ఆ డబ్బును ఎక్కడికి తరలించారు..? సాహితీ ఇన్ ఫ్రా ఎండీని ప్రశ్నించిన ఈడీ

ఆ డబ్బును ఎక్కడికి తరలించారు..? సాహితీ ఇన్ ఫ్రా ఎండీని ప్రశ్నించిన ఈడీ

హైదరాబాద్‌‌, వెలుగు : సాహితీ ఇన్‌‌ఫ్రా వెంచర్స్‌‌ ప్రీలాంచ్‌‌ స్కాంలో ఆ కంపెనీ ఎండీ లక్ష్మీనారాయణ ఈడీ కస్టడీ శుక్రవారంతో ముగిసింది. ఆయనను సోమవారం ఈడీ కస్టడీలోకి తీసుకున్నది. ఐదు రోజుల కస్టడీలో భాగంగా ఈడీ అధికారులు కీలక సమాచారం రాబట్టారు. రూ.2 వేల కోట్ల మేర జరిగిన ఈ భారీ కుంభకోణంలో కస్టమర్ల నుంచి సేకరించిన సొమ్మును ఏయే డొల్ల కంపెనీల్లోకి మళ్లించారు..? ఆ డబ్బును ఎక్కడికి తరలించారు..? అనే వివరాలతో స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు. ఇప్పటికే గుర్తించిన రూ.360 కోట్లు ఎక్కడికి తరలించారనే సమాచారం సేకరించినట్టు తెలిసింది. 

కుంభకోణంలో కుట్ర ఎవరిది..?

లక్ష్మీనారాయణ విచారణ సందర్భంగా సాహితీ ఇన్ ఫ్రాలో ఇంకా భాగస్వాములుగా ఉంటూ, కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన మరికొందరు డైరెక్టర్ల పాత్రకు సంబంధించి సైతం ఆధారాలు ఈలభించినట్టు తెలిసింది. సాహితీ ఇన్ ఫ్రా కంపెనీలో డైరెక్టర్లుగా లక్ష్మీనారాయణ  సోదరుడు హరిబాబు, గోలమారి ఆంథోనిరెడ్డి, అతడి కుమారుడు అక్షయ్ రెడ్డి, సతీశ్ చుక్కపల్లి, లక్ష్మీనారాయణ భార్య పార్వతి, లక్ష్మీనారాయణ కుమారుడు సాత్విక్, పూర్ణచందర్రావు ఉన్నారు. ఇందుకు అవసరమైన ప్రాథమిక సమాచారాన్ని లక్ష్మీనారాయణ నుంచి ఈడీ అధికారులు ఇప్పటికే సేకరించారని తెలిసింది.