అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మకు ఈసీ షోకాజ్ నోటీసు

అస్సాం సీఎం  హిమంత బిస్వా శర్మకు ఈసీ షోకాజ్ నోటీసు

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా మతపరమైన వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మకు కేంద్ర  ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసింది.  2023 అక్టోబర్ 30 సాయంత్రం 5 గంటలలోపు నోటీసుపై సమాధానం ఇవ్వాలని శర్మను కమిషన్ కోరింది.  హిమంత బిస్వా శర్మపై అధికార కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.   

 ఈనెల 18వ తేదీన  ఛత్తీస్‌గఢ్‌లోని కవార్ధాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న హిమాంత శర్మ మాట్లాడుతూ..‘ఒక చోటికి ఒక అక్బర్‌ వచ్చాడంటే అతడు మరో 100 మంది అక్బర్‌లను పిలుస్తాడు. అందుకే సాధ్యమైనంత త్వరగా అక్బర్‌ను పంపించివేయాలి. అలా చేయలేకపోతే కౌశల్య మాత పుట్టిన ఈ నేల అపవిత్రమవుతుంది. రాముని తల్లి కౌశల్య ఆధునిక ఛత్తీస్‌గఢ్‌కు చెందినదని నమ్ముతారు. అందుకే సోదర సోదరీమణులారా  మీరు ఛత్తీస్‌గఢ్‌ను రక్షించాలి.  అందువల్ల మీరందరూ విజయ్ భయ్యాను గెలిపించాలి’ అంటూ కామెంట్స్ చేశారు. 

Also Read :- రాజస్థాన్​లో ఈడీ సోదాలు

దీంతో రాష్ట్ర కేబినెట్‌లోని ఏకైక ముస్లిం మంత్రి మహ్మద్‌ అక్బర్‌ను ఉద్దేశించి హిమంత్ శర్మ ఈ కామెంట్స్ చేశారని ఆరోపిస్తూ  కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ  ఈసీ హిమంత్ శర్మకు షోకాజ్ నోటీసు జారీ చేసింది.   కాగా  ఛత్తీస్‌గఢ్‌లో త్వరలో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.  ఛత్తీస్‌గఢ్‌లోని 20 స్థానాలకు తొలి దశ పోలింగ్ 2023 నవంబర్ 7 న జరగనుంది. మిగిలిన 70 స్థానాలకు నవంబర్ 17న ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది.