Allu Arjun-: ట్రిపుల్ రోల్‌లో అల్లు అర్జున్.. 'అవతార్'ను తలపించేలా 'AA22xA6'.. దీపికా పాత్ర ఇదే!

Allu Arjun-: ట్రిపుల్ రోల్‌లో అల్లు అర్జున్.. 'అవతార్'ను తలపించేలా 'AA22xA6'.. దీపికా పాత్ర ఇదే!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో  తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'AA22xA6'.  ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.  భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇంతవరకు ఎవరూ టచ్ చేయని ఆల్టర్నేట్ రియాలిటీ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.  లేటెస్ట్ గా ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన వివరాలు బయటకు వచ్చాయి.

ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె నటిస్తోంది. ఆమె పాత్ర , సినిమా షూటింగ్ షెడ్యూల్ కు సంబంధించిన కొన్ని వార్తలు ఇంటర్ నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి.  దీపికా తన పాత్ర కోసం నవంబర్ 2025 నుంచి షూటింగ్‌లో పాల్గొననుంది. తన పాత్ర కోసం ఇప్పటికే ఆమె సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి ఆమె ఏకంగా 100 రోజుల కాల్షీట్లు కేటాయించినట్లు సమాచారం. ఈ సినిమాలో దీపికా ఒక యోధురాలి పాత్రలో కనిపించనుంది. ఆమె పాత్రకు ప్రత్యేకమైన ఆయుధాలు, విభిన్నమైన లుక్ ఉంటాయని, ఇంతకుముందు ఎన్నడూ చూడని కొత్త అవతారంలో ఆమెను ప్రేక్షకులు చూడబోతున్నట్లు సినీ ఇండస్త్రీలో టాక్ వినిపిస్తోంది.

అటు సాంకేతికంగానూ.. ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు మూవీ మేకర్స్.  సాంకేతికంగా ఈ సినిమా భారతీయ సినిమా చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించబోతుందని అంటున్నారు.  అల్లు అర్జున్ ఈ సినిమాలో ఏకంగా మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం అల్లు అర్జున్ తన ఇతర కమిట్ మెంట్స్ కూడా పెట్టుకోకుండా పూర్తిగా దీనిపైనే దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కథ రెండు వేర్వేరు ప్రపంచాల మధ్య సాగుతుందని, ఒక ఆల్టర్నేట్ యూనివర్స్ 'అవతార్' చిత్రం స్థాయిలో ఉంటుందని టాక్ వినిపిస్తోంది.

ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన దీపికా పదుకొణెతో పాటు, జాన్వీకపూర్, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్ వంటి ప్రముఖ హీరోయిన్స్ కూడా కీలకపాత్రలో నటిస్తున్నారు.  ఈ చిత్రం షూటింగ్ సెప్టెంబర్ 2026 వరకు కొనసాగి, 2027లో విడుదల చేసేందుకు మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు.   ఈ భారీ ప్రాజెక్ట్ ఇండియన్ సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని సినిమా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా విడుదల కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.