- బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీల ఆస్తులు అటాచ్
- త్వరలో కోర్టులో పిటిషన్ వేయనున్న ఈడీ
- ఇల్లీగల్ యాప్స్ నుంచి వచ్చిన మనీ లెక్కలు బయటకు
- సంపాదించిన నగదు, ప్రాపర్టీల గుర్తింపు.. ఇప్పటికే 15 మంది విచారణ పూర్తి
హైదరాబాద్, వెలుగు: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇల్లీగల్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు, యూట్యూబర్ల ఆస్తులను జప్తు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు ఆర్థికనేరాల కేసులో అటాచ్‌మెంట్స్‌కు సంబంధించి నాంపల్లిలోని కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. యువతను ప్రలోభపెట్టే విధంగా బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన బాలీవుడ్, టాలీవుడ్ నటులు విజయ్‌దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాశ్‌రాజ్, మంచులక్ష్మి, నిధి అగర్వాల్, ప్రముఖ యాంకర్లు, యూట్యూబర్లు సహా మొత్తం 29 మందిపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. పంజాగుట్ట, మియాపూర్, సైబరాబాద్, సూర్యాపేట, విశాఖపట్నంలో లోన్ యాప్స్‌పై నమోదైన వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ.. ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్‌ఫర్మేషన్ రిపోర్ట్(ఈసీఐఆర్) రిజిస్టర్ చేసింది.
ప్రమోషన్స్‌తో వచ్చిన డబ్బుకు సంబంధించిన ఆధారాలతో..
ఏపీ, తెలంగాణలో జంగ్లీ రమ్మీ, ఏ23, జీత్‌విన్, పరిమ్యాచ్, లోటస్ 365 సహా ఇతర బెట్టింగ్ యాప్స్‌ను సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇందుకుగాను అగ్రిమెంట్లు చేసుకున్నారు. భారీ మొత్తంలో రెమ్యూనరేషన్, యాప్స్ రాబడిలో కమీషన్స్ తీసుకున్నారు. గేమింగ్ యాప్స్‌తోపాటు నిషేధిత బెట్టింగ్ యాప్స్‌ను కూడా ప్రమోట్ చేశారు. ఇలా విదేశాల నుంచి ఆపరేట్ చేస్తున్న యాప్స్ ద్వారా కొల్లగొట్టిన డబ్బును మనీలాండరింగ్ చేశారు. ఇలాంటి ఇల్లీగల్ యాప్స్ ద్వారా సమకూరిన డబ్బును ఈడీ అధికారులు క్రైమ్ మనీగా పరిగణిస్తుంటారు. ఆ డబ్బుతో కొనుగోలు చేసిన ప్రాపర్టీస్ సహా కంపెనీల్లో పెట్టుబడులుగా పెట్టిన ఆధారాలను కోర్టుకు అందించనున్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఆస్తుల అటాచ్‌మెంట్ చేసేందుకు ఈడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
15 మంది విచారణ కంప్లీట్..
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి లబ్ధిపొందిన మొత్తం లెక్క తేల్చేందుకు జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఈడీ విచారణ జరిపింది. రానా దగ్గుబాటి, ప్రకాశ్‌రాజ్, విజయ్ దేవరకొండ, మంచులక్ష్మి సహా యాప్స్ ప్రచారకర్తలుగా వ్యవహరించిన నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లను విచారించింది. ఇప్పటివరకూ 15 మంది విచారణ కంప్లీట్చేసింది. యాప్స్ కంపెనీలతో చేసుకున్న అగ్రిమెంట్లు, రెమ్యూనరేషన్, సెలబ్రెటీల అకౌంట్లలో డిపాజిట్ అయిన డబ్బుకు సంబంధించిన డాక్యుమెంట్లను ఈడీ అధికారులు పరిశీలించారు. బ్యాంక్ స్టేట్‌మెంట్ల ఆధారంగా వారి స్టేట్‌మెంట్లు రికార్డ్ చేశారు. యాప్స్ ప్రమోట్ చేయగా వచ్చిన డబ్బును ఎందుకు వినియోగించారనే వివరాలు సేకరించారు. ప్రాపర్టీస్ కొనుగోలు చేసి ఉంటే వాటి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అకౌంట్లలో డిపాజిట్ అయిన డబ్బుతోపాటు ఆయా కంపెనీల నుంచి సేకరించిన ట్రాన్సాక్షన్స్ ఆధారంగా రికార్డులు రూపొందించారు.
