
- కుడా ఆధ్వర్యంలో పనులు చేపట్టేందుకు ఆఫీసర్ల ప్రతిపాదనలు
- దేవునూరు, ముప్పారం ఫారెస్ట్ భూములపై తెగని పంచాయితీ
- అటవీ, రెవెన్యూ ఆఫీసర్ల మధ్య
- కో ఆర్డినేషన్ లేకపోవడంతో ఇబ్బందులు
- సమస్యను ప్రభుత్వం త్వరగా పరిష్కరిస్తే ఎకో టూరిజం పార్క్ ఏర్పాటు
హనుమకొండ, ధర్మసాగర్, వెలుగు: హనుమకొండ జిల్లాలో అటవీ సంపదకు నిలయమైన ఇనుపరాతి గుట్ట ఎకో టూరిజం పార్కు ఏర్పాటుకు అడ్డంకులు తొలగడం లేదు. ఇందుకు ధర్మసాగర్మండలం దేవునూరు, వేలేరు మండలం ముప్పారం శివారులోని అటవీ, పట్టా భూముల వివాదం సమస్యగా మారింది. కొద్దిరోజుల కింద ఫారెస్ట్, పట్టా భూముల సర్వే చేశారు. రెండు డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయం రాలేదు.
దీంతో ఎకో టూరిజం పార్కు పనులు ముందుకు కదలడం లేదు. ప్రభుత్వం చొరవ చూపితేనే ముందుకు అడుగులు పడతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ధర్మసాగర్, వేలేరు, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల్లో ఇనుపరాతి గుట్ట విస్తరించి ఉంది. జిల్లాలో ఏకైక అటవీప్రాంతం కూడా ఇదే. దాదాపు 3,956 ఎకరాల్లో గుట్ట ఉండగా.. ధర్మసాగర్ మండలం దేవునూరు, వేలేరు మండలం ముప్పారం శివారులోని ఫారెస్ట్, పట్టా భూముల మధ్య వివాదం నడుస్తోంది. దీంతో పట్టాదారులు వాటిని దున్నుకునే ప్రయత్నిస్తుండగా.. ఫారెస్ట్ ల్యాండ్ అంటూ అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారు. ఫారెస్ట్, పట్టా భూముల మధ్య సరైన హద్దులు లేక కొన్నేళ్లుగా పంచాయితీ కొనసాగుతోంది.
సర్వే చేసినా ఫలితం లేదు
కలెక్టర్ ప్రావీణ్య ఆదేశాల మేరకు గతేడాది నవంబర్‌లో ఫారెస్ట్, రెవెన్యూ ఆఫీసర్లు జాయింట్ సర్వే చేశారు. దేవునూరు, ముప్పారం శివారులో వివాదాలకు కారణంగా ఉన్న భూములకు హద్దులు నిర్ణయించే పని చేపట్టారు. ముప్పారం శివారు 213, 214, 215, 216 సర్వే నంబర్లు దేవునూరు శివారు 403, 404 సర్వే నంబర్లలోని 43.38 ఎకరాలు పట్టాదారులకు చెందినవి రెవెన్యూ అధికారులు ప్రకటించారు.
ఆ భూములను అటవీశాఖ పట్టాదారులకు అప్పగించాల్సిందిగా కలెక్టర్‌కూడా ఆదేశాలు జారీ చేశారు. కానీ అటవీశాఖ మాత్రం తమవేనంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో అటవీ భూములను పొలిటికల్లీడర్లు, ఆఫీసర్లు కలిసి అన్యాక్రాంతం చేశారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, బీఆర్ఎస్ నేతలు తాటికొండ రాజయ్య, పల్లా రాజేశ్వర్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం కూడా నడిచింది.
ఇదిలా ఉంటే కలెక్టర్ ఆర్డర్స్తర్వాత పట్టాదారులు ఆ స్థలాన్ని చదును చేసుకునేందుకు ప్రయత్నించగా అటవీ అధికారులు అడ్డుకున్నారు.ఈ విషయాన్ని స్టేట్ ఫారెస్ట్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇంతవరకు ఆ వివాదం కొలిక్కిరాలేదు. రెండు శాఖల మధ్య పంచాయితీకి ఫుల్ స్టాప్ పడలేదు. మరోవైపు రెండు శాఖల మధ్య ఆఫీసర్లకు కో ఆర్డినేషన్ లేకపోవడమేనని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఎకో టూరిజం పార్కుకు అడ్డంకులు
ఇనుప రాతి గుట్ట దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో వివిధ పశు, పక్షి జాతులు ఉన్నాయి. ఎన్నో రకాల విలువైన ఔషధ మూలికలు, ఖనిజ నిక్షేపాలు, జలధారలకు నిలయంగా ఉంది. ఎప్పటినుంచో గుట్టను టూరిజం స్పాట్‌గా డెవలప్చేయాలనే డిమాండ్ఉంది. గత కలెక్టర్ ఆమ్రపాలి, ఆఫీసర్లు ఆ గుట్టల్లో ట్రెక్కింగ్ నిర్వహించారు. టూరిస్ట్‌స్పాట్‌గా చేస్తామని, నైట్‌హాల్ట్‌కు కూడా అనుకూలంగా మారుస్తామని హామీ ఇచ్చారు. ఆ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితం అయ్యాయి. కాంగ్రెస్అధికారంలోకి వచ్చిన తర్వాత ఎకో టూరిజం పార్కుగా డెవలప్ చేసేందుకు ఆఫీసర్లు మరోసారి కసరత్తు చేశారు.
కుడా, టూరిజం శాఖ ఆధ్వర్యంలో పనులు చేపట్టేందుకు అధికారులు రివ్యూలు కూడా చేశారు. ధర్మసాగర్ రిజర్వాయర్వద్ద రోప్‌వే, ఇనుపరాతి గుట్టలపైకి ట్రెక్కింగ్, వాటర్ స్పోర్ట్స్, నైట్హాల్ట్షెడ్డులు, హాట్బెలూన్స్, పిల్లలకు సంబంధించిన ప్లే జోన్స్, బర్డ్స్ జోన్స్‌తో పాటు ధాన్య మందిరం, మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రతిపాదించారు. కానీ భూ వివాదం తెగకపోవడంతో ఎకో టూరిజం పార్కు ఏర్పాటు పనులు ముందుకు పడని పరిస్థితి నెలకొంది. ఇకనైనా ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు చొరవచూపి, ఇనుపరాతి గుట్టల్లో భూ వివాదాలకు చెక్ పెట్టడంతో పాటు ఎకో టూరిజం పార్కు ఏర్పాటుకు చర్యలు త్వరగా తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.