గడ్డిపోచలా తీసేస్తే.. గడ్డపార అవుతానని అనుకోలేదు

V6 Velugu Posted on Sep 24, 2021

కరీంనగర్: కేసీఆర్‎కు హుజురాబాద్ ప్రజలను కొనే శక్తి లేదని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. టీఆర్ఎస్ హుజురాబాద్‎లో విందు రాజకీయాలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం పోతిరెడ్డిపల్లిలో వివిధ పార్టీలకు చెందిన పలువురు సీనియర్ నాయకులు ఈటల ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. డప్పు చప్పుళ్ల మధ్య ఈటలకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

‘కేసీఆర్ అక్రమ సంపాదనకు, అహంకారానికి.. హుజురాబాద్ ప్రజలకు మధ్య జరుగుతున్న పోరాటం ఇది. పావలావడ్డి రుణాలు రావాలంటే టీఆర్ఎస్ మీటింగ్‎కు రావాలని మహిళలపై టీఆర్ఎస్ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. హుజురాబాద్ ఆడబిడ్డలకు ఇచ్చినట్లుగానే.. తెలంగాణలోని మహిళలందరికీ రుణాలు ఇవ్వాలి. నేను రాజీనామా చేస్తేనే ఇన్ని పథకాలు వస్తున్నాయంటే.. మరి గెలిస్తే ఇంకెన్ని పథకాలు తెస్తానో ఆలోచించాలి. హరీశ్ రావు మార్కెట్లో వస్తువులు కొనకుండా.. కేవలం ఆత్మగౌరవాన్ని కొంటున్నారు. వారితో చేరే వారందరూ అమ్ముడుపోవడం లేదు. వాళ్ల దగ్గర నటిస్తున్నారంతే. హుజురాబాద్ గడ్డమీద ప్రజలను కొనగలిగే శక్తి కేసీఆర్‎కు, హరీశ్ రావుకు కాదు కదా.. వాళ్ల జేజెమ్మకు కూడా లేదు. నీ పార్టీ చరిత్ర 20 ఏళ్లైతే.. నేను 18 ఏళ్లు మీ పార్టీలో ఉన్నా. నన్ను మధ్యలో వచ్చి మధ్యలో పోయానంటారా.. మీ భరతం పడుతా బిడ్డా. నేను ఎదిగితే... వాళ్లకు ఏకుమేకవుతానని వెళ్లగొట్టారు. గడ్డిపోచలా తీసేస్తే పోతానని అనుకున్నారు. కానీ, గడ్డపార అవుతానని వాళ్లు అనుకోలేదు. కేసీఆర్ అక్రమ సంపాదనకు, అహంకారానికి, దొరతనానికి.. ప్రజలకు మధ్య జరుగుతున్న పోరాటమిది. ఈ ధర్మపోరాటంలో నాకు అండగా నిలవండి. వాళ్లు నా గురించి విమర్శలు చేస్తుంటే టీవీ పగులగొట్టాలనిపిస్తోందని ఓ మహిళ చెప్పింది. ఎన్ని డబ్బులిచ్చినా ధర్మాన్ని, నన్ను మర్చిపోకండి. 
టీఆర్ఎస్ వాళ్లకు డిపాజిట్ రాకుండా.. మీ తీర్పునిస్తారని నమ్ముతున్నా’ అని ఈటల అన్నారు.

For More News..

ప్రారంభమై.. వాయిదా పడిన అసెంబ్లీ సమావేశాలు

కొవిడ్ సర్టిఫికెట్ ఉంటేనే శ్రీవారి దర్శనం

Tagged Bjp, TRS, Telangana, Karimnagar, CM KCR, Eatala Rajender, Huzurabad, Huzurabad By election

Latest Videos

Subscribe Now

More News