మిర్చి పంటకు మందు లేని తెగులు

మిర్చి పంటకు మందు లేని తెగులు
  • తామర తెగులుతో 2 లక్షల ఎకరాల్లో పంట నష్టం
  • ఇప్పటికే 12 మంది దాకా సూసైడ్‌‌‌‌
  • పురుగుకు మందు లేదంటున్న సైంటిస్టులు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: మిర్చి రైతులు అప్పులపాలై నట్టేట మునిగారు. అకాల వర్షాలకు తోడు కొత్త తెగుళ్లు సోకడంతో రూ.లక్షలు నష్టపోయారు. రావాల్సిన దిగుబడిలో పావు వంతు కూడా వచ్చే పరిస్థితి కనిపించక, తెగుళ్లకు మందులు లేక పంటలను పీకేస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 2 లక్షలకు పైగా ఎకరాల్లో పంట పూర్తిగా దెబ్బతింది. చేతికి వచ్చిన పంట దిగుబడి రాకపోవడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలనే మనోవేదనతో 12 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వమే తమకు సాయం చేయాలని కోరుతున్నారు. అంతుబట్టని వైరస్‌‌‌‌లతో మిరప తోటలు దెబ్బతినడంతో ఇటీవల ఢిల్లీ, బెంగళూరుకు చెందిన సైంటిస్టుల బృందం రాష్ట్రంలో పర్యటించింది. మహబూబాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో తామర పురుగు తీవ్రతను గుర్తించింది. ఈ వైరస్‌‌‌‌పై పరిశోధనలు జరుగుతున్నాయని, ఇప్పటి వరకు మందు కనుక్కోలేదని తేల్చారు. తెగుళ్లు సోకిన పంటలను పీకేయడం తప్ప ఇంకో మార్గం లేదని రైతులకు సైంటిస్టులు సూచించారు. దీంతో మిర్చి పంటను దున్ని మరో పంట వేస్తున్నారు. కాత, పూత దశలో మిర్చి పంటను నాశనం చేస్తున్న తామర పురుగును గత ఏడాదే గుర్తించినట్లు ఢిల్లీ సైంటిస్టుల బృందం తెలిపింది.

నిరుడు మిర్చి మంచి లాభాలు ఇవ్వడంతో.. ఈయేడు రైతులు ఆ పంటవైపు మొగ్గారు. గతేడాది రాష్ట్రంలో 2.40 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు చేయగా.. ఈ సారి 3,58,558 ఎకరాల్లో వేశారు. మహబూబాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో 2.82 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నట్లు హార్టికల్చర్‌‌ అధికారులు చెబుతున్నారు. అత్యధికంగా ఖమ్మంలో 1,02, 853 ఎకరాలు సాగు చేయగా, మహబూబాబాద్‌‌లో 82,482 ఎకరాలు వేశారు. 3.58 లక్షల ఎకరాల్లో 50 శాతం పంటకు నల్లనల్లి, తామర, వేరు కుళ్లు, జెమిని (గుబ్బ తెగులు) వంటివి సోకాయి. దాదాపు 2 లక్షల ఎకరాలపై ఈ ఎఫెక్ట్ పడింది. ఎకరాకు 35 క్వింటాళ్ల మేర దిగుబడి రావాల్సి ఉండగా.. ఐదు క్వింటాళ్లు కూడా రాని పరిస్థితి. ఎకరానికి రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల మేర పెట్టుబడి పెట్టగా.. ఈసారి రూ.70 వేల నుంచి రూ.లక్ష దాకా రైతులకు నష్టం వాటిల్లిందని అంచనాలు ఉన్నాయి. పంటను కాపాడుకునేందుకు విపరీతంగా పురుగుల మందులు వాడారు. దీంతో రైతులు మరింత అప్పుల పాలయ్యారు.

రసం పీల్చేస్తున్న పురుగులు

నల్లనల్లి, తామర సోకి పంటలన్నీ దెబ్బతింటున్నాయి. మిరప చేను ఎరుపు, పసుపు రంగుకు మారి ఎండిపోతున్నది. నల్లుల్లా, పేలల్లా ఉండే పురుగులు పూత, కాత దశలో పువ్వుల్లోని రసం పీల్చేస్తున్నాయి. పిందె ఎదగడం లేదు. దీంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే ఉన్న అప్పులకు కొత్త అప్పులు తోడవడంతో తీవ్ర మనోవేదనకు గురై తనువులు చాలిస్తున్నారు. ఇలా ఉమ్మడి వరంగల్‌‌, ఖమ్మం జిల్లాల్లో 12 మంది సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం.

మందులు కొట్టి కొట్టి యాష్టకొచ్చింది..

రెండు ఎకారాల్లో మిర్చి వేసిన. ఎకరానికి రూ.లక్ష పెట్టుబడి పెట్టిన. నల్లనల్లి, తామర పురుగు దాడితో పంట దెబ్బతిన్నది. 20 సార్లు మందులు కొట్టినం. కానీ పురుగు పోతలే. మందులు కొట్టి కొట్టి యాష్టకు వచ్చింది. ఊర్లో చాలా మంది రైతులు మిరప పీకేసీ బొబ్బర, పెసర, జొన్న, మొక్కజొన్న వేస్తున్నరు.

- నరేశ్, శనగపురం, మహబూబాబాద్‌‌

50 వేల పరిహారమివ్వాలె

రాష్ట్రంలో తామర వైరస్‌‌ సోకి మిరప దెబ్బతిన్నది.  పెట్టుబడులు పెట్టి నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. ఎకరానికి రూ.50 వేల పరిహారం చెల్లించాలి. వరంగల్‌‌లోని రీజనల్‌‌ స్పైసెస్‌‌ బోర్డు స్పందించి పంట నష్టాన్ని అంచనా వేయాలి. జరిగిన నష్టానికి ప్రభుత్వానికి నివేదిక పంపి.. రైతులకు నష్ట పరిహారం అందేట్లు చూడాలి.

- మూడ్ శోభన్, రాష్ట్ర సహాయ కార్యదర్శి,  రైతు సంఘం