బెంగాల్ మంత్రి జ్యోతిప్రియో అరెస్ట్

బెంగాల్ మంత్రి జ్యోతిప్రియో అరెస్ట్

కోల్​కతా: ‘రేషన్ స్కామ్’ కేసులో బెంగాల్ అటవీశాఖ మంత్రి జ్యోతిప్రియో మల్లిక్‌ను ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన సివిల్​ సప్లై శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రేషన్ పంపిణీలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో మనీలాండరింగ్ యాక్ట్ కింద మల్లిక్​ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. గురువారం ఆయన ఇంట్లోనే దాదాపు 17 నుంచి 18 గంటల పాటు విచారించిన అధికారులు.. శుక్రవారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు. 

మధుమేహంతో సహా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మంత్రి మల్లిక్​ను ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించి, వైద్య పరీక్షలు చేయించారు. ఆపై ఆయనను కోర్టులో హాజరు పరిచి కస్టడీ కోరారు. రేషన్ స్కామ్​ విషయంలో పలు కీలక విషయాలపై మంత్రిని ప్రశ్నించాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. ఆయన నివాసంలో జరిపిన విచారణకు మంత్రి సహకరించలేదన్నారు. ఏ విషయం అడిగినా తన ఆరోగ్యం బాగాలేదని, సమాధానం చెప్పలేననే  అన్నారని ఈడీ అధికారులు వివరించారు. కాగా, మల్లిక్‌కు చెందిన కోల్‌కతాలోని రెండు ఫ్లాట్లలోనూ ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. మంత్రి మాజీ వ్యక్తిగత సహాయకుడి ఇంటితో పాటు మొత్తం 8 ఫ్లాట్లలో తనిఖీలు జరిపినట్లు ఈడీ వెల్లడించింది.

ఇదంతా బీజేపీ కుట్ర: మల్లిక్

తాను ఎలాంటి స్కామ్​కు పాల్పడలేదని, బీజేపీ తనపై కుట్ర చేస్తోందని మంత్రి మల్లిక్ ఆరోపించారు. టీఎంసీలోని మాజీ సహోద్యోగితో పాటు బీజేపీ లీడర్ సువేందు అధికారి కలిసి తనను స్కామ్​లో ఇరికించాలని చూస్తున్నారని మండిపడ్డారు. తనకు వ్యతిరేకంగా బీజేపీ గట్టి ప్లాన్ రెడీ చేసుకుందన్నారు.