గులాబీ జెండాకు ఓనర్లెవరో ప్రజలే తేల్చాలి

గులాబీ జెండాకు ఓనర్లెవరో ప్రజలే తేల్చాలి
  • గులాబీ జెండాకు ఓనర్లు మీరా? మేమా? అనేది ప్రజలే తేలుస్తారు
  • కొప్పుల ఈశ్వర్, గుంగుల కమలాకర్‌కు ఈటల గురించి మాట్లాడే అర్హత లేదు
  • ఈటలతో పాటు సీఎం కేసీఆర్ కూడా రాజీనామా చేయాలి
  • ఈటల అభిమానుల డిమాండ్

భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో పాటు సీఎం కేసీఆర్ కూడా రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలని ఈటల మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. అలా చేస్తే ఎవరి బలం ఎంతో తెలుస్తుందని వారంటున్నారు.

ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ అచ్చంపేటలో వందల ఎకరాలు కబ్జా చేశారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దాంతో ఆయనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారు. తాజాగా ఆయనను ఎమ్మెల్యే పదవితో పాటు టీఆర్ఎస్ పార్టీకి కూడా రాజీనామా చేయాలని టీఆర్ఎస్‌కు చెందిన గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ తదితరులు డిమాండ్ చేస్తున్నారు. దాంతో ఈటల మద్దతుదారులు టీఆర్ఎస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీని ప్రభుత్వంలోకి తీసుకురావడానికి ఈటల రాజేందర్ అహర్నిషలు కృషి చేశారని వారంటున్నారు. కారు గుర్తు మీద ఈటల గెలిచారని అంటున్న టీఆర్ఎస్ నేతలు కూడా వారి పదవులకు రాజీనామా చేయాలని ఈటల అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌తో సహా ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ రాజీనామాలు చేసి.. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి తేల్చుకుందామని సవాలు విసురుతున్నారు. అప్పుడు ఎవరి బలం ఏంటో తేలుతుందని ఈటల అభిమానులు అంటున్నారు. ఎన్నికలకు వెళ్తే గులాబీ జెండాకు ఓనర్లు మీరా? మేమా? అనేది ప్రజలే తేలుస్తారని వారంటున్నారు. కాగా.. ఈటల నుంచి ఎంతో సాయంపొందిన గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ లాంటి వాళ్లకు ఈటల గురించి మాట్లాడే అర్హత లేదని.. అనవసరంగా ఈటల గురించి అవాస్తవాలు మాట్లాడితే.. మీ గురించి మరిన్ని వాస్తవాలు మేం బయటపెడతామని ఈటల అభిమానులు హెచ్చరిస్తున్నారు.