మంత్రి సబితకు చేదు అనుభవం.. నిలదీసిన ఎన్టీఆర్ నగర్ మహిళలు

మంత్రి సబితకు చేదు అనుభవం.. నిలదీసిన ఎన్టీఆర్ నగర్ మహిళలు

సొంత నియోజకవర్గమైన మహేశ్వరంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఆర్కేపురం డివిజన్ ఎన్టీఆర్ నగర్ లో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ఓపెనింగ్స్ కు వెళ్లారు మంత్రి సబిత. ఈ సందర్భంగా సబితను కొందరు మహిళలు నిలదీశారు. అన్ని ఉన్నోళ్లకే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చి.. లేనివాళ్లను వదిలేస్తే ఎలా అని ప్రశ్నించారు. తమ కాలనీలో ఒకరోజు నీళ్లు వస్తే రెండు రోజులు బంద్​ అవుతాయని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

తాము ప్రతిరోజూ కూలిపనులు చేసుకునే నిరుపేదలమని, ఇండ్లు లేని తమకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించి.. ఇవ్వాలని కోరారు. అంతేకాదు.. అక్కడి సమస్యలపై మంత్రి సబితను నిలదీశారు. దళిత బంధు కూడా అర్హులకు ఇవ్వడం లేదని, ఈ విషయంలో తమకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఓట్ల కోసమే పనికొస్తామా..? అని ప్రశ్నించారు.

ఇదే సమయంలో తమ సమస్యలను మంత్రికి మహిళలు వివరిస్తుండగా విజువల్స్ ను తీయోద్దంటూ మీడియా ప్రతినిధులను మంత్రి సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు.