
ఇంట్లో అదే పనిగా ఫోన్ వాడే పిల్లల్ని తల్లిదండ్రులు తిడుతుంటారు. ఎక్కువగా ఫోన్ వాడటం ప్రమాదం. దాని వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్తుంటారు. ఈ విషయాన్ని నిజమని నిరూపించింది ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జాడ్విగా గిబుల్టోవిచ్. జాడ్విగా చేసిన స్టడీలో మొబైల్ ఫోన్, టీవీ, కంప్యూటర్, ట్యాబ్‌ల నుంచి వచ్చే బ్లూ లైట్‌తో ఆరోగ్యం దెబ్బతింటుందని తేలిపోయింది.
బ్లూ లైట్ ఎక్కువ పడటం వల్ల మెటబాలిజం దెబ్బతింటుంది. కణాల్లో మార్పు వస్తుంది. దాంతో ఎక్కువ వయసున్న వాళ్లలా కనిపిస్తారు. ఊబకాయం, మానసిక ఒత్తిడిలాంటి చాలారకాల జబ్బుల బారిన పడే అవకాశం కూడా ఉంటుందని ఈ స్టడీలో తేలింది. ఈ ప్రయోగాన్ని ఈగల మీద చేసింది జాడ్విగా.
ఈగల్ని ఒక కంటైనర్‌లో పెట్టి, బ్లూ లైట్ వాటిమీద పడేలా చేసింది. బ్లూ లైట్ పడ్డ కొన్ని రోజుల్లోనే ఈగల్లో మార్పు రావడాన్ని గమనించింది. చిన్న ఈగల పెరుగుదల ఆగిపోయింది. పెద్ద ఈగలు తొందరగా ముసలివై, చనిపోయాయి. అందుకే ఇకనుంచైనా పిల్లల్ని బ్లూలైట్‌కి దూరంగా ఉంచి, వాళ్ల భవిష్యత్తు కాపాడాలి అంటోంది జాడ్విగా.