నువ్వు నిన్న తిరిగిన 4 లైన్ రోడ్లన్నీ  నేను వేయించినవే

నువ్వు నిన్న తిరిగిన 4 లైన్ రోడ్లన్నీ  నేను వేయించినవే

జమ్మికుంట: హుజురాబాద్ ఉపఎన్నికలో గెలవడం కోసం పార్టీల మధ్య మాటలయుద్దం తారాస్థాయికి చేరుకుంది. బీజేపీ, టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా దూకుడు పెంచాయి. ఇరుపార్టీల నేతలు నియోజకవర్గంలో ప్రతిరోజూ పర్యటిస్తూనే ఉన్నారు. పాదయాత్రలో అనారోగ్యంపాలై కోలుకున్న తర్వాత మళ్లీ నియోజకవర్గంలో తిరుగుతున్న ఈటల.. గురువారం జమ్మికుంటలో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. 

హరీశ్ రావు నువ్వు ఎంతచేసినా మీ మామ నిన్ను నమ్మడు
హరీశ్ రావు గారు మీరు ఎంత చేసినా.. మీ మామ నిన్ను నమ్మడు. ఏనాటికైనా ఈ పార్టీని కాప్చర్ చేస్తా అనుకుంటున్నావు. కానీ, మీ మామ బతికుండగానే టీఆర్ఎస్ ను నమ్మే స్థితిలో ప్రజలు లేరు. మిమ్ముల్ని ఎవరూ నమ్మరు. మీ చేతికి వచ్చే లోపు ఆ పార్టీ ఖతం అయితది. నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తే చరిత్ర మిమ్ముల్ని క్షమించదు. చిల్లర ఆరోపణలు, చౌక బారు ప్రచారాలు చేయవద్దు. ఇలా చేసి పలచపడకు. ధర్మానికి, న్యాయానికి విరుద్దంగా పని చేస్తే మీకు కూడా అదే గతి పడుతుంది. 18 సంవత్సరాల అనుబంధం మనది. అవన్నీ మర్చిపోయి.. మీ మామ దగ్గర మార్కులు కొట్టేయడానికి ఇవ్వన్నీ చెయ్యకు. మీ మోసపు మాటలు హుజూరాబాద్ ప్రజలు నమ్మరు. దుబ్బాకలోలాగా కర్రు కాల్చి వాత పెడతారు.

ఎమ్మెల్యే కాకుండా మంత్రి అయిన వాడివి నువ్వు
ఎమ్మెల్యేగా గెలవకుండానే మంత్రి అయిన వాడివి నువ్వు. మీ మామ నియోజకవర్గంలో నువ్వు వరుసగా గెలుస్తున్నావు. కానీ, నేను అలాకాదు. ఒక్క అవకాశం ఇస్తే.. ఓటమి లేకుండా ప్రజల ప్రేమను పొందిన వాడిని. హుజూరాబాద్ లో అభివృద్ది జరగలేదు అంటున్నారు. నువ్వు నిన్న తిరిగిన 4 లైన్ రోడ్లన్నీ  నేను వేయించినవే. 
అభివృద్ది విషయంలో మీకు ఎంత సోయి ఉందో.. నాకూ అంతే సోయి ఉంది. ఆగష్టు 3, 2018న 50 మహిళా సంఘాలకు 10 లక్షల రూపాయలు నేను ఇచ్చిన. ఈ రోజు మీరు ఓట్ల కోసం ఇస్తున్నారు. హుజూరాబాద్ లో 3900 ఇండ్లు మంజూరు అయ్యాయి. జమ్మికుంటలో, హుజూరాబాద్లో, కమలాపూర్ లో 500 ఇండ్లు కట్టించాను. ఇంకో 500 ఇండ్లు ధర్మారం, కోరుకల్, చిన్న ముల్కనూర్ లో కట్టించాను. సిద్దిపేటలో, గజ్వేల్లో, సిరిసిళ్ళలో డబుల్ బెడ్ రూమ్ లు కడుతుంది కాళేశ్వరం కట్టిన కాంట్రాక్టర్స్ కాదా. తెలంగాణ ఏర్పడిన తరువాత హుజూరాబాద్ నియోజకవర్గ రూపురేఖలు మార్చిన. 18 చెక్ డ్యామ్ లు కట్టినం.  రూ. 1050 కోట్లతో ఎస్ఆర్ఎస్పీ కాలువలు బాగుచేయించిన. హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాలకు చేరో రూ. 40 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే.. వాటిని మంజూరు కాకుండా కేటీఆర్ ఆపారు. ఆ డబ్బులను ఇప్పుడు మంజూరు చేసి.. కొత్తగా ఇస్తున్నట్టు జీవో ఇచ్చారు. 

వందల కోట్లతో ఓట్లను కొన్నవాడిగా కేసీఆర్ పేరు చరిత్రలో నిలిచిపోతుంది
ఉప ఎన్నికలో గెలవాలని ఇప్పటికే 192 కోట్ల రూపాయలు హుజూరాబాద్ లో ఖర్చు పెట్టారు. నాతో పాటు 11 మంది సొంత పార్టీ నేతలను ఓడ గొట్టడానికి కేసీఆర్ ప్రతిపక్ష నేతలకు డబ్బులు ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేల ఫోన్లు అన్నీ టాప్ అవుతున్నాయి. 17 శాతం మంది జనాభా ఉన్న ఎస్సీలకు ఎన్ని మంత్రి పదవులు ఇచ్చారు? వెలమలకు ఎన్ని పదవులు ఇచ్చారు? మూడు సార్లు ప్రగతి భవన్ గేట్ దగ్గర మమ్ముల్ని ఆపారు. టీఆర్ఎస్ లో 2016 నుంచే బానిస బతుకులు మొదలయ్యాయి. మంత్రులకు కూడా సీఎం దగ్గర అపాయింట్మెంట్ లేదని ఆపితే.. ఇదే కరీంనగర్ మంత్రి గంగుల కమలాకర్.. ఇంత అహంకారమా? ఇంత దొరతనమా? కరీంనగర్ నుంచే మళ్ళీ ఉద్యమం రావాలి అని ఆనాడు అన్నారు. ఈ రోజు ఇక్కడ వచ్చి ఏదో మాట్లాడుతున్నారు. ప్రగతి భవన్ కాదు బానిస భవన్ అని పెట్టుకో అని గోళీలు ఇచ్చే ఎంపీ సంతోష్ కుమార్ కి ఆనాడే  చెప్పిన. దమ్ము ఎవరికి ఉందో తెలుసుకోండి. నా పదవి కంటే నా ఆత్మ గౌరవం గొప్పది. వందల కోట్లతో ప్రజలను కొనడానికి పునాది వేసిన వాడిగా కేసీఆర్ మీ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. ఖజానాలో డబ్బులు నిండుగా ఉంటే.. మధ్యాహ్న భోజనం పథకం వారికి డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు? ఎందుకు జీతాలు 20వ తేదీ వరకు ఇవ్వడం లేదు? సోషల్ వెల్ఫేర్ హాస్టల్ లో భోజనం ఎందుకు పెట్టలేక పోతున్నారు?’ అని ఈటల ప్రశ్నించారు.