193 జాతీయ గీతాలతో అదరగొట్టిన అక్కాచెల్లెళ్లు

193 జాతీయ గీతాలతో అదరగొట్టిన అక్కాచెల్లెళ్లు

రెండు మూడు దేశాల జాతీయ గీతాలు పాడితేనే గొప్ప. అలాంటిది ఈ  అక్కాచెల్లెళ్లకి నూటతొంభై మూడు దేశాల జాతీయ గీతాలు వచ్చు. అలాగని వీళ్లు ఏదో సరదాకి అన్ని దేశాల జాతీయగీతాలు నేర్చుకోలేదు. ప్రపంచశాంతి కోరుకుంటూ ‘యునైటెడ్​ నేషన్స్​ పీస్​ డే’ (సెప్టెంబర్​ 21న)  నాడు ‘శాల్యూట్​ ది నేషన్స్​’ పేరుతో పాడడం కోసం. యునైటెడ్​ నేషన్స్ సహకారంతో థెరెసా జాయ్​, ఆగ్నస్​ జాయ్  చేయబోయే ఈ  ఫీట్​ ప్రపంచంలోనే మొదటిది. 
ఈ మలయాళీ సిస్టర్స్ గురించి....
ఆస్ట్రేలియా బ్రిస్బేన్​లో ఉన్న సెయింట్​ జాన్స్​ కెథడ్రల్​(చర్చ్​) లో ‘శాల్యూట్​ ది నేషన్స్’ కార్యక్రమం సెప్టెంబర్​ 21న మొదలవుతుంది. యునైటెడ్​ నేషన్స్​లోని 193దేశాల జాతీయ గీతాల్ని అక్కడ ఒకేసారి పాడతారు  థెరెసా, ఆగ్నస్​. ఈ కార్యక్రమానికి యూనివర్సల్​ రికార్డ్స్​ మెంబర్స్​ జడ్జిలుగా ఉంటారు.  
ఎనిమిదేళ్ల రీసెర్చ్​
 వివిధ దేశాల జాతీయ గీతాలు పాడాలి అనేది థెరెసా, ఆగ్నస్​కి ఇప్పటికిప్పుడు వచ్చిన ఆలోచన కాదు. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం ఈ ఐడియా వచ్చింది. ఆలోచన రాగానే  రీసెర్చ్​ చేశారు ఇద్దరు సిస్టర్స్. ఊరికే బట్టీపట్టి పాడడం కాకుండా పదాల అర్థం తెలుసుకోవాలి అనుకున్నారు. ‘‘ప్రతి దేశ జాతీయ గీతం అర్థం, వాటి చరిత్ర తెలుసుకున్నాం. అన్ని దేశాల జాతీయ గీతాల్ని వంద భాషల్లో, అది కూడా ఆరు గంటల్లోనే పాడగలం. రెండు గంటలకు ఒకసారి పది నిమిషాల బ్రేక్​ తీసుకుంటాం. వరల్డ్ రికార్డ్ సాధించాలన్నది మా లక్ష్యం కాదు. ప్రపంచశాంతి, పిల్లల భద్రత, మహిళల సత్తాని ప్రమోట్​ చేయడమే మా ఉద్దేశం. ‘శాల్యూట్​ ది నేషన్స్’ ద్వారా వచ్చిన డబ్బుని ఛారిటీ కార్యక్రమాలకి ఉపయోగిస్తాం.193 దేశాల జాతీయ గీతాల్ని  ఏ చిన్న తప్పు దొర్లకుండా పాడేందుకు ఎనిమిదేళ్లు కష్టపడ్డాం. రోజూ ఉదయాన్నే అయిదున్నరకి నిద్రలేచి, రెండు గంటలు జాతీయ గీతాలు పాడడం ప్రాక్టీస్​ చేసేవాళ్లం.  స్కూల్​ డేస్​ నుంచే యునైటెడ్​ నేషన్స్​ నిర్వహించే పలు కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసేవాళ్లం ”అని చెప్పారు  థెరెసా, ఆగ్నస్​. 
సొంతంగా ఫౌండేషన్​ 
కిందటేడాది యునైటెడ్​ నేషన్స్​ 75వ పుట్టినరోజు నాడు వివిధ దేశాల్లో ‘ప్రపంచ దేశాల జాతీయ గీతం’ పాడేందుకు థెరెసా, ఆగ్నస్​ సెలక్ట్ అయ్యారు. కానీ, కరోనా కారణంగా ఆ ప్రోగ్రాం రద్దయింది. కరోనా టైంలో అందరికీ మద్దతు తెలుపుతూ అన్ని దేశాల జాతీయగీతాలు పాడి సోషల్​ మీడియాలో అప్​లోడ్​ చేశారు. ‘ థెరెసా, ఆగ్నస్​ పీస్​ ఫౌండేషన్’​ కూడా నడుపుతున్నారు ఈ సిస్టర్స్. చదువుతో పాటు సేవాకార్యక్రమాల్ని కంటిన్యూ చేస్తున్నారు వీళ్లు. థెరెసా జాయ్​ ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్​ యూనివర్సిటీలో సైకాలజీ, క్రిమినాలజీ చదువుతోంది. ఆగ్నస్​ లెవన్త్​  గ్రేడ్ చదువుతోంది.