
- ఓయూ నుంచి వన్నాడ విజయలక్ష్మి, కేయూ నుంచి బుర్రా రాకేశ్
- మిలియన్ మార్చ్ లో కీలకంగా వ్యవహరించిన విజయలక్ష్మి
- సోషల్ మీడియాలో తెలంగాణ ఉద్యమంనాటి ఫొటోలు వైరల్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రాంతంలో 1980, 90 దశకాల్లో యూనివర్సిటీలు, మెడికల్ కాలేజీలు, ఆర్ఈసీలను వదిలి సమసమాజ స్థాపన కోసమని విప్లవోద్యమంలోకి అడుగులేసిన ఉన్నత విద్యావంతుల తరమంతా క్రమక్రమంగా కనుమరుగవుతున్న కాలంలో.. గత పదేండ్లుగా మళ్లీ అవే విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల నుంచి కొత్తతరం చేరుతుండడం పోలీసు వర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లా అబుజ్ మాడ్ లో ఇటీవల జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో చనిపోయిన వాళ్లలో ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ, బీఈడీ చదివినవన్నాడ విజయలక్ష్మి, కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని సీకేఎం డిగ్రీ, పీజీ కాలేజీలో ఎంసీఏ చదివిన బుర్రా రాకేశ్ ఉండడం చర్చనీయాంశంగా మారింది.
ఒకవైపు తెలంగాణలో పది, పదిహేనేళ్లుగా మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు పెద్దగా లేకపోయినా.. ఇక్కడి నుంచి ఉన్నత విద్యావంతులైన యువత రిక్రూట్ అయినట్లు తెలుస్తోంది. తెలంగాణ నుంచి గడిచిన పదేళ్లలో శృతి, వివేక్, సాగర్, విజయలక్ష్మి, రాకేశ్(ఎన్ కౌంటర్లలో చనిపోయినవాళ్లు) సహా 36 మంది విద్యార్థి, యువత మావోయిస్టుల్లో చేరినట్లు ఇంటెలిజెన్స్ వర్గాల అంచనాగా ఉంది.
తెలంగాణ ఉద్యమంలో విజయలక్ష్మి మిలిటెన్సీ..
సీపీఐ(మావోయిస్టు) కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు ఎన్ కౌంటర్ లో చనిపోయిన వారిలో రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం వేములనర్వ గ్రామానికి చెందిన వన్నాడ విజయలక్ష్మి అలియాస్ భూమిక ఉన్నారు. గీత కార్మిక కుటుంబానికి చెందిన విజయలక్ష్మికి ఇద్దరు అక్కలు, ముగ్గురు చెల్లెళ్లు ఉన్నారు. ఆమె తండ్రి సాయిలు గౌడ్ గీత వృత్తి చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. విజయలక్ష్మి ఇంటర్ వరకు కేశంపేటలో, డిగ్రీ మహబూబ్ నగర్ లోని ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో పూర్తి చేసి ఉస్మానియా యూనివర్సిటీలో 2009 –11లో ఎంఏ(పొలిటికల్ సైన్స్) పూర్తి చేసింది. ఆ తర్వాత ఓయూలోనే ఉంటూ బీఈడీ పూర్తి చేసింది.
తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో ఓయూ విద్యార్థి జేఏసీలో కీలకంగా వ్యవహరించినట్లు నాటి ఓయూ జేఏసీ లీడర్లు తెలిపారు. మిలియన్ మార్చ్, సాగరహారం, ఇతర తెలంగాణ ఆందోళనల్లో చాలా మిలిటెన్సీగా వ్యవహరించేదని, అనేక సార్లు అరెస్టయిందని వారు గుర్తు చేసుకుంటున్నారు. ఉద్యమంలో తమతోపాటు విజయలక్ష్మి ఉన్న ఫొటోలను షేర్ చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014లో కనిపించకుండాపోయిందని చెప్తున్నారు.
కేయూ నుంచి బుర్రా రాకేశ్..
అబుజ్ మాడ్ ఎన్ కౌంటర్ మృతుల్లో ఎంసీఏ చదివిన బుర్రా రాకేశ్ అలియాస్ వివేక్ అలియాస్ యుగంధర్(30) కూడా ఉన్నాడు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం చింతగట్టు ఎస్సీ కాలనీకి చెందిన ఈయన కాకతీయ యూనివర్సిటీ అనుబంధ సీకేఎం డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో ఎంసీఏ చదివాడు. కాకతీయ యూనివర్సిటీ అనుబంధ సీకేఎం కాలేజీ 80, 90వ దశకాల్లో రాడికల్స్ కు కేంద్రంగా ఉండేది. ప్రముఖ విప్లవ కవి వరవరరావు అదే కాలేజీలో లెక్చరర్ గా పని చేసేవారు. గత రెండు దశాబ్దాలుగా ఈ కాలేజీలో వారి ఉనికి లేదు. కానీ, ఇదే కాలేజీలో రాకేశ్ ఎంసీఏ చదువుతూ 2016లో మావోయిస్టుల్లో చేరడం చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ వచ్చిన తొలినాళ్లలో 2015లో ఛత్తీస్ గఢ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో చనిపోయిన సూర్యాపేట యువకుడు, లా స్టూడెంట్ కొదమగుండ్ల వివేక్ పేరుతో రాకేశ్ పని చేస్తున్నట్లు తెలుస్తోంది. రాకేశ్ ఎంసీఏ చదివిన ఉన్నత విద్యావంతుడు కావడంతో అనతికాలంలోనే కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావుకు కంప్యూటర్ పనుల్లో సహకరించే బాధ్యతల్లోకి వెళ్లినట్లు సమాచారం.