
ఎన్నికల కమిషన్ సహకారంతోనే ఓట్ల చోరీ జరుగుతోంది.. మొన్న మధ్యప్రదేశ్ లో జరిగింది.. నిన్న మహారాష్ర్టలో జరిగింది.. రేపు బీహార్ లో కూడా ఓట్ల దొంగతనం జరగబోతోంది. నా దగ్గర 100 శాతం ఆధారాలున్నాయి.. ఇవి.. లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎన్నికల కమిషన్ పై వరుసగా చేస్తూ వస్తున్న తీవ్ర ఆరోపణలు. రాహుల్ గాంధీ ఆరోపణలపై శుక్రవారం (ఆగస్టు 01) ఎన్నికల కమిషన్ స్పందించింది. ఓట్ల గోల్ మాల్ పై అలాంటి ఆరోపణలు చేయవద్దని రాహుల్ కు సూచించింది.
రాహుల్ వ్యాఖ్యలపై సీరియస్ గా స్పందించింది ఈసీ. అలాంటి బేస్ లెస్ ఆరోపణలు చేయవద్దని, బాధ్యతారహితమైన స్టేట్ మెంట్స్ ఇవ్వద్దని సూచించింది. ఆధారాలు లేకుండా ప్రతిరోజు ఈసీని బెదిరించడం, ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించింది ఎన్నికల కమిషన్.
నిరాధార ఆరోపణలను ఎన్నికల కమిషన్ పట్టించుకోదు. రోజూ ఈసీని బెదిరించే ధోరణిలో స్టేట్ మెంట్స్ ఇస్తే అధికారులు, కమిషన్ పట్టించుకోదు. అధికారులు అలాంటి నిరాధార ఆరోపణలు పట్టించుకోకుండా మరింత కచ్చితత్వంతో, పారదర్శకంగా పనిచేస్తారు తప్ప ఇలాంటి వ్యాఖ్యలకు బెదిరిపోరు అని స్టేట్ మెంట్ ఇచ్చింది. ప్రజాస్వామిక విలువలు కాపాడేందుకు.. స్వేచ్ఛాయుత, పారదర్శకతతో ఎన్నికలు జరిగేలా అనునిత్యం కృషి చేస్తుందని ప్రకటనలో పేర్కొంది.
సంచలనంగా మారిన రాహుల్ వ్యాఖ్యలు:
పార్లమెంటు ఆవరణలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇన్నాళ్లుగా ఓట్ల గోల్ మాల్ జరుగుతుందని.. వేల, లక్షల సంఖ్యలో ఓట్లను తీసేయడం, ఫేక్ ఓటర్లను చేర్చడం జరుగుతోందని ఆరోపిస్తూ వస్తున్న రాహుల్.. ఈసారి ఏకంగా బాంబు పేల్చారు. దేశంలో ఓట్ల చోరీ జరుగుతోందని.. బీజేపీ కోసమే ఎన్నికల సంఘం ఓట్ల గోల్ మాల్ కు పాల్పడుతుందని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
►ALSO READ | రూ.30 రూపాయల కింగ్ ఫిషర్ బీరుపై ఇంత ట్యాక్స్ వేస్తున్నారా..
ఓట్ల చోరీకి సంబంధించి తన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని.. ఎన్నికల కమిషన్ సపోర్ట్ తో ఇది జరుగుతోందని ఆరోపించారు. ఇటీవలే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పేరున బీహార్ లో రికార్డులో లేని ఓట్ల తొలగింపు ప్రక్రియను చేపట్టింది ఈసీ. బీజేపీని గెలిపించేందుకే SIR పేరున ఓట్ల చోరీ కార్యక్రమానికి ఈసీ పూనుకుందని ఆరోపించారు రాహుల్. 2023 మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో, ఆ తర్వాత లోక్ సభ ఎన్నికల్లో.. ఆ తర్వాత మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈ గోల్ మాల్ వల్ల బీజేపీ లబ్ది పొందిందని.. ఇప్పుడు బీహార్ లో కూడా అలాంటి మోసానికి తెరతీశారని.. తమ పార్టీకి ఈ అంశంలో అనుమానాలనున్నాయని అన్నారు.
ఓట్ల గోల్ మాల్ భారీగా జరుగుతోంది. బీహార్ లో బీజేపీ కూటమి కోసం ఎన్నికల కమిషన్ ప్రక్రియ మొదలు పెట్టింది. నేనేదో ఊహాత్మకంగా చెప్పడం లేదు. నా దగ్గర 100 శాతం ఆధారాలున్నాయి. త్వరలో ప్రూఫ్స్ రిలీజ్ చేస్తే.. ఎన్నికల కమిషన్ బీజేపీ కోసం ఓట్ల చోరీకి పాల్పడుతుందనే నిజాన్ని దేశం అంతా తెలుసుకుంటుందని సంచలన ఆరోపణలు చేశారు రాహుల్.