
- దేశంలో రెండో సుదీర్ఘ ఎన్నికలు
న్యూఢిల్లీ: ప్రస్తుత లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి జూన్ 4 వరకు అతి సుదీర్ఘంగా 44 రోజులపాటు సాగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో మొదలుకొని ఫలితాల వెల్లడి వరకు మొత్తం ఎన్నికల ప్రక్రియను చూ స్తే.. మొత్తం 82 రోజులు పట్టనుంది. దీంతో ఇవి దేశంలో రెండో అతి సుదీర్ఘ ఎన్నికలుగా నిలవనున్నాయి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1951–52లో జరిగిన ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ సందర్భంగా అత్యంత సుదీర్ఘంగా 4 నెలలకుపైగా ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. ఇక దేశంలో అతి స్వల్పంగా 1980 జనవరిలో కేవలం 4 రోజుల్లోనే ఎలక్షన్స్ పూర్తయ్యాయి.
1962 నుంచి 1989 మధ్య జనరల్ ఎలక్షన్లు 4 నుంచి పది రోజుల్లోపు జరిగాయి. ఇక 2004 ఎన్నికలు 4 విడతల్లో 21 రోజుల్లో, 2009 ఎన్నికలు 5 విడతల్లో నెల రోజులు, 2014 ఎన్నికలు 9 విడతల్లో 36 రోజుల్లో పూర్తయ్యాయి. అయితే, ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనే ఇలా షెడ్యూల్ సుదీర్ఘం గా ప్రిపేర్ చేశారన్న ఆరోపణలు వస్తున్నాయని మీడియా ప్రస్తావించగా సీఈసీ రాజీవ్ కుమార్ ఖండించారు. దేశంలోని వివిధ ప్రాంతాల భౌగోళిక పరిస్థితులు, హాలిడేస్, పండుగలు, పరీక్షలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎన్నికలను 7 విడతల్లో నిర్వహించాలని నిర్ణయించామని చెప్పారు.
అనేక రాష్ట్రాల్లో నదులు, కొండలు, అడవులు.. ఇలా అనేక సవాళ్లున్నాయని, ప్రస్తుత పరిస్థితుల్లో బలగాల తరలింపూ అంత ఈజీ కాదన్నారు. గతంలోనూ ఎన్నికల ప్రక్రియ సుదీర్ఘంగా సాగిన సందర్భాలను గుర్తుచేశారు. తాము ఎవరికైనా అనుకూలంగా వ్యవహరిస్తున్నామని అనుకుంటే అందులో వాస్తవం లేదన్నారు.