ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతిస్తామన్నారు

ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతిస్తామన్నారు

భాకబ్జా ఆరోపణలతో మంత్రివర్గం నుంచి వేటుపడిన మాజీమంత్రి ఈటల రాజేందర్.. భవిష్యత్ నిర్ణయం గురించి తన సొంత జిల్లాలోని నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని వేలాది మంది ఎంపీపీలు, సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధులతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. తనకు టీఆర్ఎస్ పార్టీ నుంచి బీ ఫామ్ ఇస్తే.. తన మీద నమ్మకంతో గెలిపించారని ఆయన అన్నారు. 

‘కార్యకర్తలు రెండు రకాలుగా అభిప్రాయాలు చెబుతున్నారు. కమిట్‌మెంట్, బాధ్యత ఉన్న నా నియోజకవర్గంతో ఎంతో అనుబంధం ఉంది. హుజురాబాద్ నియోజకవర్గానికి చాలా ప్రత్యేకత ఉంది. కమలాపూర్ మండలంలోని ఉప్పల్ రైల్వేస్టేషన్‌లో రైల్ రోఖో నిర్వహించి తెలంగాణ ఉద్యమాన్ని ఢిల్లీ సర్కార్‌కు తెలిసేలా చేసింది. రాష్టంలో కరోనా తీవ్రంగా ఉందని.. ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కార్యకర్తలు అంటున్నారు. తెలంగాణలోని పాత 9 జిల్లాల నుంచి లీడర్లు వచ్చి.. నీలాంటి వాడికే ఇలాంటి కష్టమొస్తే ఎలా అని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. నా మీద ఇలా చేయడం సహించరానిదని, ఖండిస్తున్నామని లీడర్లు అంటున్నారు. నియోజకవర్గంలోని కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకున్నాను. నేను ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతిస్తామన్నారు. హైదరాబాద్ వెళ్లి నా శ్రేయోభిలాషుల అభిప్రాయాలు కూడా తెలుసుకొని త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తా’ అని ఈటల అన్నారు.