కేజ్రీవాల్ విచారణకు సహకరించడం లేదు..కోర్టుకు ఈడీ ఫిర్యాదు

కేజ్రీవాల్ విచారణకు సహకరించడం లేదు..కోర్టుకు ఈడీ ఫిర్యాదు

ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విచారణకు సహకరించడం లేదని మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోర్టును ఆశ్రయించింది. లిక్కర్ పాలసీ స్కామ్‌కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ కు పలుమార్లు సమన్లను పంపించినా.. ఆయన విచారణకు రావడంలేదని  ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుల అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఈడీ ఫిర్యాదు చేసింది. కేజ్రీవాల్ విచారణకు సహకరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరింది.  మార్చి 7వ తేదీ గురువారం ఈడీ ఫిర్యాదుపై కోర్టు విచారించనుంది.

లిక్కర్ పాలసీ కేసులో మొదటి మూడు నోటీసులకు కేజ్రీవాల్ రెస్పాండ్ కావడంలేదంటూ ఇప్పటికే ఈడీ కోర్టుకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ ఈడీ.. కేజ్రీవాల్ కు ఎనిమిదిసార్లు నోటీసులు ఇచ్చింది. అయితే, కేజ్రీవాల్ మాత్రం ఒక్కసారి కూడా ఈడీ విచారణకు హాజరుకాలేదు. దీంతో ఈడీ కోర్టును ఆశ్రయించింది. మరోవైపు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ఈడీని అడ్డంపెట్టుకుని రాజకీయ కక్ష్యసాధింపు  చర్యలకు పాల్పడుతుందని ఆప్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. విచారణ పేరుతో పిలిచి కేజ్రీవాల్ ను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.