Shubman Gill: బీసీసీఐ క్లియర్ మెసేజ్.. మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌గా గిల్.. ఎప్పటి నుంచి అంటే..?

Shubman Gill: బీసీసీఐ క్లియర్ మెసేజ్.. మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌గా గిల్.. ఎప్పటి నుంచి అంటే..?

భారత క్రికెట్ చరిత్రలో తొలిసారి మూడు ఫార్మాట్ లను ముగ్గురు కెప్టెన్లు నడిపించనున్నారు. ఇప్పటికే టీ20, టెస్ట్ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి తప్పుకున్న రోహిత్ శర్మ వన్డేల్లో కొనసాగుతానని స్పష్టం చేశాడు. దీంతో రోహిత్ కేవలం వన్డేల్లో మాత్రమే కెప్టెన్సీ చేయనున్నాడు. టీ20 క్రికెట్ లో సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. భారత యువ జట్టు సూర్య కెప్టెన్సీలో తిరుగులేని జట్టుగా దూసుకెళ్తుంది. టెస్ట్ కెప్టెన్ గా యువ బ్యాటర్ శుభమాన్ గిల్ కు సారధ్య బాధ్యతలు అప్పగించారు. అయితే సరిగ్గా గమనిస్తే ఏడాది తర్వాత మూడు ఫార్మాట్లకు గిల్ కెప్టెన్ గ నియమించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. 

ఆసియా కప్ కు గిల్ ను వైస్ కెప్టెన్ గా ప్రకటించడంతో ఫ్యూచర్ లో భారత జట్టుకు మూడు ఫార్మాట్ లలో గిల్ కెప్టెన్సీ చేయనున్నట్టు స్పష్టంగా అర్ధమవుతుంది. ప్రస్తుతం గిల్ టెస్ట్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. వన్డేల్లో వైస్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ శర్మ కెప్టెన్ గా కొనసాగితే గిల్ కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. దీంతో రోహిత్ తర్వాత గిల్ వన్డే జట్టుకు కెప్టెన్సీ చేయడం ఖాయంగా మారింది. ఆసియా కప్ లో గిల్ కు వైస్ కెప్టెన్సీ ఇవ్వడంతో భవిష్యత్ లో ఈ యువ బ్యాటర్ టీ20 కెప్టెన్సీ చేయనున్నాడు. బీసీసీఐ గిల్ ను నమ్మి 2026 టీ20 వరల్డ్ కప్ తర్వాత మూడు ఫార్మాట్లకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే పనిలో కనిపిస్తోంది. 

2026 నుంచి ఆల్ ఫార్మాట్ కెప్టెన్ గా గిల్:

2026 టీ20 వరల్డ్ కప్ కు సూర్య కెప్టెన్ గా కొనసాగడం ఖాయం. అయితే ఆ తర్వాత సూర్య తన కెప్టెన్సీని కోల్పోయే ప్రమాదం కనిపిస్తుంది. దీనికి కారణం లేకపోలేదు. ప్రస్తుతం సూర్య కుమార్ యాదవ్ వయసు 34 సంవత్సరాలు. 2026 సెప్టెంబర్ కు అతనికి 36 ఏళ్ళు నిండుతాయి. వయసు ఎక్కువ కావడంతో భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని సూర్యను కెప్టెన్సీ నుంచి తప్పించి ఆ స్థానంలో వైస్ కెప్టెన్ గా ఉన్న యంగ్ క్రికెటర్ గిల్ కు కెప్టెన్సీ ఇచ్చే అవకాశం ఉంది. గత ఏడాది జింబాబ్వే పర్యటనలో గిల్ తొలిసారిగా ఇండియాకు కెప్టెన్సీ చేశాడు. ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు సారధ్యం వహిస్తున్నాడు.   

వన్డేల్లో కెప్టెన్ గా ఉంటున్న రోహిత్ శర్మ ప్రస్తుత వయసు 37 సంవత్సరాలు. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు రోహిత్ శర్మ ఆడడం దాదాపుగా ఖాయమైంది. ఫిట్ నెస్ లో హిట్ మ్యాన్ కు సమస్యలు ఉన్నాయి. ఇటీవలే ఐపీఎల్ లో సైతం రోహిత్ ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగాడు. దీంతో పాటు ఇప్పటి నుంచే గిల్ కు కెప్టెన్ గా అవకాశమిస్తే 2027 వరల్డ్ కప్ లోపు అనుభవాన్ని సంపాదించుకుంటాడనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్టు సమాచారం. 2027 వరల్డ్ కప్ కు రోహిత్ ప్లేయర్ గా కొనసాగినా కెప్టెన్ గా గిల్ టీమిండియా నడిపించే అవకాశాలు ఉన్నాయి.