పింఛన్ రావాలంటే ఇంటిమీద గులాబీ జెండా పెట్టుకోవాలట

పింఛన్ రావాలంటే ఇంటిమీద గులాబీ జెండా పెట్టుకోవాలట

కరీంనగర్: సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు ఉప ఎన్నిక షెడ్యూలు వచ్చిందని బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తాను మంత్రి వర్గం నుంచి బయటకు వచ్చిన 5 నెలల నుంచి సీఎం డైరెక్షన్‎లో హరీశ్ రావు, అరడజన్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గొర్రెల మందల మీద తోడేళ్లు పడ్డట్లు తన మీద దాడి చేస్తున్నారని ఆయన అన్నారు. హుజురాబాద్‎లోని మధువాణి గార్డెన్స్‎లో ఏర్పాటుచేసిన ప్రెస్‎మీట్‎లో మాజీ మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు.

‘ప్రజాస్వామిక విలువలను అపహాస్యం చేసేవిధంగా నేను పార్టీలో ఉండగానే.. నా తోటి సభ్యులను భయపెట్టి నాతో అనుబంధాన్ని తెంచే ప్రయత్నం చేశారు. పచ్చటి సంసారంలో వాళ్లు చిచ్చుపెట్టారు. హుజురాబాద్‎లో రాజకీయ వ్యవస్థ ఒకప్పుడు పచ్చటి సంసారంలాగా ఉండేది. ఐదు నెలలుగా హుజురాబాద్ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. రకరకాల ప్రలోభాల పేరుతో హుజురాబాద్ ప్రజలు అసహ్యించుకునేలా చేశారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా హుజురాబాద్ ప్రజలంతా ఐదు నెలలుగా భయపడకుండా నాకు అండగా ఉన్నారు. వాళ్లందరికీ శిరస్సు వహించి నమస్కరిస్తున్నా. మంత్రులుగా ఉన్నవాళ్లు, పార్టీలో వివిధ హోదాల్లో ఉన్నవాళ్లు తమపాలసీలు, కార్యచరణ చెప్పుకోవాలి. హరీశ్ రావు సర్పంచులు, ఎంపీటీసీలను పిలిపించుకుని.. ఈటల వెంట ఉన్నవాళ్లను పట్టుకురావాలని ఆదేశించాడు. కన్నీళ్లు దిగమింగుకుని, గుండెలు బరువెక్కినా చాలా మంది తొణకకుండా నా వెంట ఉన్నారు. 

హుజురాబాద్‎లో ఇప్పుడున్న పరిస్థితుల్లో.. యావత్ తెలంగాణ ఈటల గెలుపు కోసం చూస్తున్నారు. సమ్మిరెడ్డి అనే నాయకుడు నాతో పాటు వస్తే... మంత్రి హోదాలో ఉన్న హరీశ్ రావు అతని ఇంటికి వెళ్లి తనతో రావాలని కోరాడంటే ఆయన నిజస్వరూపం అర్థం చేసుకోవాలి. హరీశ్ రావుకు ఇక్కడి నాయకులపై నమ్మకం లేక.. సిద్ధిపేట, బెజ్జంకి నుంచి నాయకులను రప్పించుకుని ఇక్కడి వాళ్లను అవమానించారు. పింఛన్, దళితబంధు రావాలంటే ఇంటిమీద గులాబీ జెండా పెట్టుకోవాలట. హుజురాబాద్‎ను గుత్తపట్టినట్లుగా.. వ్యవహరిస్తున్నారు. నేను మంత్రిగా ఉండగా కొందరు పేదోళ్లకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తే.. వాళ్లు టీఆర్ఎస్ కండువా కప్పుకోలేదని ఉద్యోగాల నుంచి తీసేశారు. గ్రామాలను దావత్‎లకు అడ్డాలుగా మార్చారు. స్వయంగా మంత్రులే టేబుల్స్ వేసి దావత్‎లకు నాయకత్వం వహించే నీచానికి దిగారు. నీచపు పార్టీ టీఆర్ఎస్.. నీచపు నాయకులు ఆ పార్టీ వాళ్లు. హుజురాబాద్‎లో మాటలొచ్చిన చిన్నపిల్లోడి నుంచి పండుముసలి వరకు జై ఈటల, జై బీజేపీ అంటున్నారు. ఇంత హింస, దౌర్జన్యం తర్వాత కూడా మొక్కవోని ధైర్యంతో నాకు అండగా ఉన్నవాళ్ల రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను. 

నేను 18 ఏళ్లపాటు చేసిన సేవకు నాకు ఇప్పుడు ఫలితం కనిపిస్తోంది. అక్టోబరు 30న ఎన్నికలు జరగబోతున్నాయి. దసరా, బతుకమ్మ పండుగలు కూడా ఈ మధ్యలో జరుగుతాయి. కాబట్టి మీరే కథానాయకులై ఎన్నికల్లో పాల్గొనాలి. అక్రమంగా పంపిస్తున్న డబ్బు సంచులను, పథకాల ప్రలోభాలను పక్కన పెట్టి ఆత్మగౌరవం కోసం నిలబడాలి. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుటా ఎగురవేసే రోజు అక్టోబరు 30. ఆనాడు మీ బిడ్డగా నన్ను నిండు మనస్సుతో ఆశీర్వదించండి. గత 18 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు మీకోసం ఎలా పనిచేశానో... రాబోయే కాలంలో కూడా మీ నోట్లో నాలుకలాగా.. మీరు అప్పజెప్పే బాధ్యతలు నెరవేరుస్తా. టీఆర్ఎస్ వాళ్లు దొంగ ఓట్ల నమోదుకు కూడా ప్రయత్నిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వాటిని అడ్డుకుంటాం. ఇతర చోట్ల చెల్లినట్లుగా మీ కుట్రలు, కుతంత్రాలు ఇక్కడ చెల్లవు. మీ ఇంటి నెంబర్ల మీద దొంగ ఓట్లు నమోదయ్యే ప్రమాదముంది. అప్రమత్తంగా ఉండండి. మేం కూడా నిఘా పెట్టాం. ఆర్డీవో ఆధ్వర్యంలో స్వయంగా సీఎం, మంత్రులు ఈ ప్రక్రియను చూస్తున్నట్లు నాకు సమాచారం ఉంది. ఆ డిపార్టుమెంట్లో పనిచేసేవాళ్లు మాకు చెబుతున్నారు. వాళ్ల పేర్లు బయటపెట్టం. కుట్రలు, కుతంత్రాలు, ప్రలోభాలతో బెదిరించే ప్రయత్నం చేస్తే మీకు హుజురాబాద్ ప్రజల చేతిలో శిక్ష తప్పదు. అక్టోబర్ 2వ తేదీన బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభ హుజురాబాద్‎లో యథావిథిగా ఉంటుంది. అది ముందే డిసైడ్ చేసిన కార్యక్రమం’ అని ఈటల అన్నారు.

For More News..

కోచింగ్ లేకుండా ఐపీఎస్ నెగ్గిన 22 ఏళ్ల కుర్రాడు

దిశను మార్చుకున్న గులాబ్ తుఫాన్..

హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ రిలీజ్