
హనుమకొండసిటీ, వెలుగు: ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు, సిబ్బందిని కాంట్రాక్టు చేయాలని ఏకలవ్య ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం హనుమకొండ పబ్లిక్ గార్డెన్ లో రాష్ట్రంలో ఏకలవ్య పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సిబ్బంది సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ ఎన్నో ఏండ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పిస్తూ 12 నెలల వేతనం అందించాలని, గతంలో చెల్లించిన విధంగానే నేషనల్ ఎడ్యుకేషన్ సోసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్ ప్రకారం జీతాలు చెల్లించాలని కోరారు.
రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ ఏకలవ్య పాఠశాలలో భర్తీ కోసం ప్రభుత్వం విడుదల చేసి ప్రకటనలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వెయిటేజ్ కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షఫీ మాట్లాడుతూ మహిళా టీచర్లు, సిబ్బందికి వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని కోరారు.