ఇంటి వద్దే ఓటేసిన వృద్ధులు, దివ్యాంగులు

ఇంటి వద్దే ఓటేసిన వృద్ధులు, దివ్యాంగులు

ఖానాపూర్, వెలుగు : ఎన్నికల సంఘం తొలిసారి కల్పించిన అవకాశంతో దివ్యాంగులు, 80 ఏండ్లకు పైబడిన వృద్ధులు అసెంబ్లీ ఎన్నికల ఓటును ఇంటి వద్ద నుంచే వినియోగించుకుంటున్నారు. ఖానాపూర్ పట్టణం మొఘల్ పురాకు చెందిన  ఖాజా బేగం(92) అనే వృద్ధురాలు ఎన్నికల అధికారుల సమక్షంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇంటి వద్దనే ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటు హక్కు వచ్చిన నాటి నుంచి అన్ని ఎన్నికల్లో ఓటు వేస్తున్నానని, ఈసారి పోలింగ్ కేంద్రానికి  వెళ్లలేని పరిస్థితిలో ఇలా ఓటువేయడం ఆనందంగా ఉందని ఆ వృద్ధురాలు తెలిపింది. ఖానాపూర్ నియోజకవర్గంలో మొత్తం 64 మంది ఇంటి నుంచి ఓటేసేందుకు అర్హులుగా అధికారులు గుర్తించారు.

నేను ఈసారి ఓటేస్త అనుకోలే..

కాగజ్ నగర్: మంచం మీది నుంచి కదల్లేని స్థితిలో ఉన్న కౌటాల మండల కేంద్రానికి చెందిన 86 ఏండ్ల వృద్ధురాలు రావుల మైనుబాయి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ఆఫీసర్ తిరుపతి, ఇతర అధికారులు ఎన్నికల సామగ్రితో గురువారం మైనుబాయి ఇంటికి చేరుకోగా ఆమె తన కోడలు సాయంతో పోస్టల్​బ్యాలెట్​ఓటు వేశారు. తాను మంచం మీది నుంచి లేవలేని స్థితిలో ఉన్నానని, ఈసారి ఓటు వేస్తానని అనుకోలేదన్నారు. ఈసారి కూడా ఓటు వేయడం ఆనందంగా ఉందన్నారు.

ALSO READ : కాంగ్రెస్ తోనే బలహీన వర్గాలకు న్యాయం : పాయం వెంకటేశ్వర్లు