ఒలింపిక్స్​ హెడ్‌క్వార్టర్స్‌: పాత వస్తువులతో కొత్త బిల్డింగ్​

ఒలింపిక్స్​ హెడ్‌క్వార్టర్స్‌: పాత వస్తువులతో కొత్త బిల్డింగ్​

స్విట్జర్లాండ్​లో కొత్తగా ఒలింపిక్స్​ హెడ్‌క్వార్టర్స్‌

ఇది ఒలింపిక్​ కమిటీ కొత్త హెడ్​క్వార్టర్​. ‘ఒలింపిక్స్​’నే స్ఫూర్తిగా తీసుకుని కట్టిన బిల్డింగ్​ ఇది. పర్యావరణానికి మేలు చేసేలా కట్టించారు. పాత బిల్డింగులను కూల్చి, వాటి వ్యర్థాలను రీసైకిల్​ చేసి ఇలా కొత్త రూపమిచ్చారు. 95 శాతం మెటీరియల్స్​ పాత బిల్డింగులవే. వాటిలో కొన్నింటిని యథాతధంగా వాడారు. మిగతా వాటిని రీసైకిల్‌​ చేశారు. బిల్డింగ్​లో ఏది చూసినా స్పెషలే. వర్షపు నీటిని బొట్టుబొట్టు ఆదా చేస్తూ అక్కడ మొక్కలు చెట్ల కోసం వాడేలా ఏర్పాట్లు చేశారు. అంతేకాదు, టాయిలెట్లకూ ఆ వర్షపు నీటినే వాడుకునే వెసులుబాట్లు కల్పించనున్నారు. కరెంట్​ అవసరాలు తీర్చేందుకు బిల్డింగ్​ పైకప్పుపై సోలార్​ పానెళ్లు బిగించారు. రోజూ 60 ఇళ్లకు సరిపోయేంత కరెంట్​ను అవి ఉత్పత్తి చేస్తాయని అధికారులు చెబుతున్నారు.

సూర్యుడి నుంచి  కాంతి సహజంగా వచ్చేలా, దాని వేడి ఎక్కువగా పడకుండా దానిని నిర్మించారు. కాబట్టి పొద్దంతా సూర్యుడి వెలుగే బిల్డింగ్​కు అందుతుంది. గాలి వచ్చేలా వెంటిలేషన్​ను ఏర్పాటు చేశారు. 27 వేల చదరపుటడుగుల విస్తీర్ణంలో పచ్చదనం ఉండేలా చెట్లు పెంచారు. లోపలి మెట్లను ఒలింపిక్​ రింగుల్లా కట్టి మరో విశిష్టతను చాటారు. 2016 మేలో మొదలైన బిల్డింగ్​ ఇప్పుడు పూర్తయింది. దానికి సుమారు ₹1020 కోట్లు (14.7 కోట్ల డాలర్లు) ఖర్చు పెట్టారు. స్విట్జర్లాండ్​లోని లౌసానీలో ఉందీ ఒలింపిక్స్​ హెడ్​క్వార్టర్స్​. డెన్మార్క్​కు చెందిన 3ఎక్స్​ఎన్​, స్విట్జర్లాండ్​కు చెందిన ఇటెన్​ బ్రెచ్​బూల్​ కంపెనీలు దీనిని నిర్మించాయి. 2018లో ఆమ్​స్టర్​డాంలో నిర్వహించిన వరల్డ్​ ఆర్కిటెక్చర్​ ఫెస్టివల్​లో ‘ఆఫీస్​ ఆఫ్​ ద ఫ్యూచర్​’ అవార్డు అందుకుందీ బిల్డింగ్​.