మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ ఇంట్లో ఈడీ సోదాలు.. బీరువా తాళాలు పగలగొట్టి ఆఫీసర్ల తనిఖీలు

మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ ఇంట్లో ఈడీ సోదాలు.. బీరువా తాళాలు పగలగొట్టి ఆఫీసర్ల  తనిఖీలు
  • సీఎంఆర్ బియ్యం దారిమళ్లింపు కేసులోకి ఎంట్రీ
  • మనీలాండరింగ్ కోణంలో కొనసాగుతున్న దర్యాప్తు 
  • రూ.40.96 కోట్ల ధాన్యం ఎటుపోయిందని ఆరా
  • మూడు సీజన్లలో 9,640 టన్నుల ధాన్యం లెక్కతేలలే
  • రూ.12 కోట్ల ధాన్యానికి 22 కోట్ల పెనాల్టీ వేసిండ్రు: రేఖానాయక్

హైదరాబాద్/నిర్మల్, వెలుగు: ప్రభుత్వ కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) దారిమళ్లిన కేసుల్లో ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఇందులో భాగంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే,  అజ్మీరా రేఖానాయక్ ఇంటితో పాటు ఆమె కుటుంబానికి చెందిన సత్తెనపల్లిలోని ఏఆర్ఎస్ ఇండస్ట్రీస్ సహా మూడు చోట్ల శుక్రవారం ఏకకాలంలో సోదాలు చేసింది. సీఎంఆర్ ధాన్యం కేటాయింపుల్లో రూ.40.96 కోట్ల ధాన్యం దారిమళ్లిన వ్యవహారంలో ఖానాపూర్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తోంది. ఏఆర్ఎస్ ఇండస్ట్రీస్‌‌‌‌‌‌‌‌కు ప్రభుత్వ ధాన్యం కేటాయింపులు, సీఎంఆర్ సరఫరాలు, నిల్వల లెక్కల్లో తేడాలపై వివరాలు సేకరిస్తోంది. శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తనిఖీలు కొనసాగాయి.

బీరువా తాళాలు పగలగొట్టి..

రేఖానాయక్‌‌‌‌‌‌‌‌కు చెందిన రైస్ మిల్లుల లావాదేవీల రికార్డులతో పాటు ఆమె ఇంట్లోని బీరువాలో ఉన్న రికార్డులు, ఇతర వస్తువులను ఈడీ అధికారులు తనిఖీ చేశారు. బీరువా తాళాలు పగలగొట్టేందుకు బయటి నుంచి కట్టర్ తెప్పించారు. సీఎంఆర్ ధాన్యంపై రేఖానాయక్‌ను చాలాసేపు లోతుగా విచారించారు. ఏఆర్ఎస్ ఇండస్ట్రీస్ లావాదేవీలు, సీఎంఆర్ బియ్యం చెల్లింపుల వివరాలు సేకరించారు. సివిల్ సప్లయ్స్ అధికారులు గుర్తించిన రూ.40.96 కోట్లు ఎక్కడికి తరలించారనే కోణంలో ఆమెను ప్రశ్నించినట్లు తెలిసింది. రేఖానాయక్‌కు చెందిన రెండు రైస్ మిల్లుల్లో సీఎంఆర్ ధాన్యం భారీగా పక్కదారి పట్టిందనే ఆరోపణలపై ఇప్పటికే ఆమెపై, ఆమె మిల్లులపై కేసులు నమోదయ్యాయి.

9,640 టన్నుల ధాన్యం లెక్కతేలలే

సీఎంఆర్ ఒప్పందాల మేరకు ఏఆర్ఎస్ ఇండస్ట్రీస్‌కు 2022 నుంచి 2025 వరకు మూడు యాసంగి సీజన్లలో 16,666 మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయించారు. ఇందులో 9,639.962 మెట్రిక్ టన్నుల ధాన్యం లెక్కతేలకపోవడంతో అధికారులు గతంలో క్షేత్రస్థాయిలో తనిఖీలు చేశారు. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యం పూర్తిగా సరఫరా కాలేదని, దానికి సంబంధించిన ధాన్యం గానీ బియ్యం గానీ మిల్లులో, గోదాముల్లో లేదని గుర్తించారు. మూడు సీజన్లలోనూ భారీ వ్యత్యాసాలకు ఆధారాలు సేకరించి ఖానాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దారిమళ్లిన ధాన్యం విలువను కనీస మద్దతు ధర ప్రకారం రూ.40.96 కోట్లుగా అధికారులు నిర్ధారించారు.

రూ. 12 కోట్ల ధాన్యానికి 22 కోట్ల పెనాల్టీ వేసిండ్రు: రేఖానాయక్

సీఎంఆర్ గోల్‌మాల్‌లో రాష్ట్రంలోని 142 రైస్ మిల్లులపై కేసులు నమోదైనా ఈడీ తననే టార్గెట్ చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని రేఖానాయక్ ఆరోపించారు. సోదాల తర్వాత ఖానాపూర్‌లోని తన ఇంట్లో ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వానికి బాకీ ఉన్న ప్రతి రూపాయి చెల్లిస్తానని, న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని, ఈడీ సోదాలకు సహకరించానని చెప్పారు. వర్షాలకు రూ.12 కోట్ల విలువైన ధాన్యం దెబ్బతిని రెండు రైస్ మిల్లులు నష్టాల్లో ఉన్నాయని, తమ మిల్లులు బాధ్యత వహించాల్సింది రూ.12 కోట్లకే అయినా రూ.22 కోట్ల పెనాల్టీ వేశారని, ఈ వ్యవహారం కోర్టులో ఉందని తెలిపారు.
 
జగిత్యాల జిల్లా మొగిలిపేటలోనూ... 

మల్లాపూర్, వెలుగు: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేటలోని ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే అజ్మీర రేఖానాయక్ నివాసంపై శుక్రవారం ఈడీ అధికారులు రెయిడ్స్  నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ తన కుమారుడి పేరుపై బాయిల్డ్ రైస్ మిల్ ను అదే గ్రామంలో నిర్వహిస్తున్నారు. గత వరి ధాన్యం కేటాయింపు లు సీఎంఆర్ రైస్ విషయంలో సుమారు రూ,, 45కోట్లు అవకతవకలను  విజిలెన్స్ అధికారులు గుర్తించారు. దీనిపై సంబంధిత అధికారులు గత ఆగస్టు నెలలో ఫిర్యాదు చేయడంతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా మొగిలిపేట్ గ్రామంలో ఉన్న ఆమె రైస్ మిల్, ఇంటిపై ఈడీ అధికారులు దాడులు నిర్వహించగా వాటికి తాళాలు ఉండడంతో నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఉన్న మరో ఇంటికి వెళ్లారు. 

ఏఆర్ఎస్ ఇండస్ట్రీస్‌కు ధాన్యం కేటాయింపులు (మెట్రిక్ టన్నుల్లో)
 
యాసంగి సీజన్    కేటాయించిన ధాన్యం    ఇవ్వాల్సిన బియ్యం    ఇచ్చిన బియ్యం    లెక్కచూపని ధాన్యం
2022–23    6,821.640    4,638.715    831.071    5,482.960
2023–24    7,430.840    5,052.971    3,205.269    2,717.209
2024–25    2,413.640    1,641.275    343.200    469.117