంట్ సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. పూర్తి వీగన్ డైట్తో సరిపెట్టుకుంటే విటమిన్ ఏ, బీ6, లైసిన్, ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్, సెలెనోప్రొటీన్ పీ, ఐయోడీన్, కాల్షియం, మెగ్నీషియం, ఆల్ఫా క్లొతో ప్రొటీన్ లాంటి కీలక పోషకాలు శరీరానికి అందవని చెబుతున్నారు. ఈ పోషకాలు జంతు సంబంధమైన ఆహారంలోనే పుష్కలంగా ఉంటాయని, పాలు, మాసం లాంటివి తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు.

ఎముకలు వీక్ అయితయ్
జంతు సంబంధమైన ఆహారం తీసుకోకుంటే ఎముకల బలం తగ్గిపోయి, ఈజీగా బోన్ ఫ్యాక్చర్స్ అయ్యే ప్రమాదం పెరుగుతుందని జర్మనీ శాస్త్రవేత్తలు తెలిపారు. బోన్ డెన్సిటీ తక్కువగా ఉండడం, ఎముకలకు అందాల్సిన మినరల్స్ అందకపోవడం వల్ల విరిగిన ఎముకలు మళ్లీ నార్మల్ అవ్వడానికి కూడా ఎక్కువ టైమ్ పడుతుందని తమ అధ్యయనంలో తేలిందని చెబుతున్నారు.

అల్ట్రాసౌండ్ మెజర్మెంట్స్ ఆధారంగా..
జర్మనీ ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రిస్క్ అసెస్మెంట్ సైంటిస్టులు పూర్తి వీగన్ ఫుడ్ తీసుకునే 36 మంది, కూరగాయలతో పాటు పాలు, నాన్ వెజ్ కూడా తినే మరో 36 మందిపై అధ్యయనం చేశారు. అల్ట్రాసౌండ్ స్కాన్స్ ఆధారంగా బోన్ హెల్త్ను పరీక్షించారు. జంతు సంబంధమైన ఆహార పదార్థాల నుంచి అందే పోషకాలు తీసుకోకపోవడం వల్ల వీగన్స్లో ఎముకల పటుత్వం తక్కువగా ఉందని తమ రీసెర్చ్లో తేలిందని జర్మనీ ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రిస్క్ అసెస్మెంట్ సంస్థ ప్రెసిడెంట్ ఆండ్రియా హెన్సెల్ తెలిపారు. వీగన్ డైట్ వల్ల షుగర్, కేన్సర్, గుండె జబ్బులు లాంటివి వచ్చే ముప్పు తగ్గుతుందని, కానీ ఎముకలకు అవసరమైన మినరల్స్ సరైన మోతాదులో అందక బోన్ ఫ్యాక్చర్ రిస్క్ పెరుగుతుందని చెప్పారు. వీగన్ డైట్ తీసుకునే వారిలో విరిగిన ఎముకలు అతికే శక్తి కూడా తక్కువగా ఉంటుందని అల్ట్రాసౌండ్ రిపోర్ట్స్ ద్వారా తేలిందన్నారు. 

12 రకాల పోషకాలు మంచిగ అందట్లే
ఎముక పుష్టిని పెంచే మినరల్స్, ఇతర అనారోగ్య సమస్యల రిస్క్ తగ్గించే 12 రకాల పోషకాలు వీగన్స్కు సరిగా అందట్లేదని ఈ స్టడీలో తేలింది. ఆ 72 మంది బ్లడ్, యూరిన్ శాంపిల్స్ తీసుకుని టెస్టులు చేయగా వీగన్స్లో 12 రకాల బయోమార్కర్స్ లెవెల్స్ ఉండాల్సిన దాని కన్నా తక్కువగా ఉన్నాయని సైంటిస్టులు తెలిపారు. ఏ, బీ6 విటమిన్లు, లైసిన్, ల్యూసెన్, ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్, సెలెనోప్రొటీన్ పీ, అయోడిన్, థైరాయిడ్ స్టిములేటింగ్  హార్మోన్, కాల్షియం, మెగ్నీషియం,  ఆల్ఫా క్లొతో ప్రొటీన్, ఎఫ్జీఎఫ్ 23 హార్మోన్ వంటివి ఎక్కువగా జంతు సంబంధమైన ఆహారాల్లోనే దొరుకుతాయి.  వీటిలో కొన్ని పోషకాలు ఆకుకూరల్లో ఉన్నప్పటికీ, వాటిని ఎక్కువగా ఉడికించడం వల్ల అవి ఆవిరైపోయి, శరీరానికి సరైన మోతాదులో అందవని సైంటిస్టులు తెలిపారు. లైసిన్ అమినోయాసిడ్ మాంసం, చేపలు, గుడ్లు, పాలు, డెయిరీ ప్రొడక్ట్స్, సోయాలో  ఉంటాయి. విటమిన్ ఏ గుడ్లు, ఆకుకూరల్లో దొరుకుతాయి. విటమిన్ బీ6 చేపలు, మాంసంలో ఎక్కువగా దొరుకుతాయి.

Tagged life

Latest Videos

Subscribe Now

More News