రెండో రోజు.. రెండు గంటలు .. లిక్కర్​ పాలసీ కేసులో కవితను విచారించిన ఈడీ

రెండో రోజు.. రెండు గంటలు .. లిక్కర్​ పాలసీ కేసులో కవితను విచారించిన ఈడీ
  • పాలసీ రూపకల్పన, అమలులో ఆప్ నేతలతో సంబంధాలపై ఆరా

న్యూఢిల్లీ, వెలుగు : ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితురాలిగా ఉన్న కల్వకుంట్ల కవితను రెండో రోజు ఈడీ అధికారులు విచారించారు. మహిళా నిందితులను ఉదయం 10 గంటల తర్వాత, సాయంత్ర 5 గంటల లోపు విచారించాలని నిబంధనలు చెబుతుండగా.. ఉదయం ఒక గంట, మధ్యాహ్నం మరో గంటకు పైగా ఇంటరాగేషన్ చేశారు. కవిత కస్టడీలో ఉన్న గదికి సమీపంలో ఇన్వెస్టిగేషన్ రూం (ఐఆర్) ను ఏర్పాటు చేశారు. ఈ రూంలో కెమెరాలు పెట్టారు.

రౌస్ ఎవెన్యూ కోర్టు ఆదేశాల ప్రకారం.. కెమెరాలు ఉన్న ఈ ఐఆర్ లోనే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ (ఐఓ) జోగిందర్, అడిషనల్ డైరెక్టర్ భాను ప్రియ మీన కవితను విచారిస్తున్నారు. ఇందులో భాగంగా లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలు వంటి అంశాలపై ఆరా తీసినట్టు తెలిసింది. గతంలో సీబీఐ సీఆర్పీసీ 160 ప్రకారం.. సాక్షిగా మాత్రమే కవిత స్టేట్​మెంట్​ను సేకరించింది. అయితే ప్రస్తుతం ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ)– 2002, సెక్షన్ 3 ప్రకారం నిందితురాలని నిర్ధారించి, సెక్షన్ 19 ప్రకారం అదుపులోకి తీసుకున్న కవితను.. ప్రధానంగా ఆప్ నేతలతో ఆమెకున్న సంబంధాలపై ఈడీ ప్రశ్నలు వేసినట్టు సమాచారం.

‘లిక్కర్ పాలసీ రూపకల్పన వ్యవహారంలో ఎప్పుడైనా ఆప్ నేత కేజ్రీవాల్, మనీష్ సిసోడియాను కలిశారా? ఆప్ మాజీ కమ్యూనికేషన్ ఇన్​చార్జి విజయ్ నాయర్ తో మీకున్న సంబంధం ఏంటి?  సౌత్ గ్రూప్ లో మీకు భాగస్వామ్యం ఉందా? ’ అన్న కోణంలో విచారణ జరిపారు. పాలసీ రూపకల్పనలో కేజ్రీవాల్ ను కవిత కలిశారన్న మాగుంట శ్రీనివాసులు స్టేట్​మెంట్​పై కవిత వాంగూల్మం నమోదు చేశారు.

హవాలా రూపంలో రూ. 100 కోట్లు చేతులు మారాయన్న ఆధారాలపై ప్రశ్నించారు. ఇండో స్పిరిట్ కంపెనీలో కవిత తరపున భాగస్వామిగా వ్యవహరించానన్న అరుణ్ రామ చంద్ర పిళ్లై స్టేట్​మెంట్​ రికార్డులపై కవిత నుంచి సమాధానం కోరారు. సౌత్ గ్రూప్ లో వాటాలపై కవిత మాజీ ఆడిటర్​ బుచ్చిబాబు పేపర్ వర్స్క్ చేశారన్న అంశాలపై సమాచారం సేకరించారు.  తొలి రోజైన ఆదివారం మాత్రం కవితను మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు విచారించినట్టు తెలిసింది. 

లంచ్ టైంలో ఇడ్లీ తిన్న కవిత

కస్టడీలో ఉన్న కవితకు ఇష్టమైన భోజనాన్ని ఈడీ అధికారులు అందిస్తున్నారు. సోమవారం ఉదయం 11 గంటల తర్వాత విచారణ ప్రారంభం కాగా.. దాదాపు 45 నిమిషాల తర్వాత ఎంక్వైరీ ముగించారు. అనంతరం కవిత ఇడ్లీ కావాలని కోరగా... శరవణ భవన్ నుంచి తీసుకువచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అలాగే బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఆమె రుచికి తగ్గట్టుగా అందిస్తున్నారు. 

ఫ్రీ టైంలో బుక్స్​తో కవిత కుస్తీ 

విచారణ తర్వాత ఫ్రీ టైంలో కవిత బుక్స్ చదివేందుకు ప్రియార్టీ ఇస్తున్నారు. అంబేద్కర్ జీవిత గాథలోని ఒక అంశం, ఏఎస్ పన్నీర్ సెల్వం రాసిన ‘కరుణా నిధి ఏ లైఫ్’, శోభన కే నాయర్ రాసిన ‘రాం విలాస్ పాశ్వాన్ -ది వెదర్‌‌‌‌వేన్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్’ పుస్తకాలను అడిగి తెప్పించుకున్నారు. వీటితో పాటు కీలక అంశాలు నోట్ చేసుకునేందుకు ఒక డైరీ, బెడ్ షీట్, పిల్లోను కుటుంబ సభ్యులను కోరగా.. ఈడీ అనుమతి తో వాటిని ఏర్పాటు చేశారు. ఇక ఉదయాన్నే నిద్ర లేస్తున్న కవిత... ప్రశాంతంగా డేను స్టార్ట్ చేస్తున్నట్టు తెలిసింది.  ఆమె ఉన్న రూంకు ఉదయం 7:30 గంట లకు న్యూస్ పేపర్లు పంపిస్తున్నట్టు సమాచారం. పేపర్​ను పూర్తిగా చదివే అలవాటు ఉన్న కవిత.. వీటి కోసం దాదాపు గంటకుపైగా టైం కేటాయిస్తున్నట్టు తెలిసింది. అనంతరం అధికారుల పిలుపు మేరకు ఆమె విచారణకు హాజరవుతున్నారు. 

కవితను కలిసిన కేటీఆర్, హరీశ్​రావు

కస్టడీలో ఉన్నప్పటికీ తాను ధైర్యంగానే ఉన్నట్టు కేటీ ఆర్, హరీశ్​కు కవిత చెప్పారు. తన విషయంలో ఆందో ళన అవసరం లేదని తెలిపారు. అయితే న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలపై ఫోకస్ చేయాలని కుటుంబ సభ్యులను కోరినట్టు సమాచారం. రెండో రోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య కేటీఆర్, హరీశ్​రావు, అడ్వొకేట్​ మోహిత్ రావు కవితతో భేటీ అయ్యారు. ఆరోజు పరిణామాలు, ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. న్యాయపరంగా తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఇందులో భాగంగా సుప్రీంకోర్టులో వేసిన కంటెంట్ పిటిషన్ వివరాలను వెల్లడించినట్టు తెలిసింది. సెకండ్ డే కవిత భర్త అనిల్ వెళ్లలేదు.