తెలంగాణకు ఈసీ టీమ్..మూడు రోజుల పర్యటన

తెలంగాణకు ఈసీ టీమ్..మూడు రోజుల పర్యటన
  • నేటి నుంచి మూడు రోజులపాటు పర్యటన 
  • గుర్తింపు పొందిన పార్టీలు, ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ ఏజెన్సీలతో నేడు భేటీ
  • బోగస్ ఓట్లపై బీజేపీ, కాంగ్రెస్..‘కారు’ను పోలిన గుర్తులపై ఫిర్యాదు చేయనున్న బీఆర్‌‌‌‌ఎస్‌‌!

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లు, సంసిద్ధతను రివ్యూ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బృందం మంగళవారం రాష్ట్రానికి రానుంది. మూడు రోజుల పాటు హైదరాబాద్‌‌లో పర్యటించనుంది. జాతీయ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన 10 రాజకీయ పార్టీలతో మొదటి రోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం నలుగున్నర దాకా సమావేశం కానుంది. ఈసీ బృందం సమావేశం కానున్న పార్టీల జాబితాలో బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, టీఎంసీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, బీఆర్ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ ప్రధానంగా డబుల్ ఓట్లు, బోగస్ ఓట్లపైనే కంప్లయింట్ చేయనున్నాయి. 

డబ్బు, మద్యం పంపిణీతో పాటు నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీ చేసే ప్రభుత్వ కార్యకలాపాలపై చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు తెలిసింది. బీఆర్ఎస్ పార్టీ మాత్రం కారు గుర్తును పోలి ఉన్న ఇతర గుర్తులను ఏ పార్టీకి కేటాయించకూడదని, ఇప్పటికే కేటాయించి ఉంటే వాటిని తీసేయాలని కోర నుంది. పార్టీలతో భేటీ తర్వాత గంటన్నర సేపు వివిధ ఎన్​ఫోర్స్​మెంట్ విభాగాల అధికారులతో భేటీ అవుతుంది. ఎక్సైజ్, ఆదాయపన్ను, జీఎస్టీ, రవాణా, తదితర నిఘా విభాగాల అధికారులు, బ్యాంకర్లతో సమావేశమై దిశానిర్దేశం చేయనుంది. ఇక సాయంత్రం సీఈఓ వికాస్​రాజ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. 

రేపు ఓటరు చైతన్య కార్యక్రమం

బుధవారం ఉదయం 6.30 గంటలకు కేబుల్ బ్రిడ్జిపై నిర్వహించే ఓటరు చైతన్య కార్యక్రమంలో ఈసీ బృందం పాల్గొంటుంది. తర్వాత ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 7 దాకా అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలతో ఎన్నికల నిర్వహణపై చర్చించనుంది. ప్రతి జిల్లా ఎన్నికల అధికారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. మూడో రోజైన గురువారం సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై.. ఎన్నికల ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల టీమ్ సమీక్షించనుంది. ప్రముఖులు, దివ్యాంగ ఓటర్లు, యువ ఓటర్లతోనూ కేంద్ర ఎన్నికల సంఘం బృందం సమావేశమవుతుంది. మధ్నాహ్నం ఈసీ బృందం మీడియా సమావేశం నిర్వహించనుంది.