ఈ ఆహారంతో డెంగ్యూ నుంచి ఫాస్ట్ రికవరీ

ఈ ఆహారంతో డెంగ్యూ నుంచి ఫాస్ట్ రికవరీ

ప్లేట్ లెట్ కౌంట్ తగ్గకుండా చూసుకునే చిట్కాలు

ఓ వైపు సీజన్ మారడం.. మరోవైపు వర్షాల చిత్తడి తగ్గకపోవడంతో సీజనల్ జ్వరాలు ఎక్కువైపోయాయి. దోమల ముసురు వల్ల ఎక్కువగా డెంగ్యూ ఫీవర్ కేసులు నమోదవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాస్పిటల్స్ కు క్యూ కడుతున్నారు డెంగ్యూ బాధితులు. తెల్లరక్తకణాలు (ప్లేట్ లెట్స్) పడిపోయి.. కొంత మంది క్రిటికల్ కండిషన్ లో అల్లాడుతున్నారు. వేల రూపాయలు ఖర్చు అవుతోంది.

ఈ ప్లేట్ లెట్స్ ఎక్కించే యంత్రాలు చిన్న ఆస్పత్రుల్లో లేకపోవడంతో కార్పొరేట్ వైద్యం వైపు చూడాల్సి వస్తోంది. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వారికి ఇది భారంగా మారుతోంది. డెంగ్యూ వచ్చి ఆస్పత్రిలో చేరితే 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు వదులుతున్న పరిస్థతి కూడా కనిపిస్తోంది.

ప్రకృతి పరంగా చిన్న చిన్న చిట్కాలు ఫాలో అయితే అసలు ఈ తలకు మించిన భారం పడదు.. సింపుల్ గా ఇంట్లోనే మామూలు జ్వరానికి వాడినట్లే మందులు వేసుకుంటూనే డెంగ్యూ తగ్గించుకోవచ్చు. మంచినీళ్లలో చేరే దోమల వల్లే డెంగ్యూ వస్తుంది ముందుగా వాటిని చేరనీయకుండా చేసేందుకు నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవాలి. దీనితో పాటు రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి.

ఈ ఆహారం తీసుకుంటే మేలు

బొప్పాయి పండు/ఆకుల జ్యూస్, గంజి, రాగి జావ, క్యారెట్ జ్యూస్, దానిమ్మ, లెమన్ జ్యూస్, కొబ్బరి నీళ్లు, హెర్బల్ టీ లాంటివి తీసుకోవడం చాలా మంచిది. వీటి సాయంతో ప్లేట్ లెట్స్ తగ్గకుండా చూసుకోవచ్చు. ఒక వేళ తగ్గితే వాటి సంఖ్య పెంచుకోవచ్చు.

బొప్పాయి

డెంగ్యూకు ఆహార పరంగా బొప్పాయికి మించిన మందు లేదు. బొప్పాయి పండు లేదా జ్యూస్ తీసుకోవచ్చు. లేదంటే బొప్పాయి ఆకులతో జ్యూస్ చేసుకుని తాగితే ఇంకా మంచిది. ఆకుల్ని నూరి చిన్న చిన్న ఉండలుగా చేసి ఉదయం, సాయంత్రం మింగినా మంచిది.

గంజి/రాగి జావ

జ్వరం వచ్చినప్పుడు ఆహారం బొత్తిగా సగించదు. దీని వల్ల శరీరం నీరసం అయిపోయి.. వైరస్ కి బలం ఇచ్చినట్టే. ఈ టైంలో గంజి లేదా రాగి జావ తాగితే తొందరగా శక్తి వస్తుంది. మంచి ప్రొటీన్ ఫుడ్ కూడా. ఇది వైరస్ తో పోరాడే శక్తిని రక్తకణాలకు వేగంగా ఇస్తుంది.

క్యారెట్ జ్యూస్

క్యారెట్ లేదా ఫ్రస్ ఆకుకూరల జ్యూస్ తీసుకోవడం కూడా మంచిది. ఇవి శరీరానికి మంచి పోషకాలను ఇస్తాయి. డెంగ్యూ పేషెంట్లు తొందరగా రికవరీ కావడానికి క్యారెట్ తో పాటు మరికొన్ని పచ్చి కూరగాయల్ని కూడా తీసుకోవచ్చు.

దానిమ్మ/లెమన్ జ్యూస్

పండ్ల రసాలను ఎక్కువగా తీసుకుంటే డెంగ్యూ జ్వరం నుంచి త్వరగా కోలుకోవచ్చు. ప్లేట్ లెట్స్ (తెల్లరక్త కణాల) సంఖ్య కూడా పెరగడానికి సాయపడుతాయి జ్యూస్ లు. ముఖ్యంగా దానిమ్మ, లెమన్, ఆరెంజ్ జ్యూస్ లు తీసుకోవడం మేలు. సిట్రస్ జ్యూసులు తాగడం వల్ల యూరిన్ ఇన్ ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.

హెర్బల్ టీ

రోజూ తాగే చాయ్, కాఫీలు డెంగ్యూ టైంలో తాగకపోవడం మేలు. అల్లం, లవంగాలు, కొత్తిమీర, పుదీనా లాంటి వాటితో చేసుకున్న హెర్బల్ టీ తీసుకోవడం మేలు. వీటితో మత్తుగా ఉన్న ఫీలింగ్ లేకుండా హుషారు  వస్తుంది. శరీరంలో ఉత్తేజం నిండుతుంది.

కొబ్బరి నీళ్లు

జ్వరం వచ్చినప్పుడే కాదు.. రోజూ రెండు గ్లాసులు కొబ్బరి నీళ్లు తీసుకోవడం అందరికీ మంచింది. డీ హైడ్రేషన్ బారిన పడకుండా చూసుకోవడానికి ఇంతకు మించిన చిట్కా లేదు. దీనితో పాటు శరీరానికి అవసరమైన మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ వచ్చి శక్తి వస్తుంది.