మంచిరెడ్డి కిషన్‌‌రెడ్డిపై ప్రశ్నల వర్షం

మంచిరెడ్డి కిషన్‌‌రెడ్డిపై ప్రశ్నల వర్షం

హైదరాబాద్‌‌, వెలుగు : ఇబ్రహీంపట్నం టీఆర్‌‌‌‌ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌‌రెడ్డి విదేశాల్లో జరిపిన లావాదేవీలపై ఈడీ ఫోకస్ పెట్టింది. ఫారిన్‌‌ ఎక్స్‌‌చేంజ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ యాక్ట్‌‌(ఫెమా) రూల్స్ బ్రేక్ చేసినట్టు 2015లో నమోదైన కేసుల్లో వివరాలు రాబడుతున్నది. మంగళవారం ఆయన్ను సుమారు 9 గంటల పాటు విచారించింది. విదేశీ టూర్స్‌‌‌‌, పెట్టుబడులు, ఫారిన్ మనీ ట్రాన్సాక్షన్స్‌‌‌‌ గురించి ప్రశ్నించినట్లు తెలిసింది. బుధవారం మళ్లీ హాజరు కావాలంటూ ఆదేశించింది.

ఈ కేసులో 2018లో ఈడీ అధికారులు ఇచ్చిన నోటీసులకు మంచిరెడ్డి రిప్లై ఇచ్చారు. అయితే సమగ్ర సమాచారం ఇవ్వక పోవడంతో మంగళవారం విచారణకు హాజరు కావాలని ఈడీ మళ్లీ నోటీస్‌‌‌‌ ఇచ్చింది. దీంతో బషీర్‌‌‌‌‌‌‌‌బాగ్‌‌‌‌లోని ఈడీ ఆఫీసుకు ఉదయం 11 గంటల సమయంలో మంచిరెడ్డి కిషన్‌‌‌‌రెడ్డి వచ్చాడు. జాయింట్‌‌‌‌ డైరెక్టర్ ముందు విచారణకు హాజరయ్యాడు. ఈడీ అధికారులు పలు ప్రశ్నలు అడిగి స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌ రికార్డ్‌‌‌‌ చేశారు. ప్రతి స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌పై ఆయన సంతకాలు తీసుకున్నారు.

విదేశీ టూర్లలో జరిగిన లావాదేవీలేంటి ?

2014 ఆగస్టులో మంచిరెడ్డి కిషన్‌‌‌‌రెడ్డి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌‌‌‌లో పర్యటించారు. విదేశాలకు వెళ్లే ముందు ఫారెక్స్‌‌‌‌ కార్డ్‌‌‌‌ కూడా తీసుకెళ్లినట్లు సమాచారం. డబ్బులు అవసరం కావడంతో అమెరికాలోని తన బంధువుల నుంచి డాలర్స్ రూపంలో ట్రాన్స్‌‌‌‌ఫర్స్‌‌‌‌ చేయించుకున్నట్లు తెలిసింది. విదేశాల నుంచి జరిగిన ఈ లావాదేవీలు ఇండియాలోని మంచిరెడ్డి ఖాతాలకు లింక్ అయ్యాయి. వీటికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను ఈడీ గుర్తించింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో 2015లో కేసు నమోదైంది. దీనికి సంబంధించిన వ్యవహారాలపై వివరణ ఇవ్వాలని 2018లో మంచిరెడ్డికి నోటీసులు ఇచ్చింది. దానికి ఆయన ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో ఇటీవల మళ్లీ నోటీసులు జారీ అయ్యాయి.

విచారణపై డౌట్లు?

విదేశాల్లో జరిగిన ఆర్థికలావాదేవీలపై ఆయన వివరణ సమగ్రంగా లేకపోవడంతో ఈడీ అనుమానాలు వ్యక్తం చేసింది. అనుమానాస్పదంగా ఉన్న బ్యాంక్ లావాదేవీల ఫారిన్ మనీ ఎక్స్చేంజ్‌‌‌‌పై పూర్తి వివరాలు అందించాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే మంచిరెడ్డి ఈడీ ముందు హాజరైనట్లు తెలిసింది. తన ఫారిన్ టూర్స్, ఫైనాన్సియల్ ట్రాన్సాక్షన్లకు సంబంధించిన డాక్యుమెంట్లను ఈడీ అధికారులకు అందించినట్లు సమాచారం. అయితే చీకోటి ప్రవీణ్‌‌‌‌ క్యాసినో వ్యవహారం, ఢిల్లీ లిక్కర్‌‌‌‌ స్కామ్‌‌‌‌ కేసు ఈడీ దర్యాప్తు చేస్తున్నపుడే  మంచిరెడ్డిని విచారణకు పిలువడం, రెండో రోజుకూడా హాజరు కావాలని ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది.