- వివరాలివ్వాలని పశుసంవర్ధక శాఖ అధికారులకు లేఖ
- ఈ స్కీమ్‌లో రూ.700 కోట్ల కుంభకోణం జరిగినట్టు ఆరోపణలు
- ఇప్పటికే కొనసాగుతున్న ఏసీబీ దర్యాప్తు
హైదరాబాద్, వెలుగు: గొర్రెల అక్రమార్కుల చుట్టూ ఉచ్చు బిగుస్తున్నది. గొర్రెల స్కామ్ పై ఇప్పటికే ఏసీబీ విచారణ కొనసాగుతుండగా, ఇప్పుడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా ఎంటరైంది. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన గొర్రెల స్కీమ్ లో రూ.700 కోట్ల కుంభకోణం జరిగినట్టు ఆరోపణలు రావడంతో మనీలాండరింగ్ కోణంలో ఈడీ ఎంక్వైరీ మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్‌కు ఈడీ జోనల్ కార్యాలయం డైరెక్టర్ లేఖ రాశారు. జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, వారి చిరునామాలు, ఫోన్ నంబర్లు, బ్యాంకు అకౌంట్ల వివరాలు ఇవ్వాలని కోరారు. గొర్రెల కొనుగోళ్ల కోసం ఏయే జిల్లాల అధికారుల ఖాతాల్లో నిధులు జమ చేశారు? ఆయా బ్యాంక్ ఖాతాల సమాచారం, లబ్ధిదారులు తమ వాటాగా జమ చేసిన నిధులు ఏయే అకౌంట్లలో జమయ్యాయి? గొర్రెల రవాణా ఏజెన్సీల సమాచారం, వాటికి జరిగిన చెల్లింపుల వివరాలు, గొర్రెల కోసం కొనుగోలు చేసిన దాణా, దాన్ని ఏయే లబ్ధిదారులకు పంపించారు? దీని కోసం ఎవరికెన్ని నిధులిచ్చారు? తదితర అంశాలపై సమగ్ర వివరాలు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.
కాగా, ఈ స్కామ్ పై ఇప్పటికే ఏసీబీ దర్యాప్తు చేస్తున్నది. ఇప్పుడు ఈడీ కూడా ఎంట్రీ కావడం ఆసక్తికరంగా మారింది. దీంతో అప్పటి మంత్రి, ఆఫీసర్ల చుట్టూ ఉచ్చు బిగుస్తున్నదన్న చర్చ జరుగుతున్నది.
రూ.3,386 కోట్లు ఖర్చు..
2017లో గొర్రెల స్కీమ్ ప్రారంభమైంది. ఒక్కో యూనిట్కింద 20 గొర్రెలు, ఒక పొట్టెలును పంపిణీ చేశామని అప్పటి బీఆర్ఎస్ సర్కార్ తెలిపింది. మొదటి విడతలో మొత్తం 3.67 లక్షల యూనిట్లు పంపిణీ చేసినట్టు అధికారిక లెక్కల్లో చూపెట్టింది. అయితే అదంతా ఉత్తదేనని కాగ్రిపోర్ట్ లో తేలింది. గొర్రెల పంపిణీలో అక్రమాలు జరిగాయని, పెద్ద ఎత్తున రీసైక్లింగ్ దందా జరిగిందని వెల్లడైంది. నిధులు కూడా పక్కదారి పట్టినట్టు కాగ్ గుర్తించింది. ఈ స్కీమ్ కింద పోయినేడాది వరకు మొత్తం 4.25 లక్షల మందికి గొర్రెలు పంపిణీ చేశారు. ఇందుకోసం అప్పటి సర్కార్ రూ.3,386 కోట్లు ఖర్చు చేసింది. దీనికి లబ్ధిదారుల వాటా కూడా కలిపితే రూ.5 వేల కోట్లు అవుతుంది. ఇక రెండో విడతలో భాగంగా దాదాపు 85 వేల మంది డీడీలు కట్టినప్పటికీ వాళ్లకు గొర్రెలు పంపిణీ చేయలేదు.
ఇలా బయటవడ్డది..
పశుసంవర్ధక శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్లుగా పని చేస్తున్న రవికుమార్, ఆదిత్య కేశవ్‌సాయి, రంగారెడ్డి జిల్లాకు చెందిన మరో ఇద్దరు అధికారులు, కాంట్రాక్టర్లు, దళారులు పోయినేడాది ఆగస్టులో ఏపీలోని 18 మంది వద్ద 133 యూనిట్ల గొర్రెలను సేకరించారు. అయితే వాళ్ల ఖాతాలో జమ చేయాల్సిన రూ.2.08 కోట్లను బినామీ ఖాతాలకు దారి మళ్లించారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో ఈ ఏడాది జనవరిలో కేసు నమోదైంది. అదే సమయంలో పశుసంవర్ధక శాఖలో ఫైల్స్ మాయం కావడం చర్చనీయాంశమైంది. దీనిపై విచారణ చేపట్టిన ఏసీబీ.. అక్రమాలు జరిగినట్టు గుర్తించి పశుసంవర్ధక శాఖ సీఈవో రామ్‌చందర్ నాయక్, మాజీ ఓఎస్డీ కల్యాణ్ కుమార్‌ను అరెస్ట్ చేసింది. ఆ తర్వాత కోర్టు అనుమతితో వారిని కస్టడీలోకి తీసుకుని విచారించింది. ఈ క్రమంలోనే
గొర్రెల స్కీమ్‌లో వందల కోట్ల స్కామ్జరిగినట్టు గుర్తించింది.