ముంబై: గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ గురించి అమెరికా అలర్ట్ చేయడంతో అతన్ని ఇండియాకు రప్పించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ మేరకు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రాసెస్‌ను స్పీడప్ చేశారు. అన్మోల్ కదలికలపై ఎప్పటికప్పుడు అమెరికన్ ఆఫీసర్లు తమకు సమాచారం ఇస్తున్నారని ముంబై పోలీసు అధికారి ఒకరు శనివారం తెలిపారు.
ముంబైలోని బాంద్రాలో ఉన్న సల్మాన్ ఖాన్ ఇంటి బయట జరిగిన కాల్పుల ఘటన, మాజీ ఎమ్మెల్యే బాబా సిద్దిఖీ హత్యతో పాటు పలు హై ప్రొఫైల్ కేసుల్లో 25 ఏండ్ల అన్మోల్ బిష్ణోయ్ నిందితుడిగా ఉన్నాడు. అతన్ని తమకు అప్పగించాల్సిందిగా మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (ఎంసీవోసీఏ) స్పెషల్ కోర్టుకు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇప్పటికే విన్నవించారు.
అతన్ని అమెరికా నుంచి ఇండియాకు రప్పించే విషయమై.. కోర్టు ఇచ్చే డాక్యుమెంట్లు అధికారికంగా కేంద్ర హోంశాఖకు, ఆ తర్వాత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు వెళ్తాయి. కాగా, ఇప్పటికే అన్మోల్ బిష్ణోయ్‌పై స్పెషల్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్‌తో పాటు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది.
కాగా, అన్మోల్ బిష్ణోయ్ కెనడాలో ఉన్నట్లు తొలుత అనుమానించారు. తర్వాత అమెరికాలో ఉన్నట్లు స్పష్టమైంది. అన్మోల్ను పట్టిస్తే రూ.10 లక్షలు ఇస్తామని ఎన్ఐఏ రివార్డు కూడా ప్రకటించింది. ఏప్రిల్‌లో సల్మాన్ ఇంటి బయట జరిగిన కాల్పుల ఘటనతో అన్మోల్ను మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో చేర్చింది.
విక్కీ గుప్తా, సాగర్పాల్ కాల్పులు జరిపారు. వీరితో పాటు సోనుకుమార్ బిష్ణోయ్, మహమ్మద్ రఫీక్ చౌదరి, హర్పాల్సింగ్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. మరో నిందితుడు అనుజ్‌కుమార్ థాపన్ పోలీసు కస్టడీలో ఉన్నప్పుడే సూసైడ్ చేసుకున్నాడు. అన్మోల్ బిష్ణోయ్ సోదరుడు లారెన్స్ బిష్ణోయ్.. గుజరాత్‌లోని సబర్మతి జైల్లో ఉన్నాడు. కాగా, 2022లో ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా దారుణహత్యకు గురయ్యాడు. ఈ కేసులోనూ అన్మోల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతడిపై సుమారు 18 కేసులున్నాయి.